ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మతపరంగా క్రైస్తవులు అయినప్పటికీ విశాఖ శారదా పీఠంపై మాత్రం ఎనలేని మక్కువ చూపుతుంటారు. ఆ పీఠాధిపతి ఆశీర్వాదాలకు పదే పదే వెళ్తూ.. ఆయనకు కావాల్సిందల్లా చేసిపెడుతుంటారు. నిజమైన దేవుళ్ల పట్ల అంతగా భక్తిభావం కనబర్చని జగన్ మోహన్ రెడ్డి.. విశాఖ శారదా పీఠాధిపతిపై అలా భక్తి ఒలకబోయడంపై కూడా విమర్శలు వచ్చాయి. శారదా పీఠానికి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎంతో విలువైన భూములు సైతం కట్టబెట్టారు.
శారదా పీఠం కోసం విశాఖపట్నంలో 15 ఎకరాల భూమిని.. ఒక్కో ఎకరం రూ.లక్ష కే 2021లో ధారాదత్తం చేశారు. కానీ, ఆ 15 ఎకరాల భూమి మార్కెట్ విలువ రూ.225 కోట్లుగా ఉంది. విశాఖ శారదా పీఠం కార్యకలాపాలు విస్తరణ కోసం అని చెప్పి ప్రభుత్వం తేరగా.. వారికి కట్టబెట్టేసింది. అయితే, తాజాగా శారదా పీఠం భూమి వ్యవహారం మరో మలుపు తిరిగింది. నిజానికి శారదా పీఠం తమ సంస్థ కార్యకలాపాలకే ఆ స్థలాన్ని వాడుకోవాలని ప్రభుత్వం అప్పట్లో షరతు పెట్టింది. కానీ, ఆ భూమిని తాము తమ ఆదాయ వనరులుగా మార్చుకుంటామని, అందుకు అనుమతులు ఇవ్వాలని శారదా పీఠం సీఎంవోకు లెటర్ రాసింది.
దీంతో ప్రభుత్వంలో హడావుడి పెరిగింది. షరతులపై సవరణ ఉత్తర్వులు ఇవ్వాలని విశాఖపట్నం జిల్లా రెవెన్యూ అధికారులపై సీఎం కార్యాలయం ఒత్తిడి పెంచింది. దీంతో అసలు ఈ వ్యవహారంపై తాజాగా దీనిపై ఉన్నత స్థాయి రివ్యూ జరిగింది. ఆ భూమిని ఎలా వినియోగిస్తారో పీఠం సరిగా వివరించలేదని విశాఖ జిల్లా అధికారులు అందులో చెప్పారు. శారదా పీఠం విజ్ఞప్తిపై దేవాదాయ శాఖ నుంచి అభిప్రాయం అందిన తర్వాతే దీనిపై చర్చించాలని.. ఆమోద విషయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. పైనుంచి ఒత్తిడి ఉన్నా తమ నిర్ణయాన్ని నేరుగా చెప్పేందుకు అధికారులు వెనకాడారు. తాత్కాలికంగా దేవాదాయ శాఖ ప్రతిపాదనలు లేకపోవడాన్ని తెరపైకి తెచ్చారని సమాచారం.
అయితే, శారదా పీఠం అభ్యర్థనపై అసలు దేవాదాయ శాఖ నుంచి ప్రతిపాదనలు వస్తాయా లేదా తర్వాత నిర్వహించబోయే కేబినెట్ మీటింగ్ లో ప్రభుత్వమే ఏకపక్షంగా నిర్ణయం తీసేసుకుంటుందా? అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. తాజా పరిణామాలను బట్టి చూస్తే.. ఉన్నతాధికారులు కావాలనే ఈ విషయంపై తాత్సారం చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అంత విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా శారదాపీఠానికి కట్టబెట్టడం ఇష్టం లేకే ఈ వాదన తెరపైకి తెచ్చారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంకో మూడు నెలల్లో ప్రభుత్వం మారుతుందనే గట్టిగా నమ్ముతుండడం వల్లే.. ఇలా చేయగలుగుతున్నారని స్పష్టం అవుతోంది.











