ఏపీ రాజధాని ప్రాంతం నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఒక్కో కార్యాలయాన్ని ప్రభుత్వం తరలిస్తోంది. ఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీ ప్రధాన పాలనా కార్యాలయాన్ని విశాఖ ద్వారకా బస్ భవన్‌పై ఏర్పాటు చేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళగిరిలో ఉన్న డీజీపీ కార్యాలయాన్ని కూడా విశాఖకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లు విశాఖలో ఇప్పటికే చేసినట్టు తెలుస్తోంది. మెట్రో రైల్ కార్యాలయాన్ని కూడా ఇప్పటికే విశాఖ తరలించారు. తాజాగా విజయవాడ సమీపంలోని కంకిపాడులో ఉన్న వెటర్నరీ, బయోలాజికల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను కడప జిల్లా పులివెందులకు తరలిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ విజ్ఙప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఒక అధికారి కోరితే పరిశోధనా సంస్థలను ఎక్కడికైనా మార్చి వేస్తారా అనే ప్రశ్న తెలెత్తక మానదు. రాజధాని ప్రాంతంలోని అనేక కార్యాలయాలను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా భావిస్తున్న విశాఖకు లేదంటే పులివెందులకు తరలించడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.
పెట్టుబడులు వచ్చినా అక్కడికే
రాష్ట్రంలో పెట్టుబడులు రావడమే తగ్గిపోయింది. ఇక ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తే వారిని నేరుగా కడప, పులివెందులకు పంపిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పెద్దలు సలహా ఇస్తున్నారు. తిరుపతి సమీపంలో పెట్టుబడులు పెట్టేందుకు డిక్సన్ కంపెనీ ముందుకు వచ్చింది. అయితే పులివెందులలో కంపెనీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వారు అసలు ఏపీలో కొత్తగా పెట్టుబడులు పెట్టడం నిలిపివేశారని తెలుస్తోంది. పోస్కో కంపెనీని కూడా కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని సీఎం ఆదేశించారట. వారు అక్కడ అనువైన ప్రదేశం కోసం వెతికారని కూడా తెలుస్తోంది. కడపలో సాధ్యం కాకపోతే కృష్ణపట్నంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని కోరినట్టు స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు.
విశాఖకు తరలిపోయిన పోలీస్ కంట్రోల్ రూం
ముందుగా విజయవాడలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన పోలీస్ కంట్రోల్ రూం కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆఘమేఘాలపై ఫైల్ నడిపించారు. కంట్రోల్ రూం ఏర్పాటుకు అవసరమైన రూ.13.80 కోట్ల నిధులను కూడా విశాఖకు బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో విజయవాడలో పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు నిలిచిపోయింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా విశాఖకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో కంట్రోల్ రూం కూడా అక్కడే ఏర్పాటు చేస్తేనే ప్రయోజనం ఉంటుందని అధికారుల సూచన మేరకు విశాఖకు తరలించినట్టు తెలుస్తోంది.
ఏప్రిల్ రెండో వారంలో తరలింపునకు ఏర్పాట్లు
వచ్చే నెల రెండో వారంలో విశాఖ నుంచి పాలన సాగించాలని ఏపీ ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. రాజధాని తరలింపు వ్యవహారం కేసు హైకోర్టులో ఉండటంతో వ్యవహారం గుట్టుగా నడిపిస్తున్నారు. ఏ క్షణంలో కోర్టు తీర్పు వెలువడినా వెంటనే రాజధాని విశాఖకు తరలించే విధంగా చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ముందుగా సీఎం క్యాంపు కార్యాలయం వచ్చే నెల రెండో వారంలో విశాఖలో ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. మిగిలిన కార్యాలయాలు ఒక్కొక్కటి ఇప్పటికే విశాఖ తరలిపోతున్నాయి. ఇక అమరావతి రాజధానిలో, విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో మిగిలిపోయిన కార్యాలయాలు కూడా తరలించేందుకు విశాఖలో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభుత్వ కార్యాలయాలు అమరావతి రాజధాని ప్రాంతం నుంచి ఒక్కోటి తరలిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
Must Read ;- అమరావతి నుంచి.. విశాఖ ఉక్కు వరకు.. రావణ కాష్ఠంలా జగనన్న రాజ్యం!