అందరికీ వందనాలు, ఉభయ కుశలోపరి అని నేననలేను. మీరు క్షేమమే నా క్షేమం. మీ స్మృతుల్ని మోసుకొచ్చిన ఆ ఉత్తరం ముక్కను నేను. ఇప్పుడు నా గుండె చెక్కలైంది. అందుకే ఈ ఆవేదన.
అలనాటి మేఘసందేశాలు.. హంస రాయబారాలు.. పావురాళ్లు మోసుకొచ్చిన ఊసులు.. వెరసి నాకంటూ ఓ రూపునిచ్చారు మీరు. మీ ఒడిలోనే నేను ఓనమాలు నేర్చుకున్నా. నా సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మలుపులు.. మరెన్నో మెరుపులు. మీరు రాసిన ప్రతి అక్షరం నా గుండెలపై అలికిడి చేసింది. ఆ కొట్టివేతలూ, ఆ దిద్దుబాట్లూ.. భావావేశం కోసం మీరు పడ్డ పాట్లూ.. అబ్బబ్బ ఏం చెప్పనులే.. మీ రాతలు చూసీ చూసీ నాక్కూడా భాష వచ్చేసింది. మనిషికి నిద్ర, జీవితానికి మరణం.. ఈ రెండూ మనకు దేవుడిచ్చిన వరాలే. అన్నిటినీ మరిపించే శక్తి ఈ రెండింటికీ ఉంది. ఇంత వైరాగ్యమేంటా అనుకుంటున్నారా? జ్ఞాన బోధ చేస్తే చివరికి మిగిలేది అదే కదా.
జీవితంలో తీపి జ్ఞాపకాలే కాదు చేదు అనుభవాలూ ఉంటాయి. అన్నిటినీ గుర్తు చేసే శక్తి కలానికి ఉన్నట్టే .. ఏదైనా చేయగలిగే శక్తి కాలానికే ఉంది. కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ.. ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ.. మరి నాది ఏ రకపు బాధో నాకే బోధపడటం లేదు. కాలమనే అడకత్తెరలో నేనో పోకచెక్కనయ్యాను.. నా గుండెచెక్కలైంది. నా మనసు తెల్ల కాగితం వెలవెల బోతోంది. దానిమీద మీ కబుర్ల సిరా అలికిడేది? తెలుగు లోగిళ్లలో అందమైన అక్షరాలతో ఉత్తరాల ముగ్గులు వేసేవారు.. ఇవాళ ఆ సందడేది? ఆ సిరా చుక్కలు.. వాటి చమక్కులు.. అవి కక్కిన పాళీలూ ఏవీ.. ఎక్కడా కనపించవే? నేను నిన్నటిదాకా మీ పాటల పూదోటలో వనమాలిని.. ఇప్పుడు పనికిమాలిన దాన్ని.
ఎందుకంటే అందాల అప్సరస కనుసైగ చేస్తే పెళ్లాం ఏడుపుగొట్టు మొహందే అవుతుంది. అలాంటి అప్సరసలే ఇవాళ మీ ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా.. మీకూ ‘సోషలి’జం వచ్చేసినట్టుంది. అయిన నా ఏడుపు ఎవరికి కావాలిలే. ఇల్లలకగానే పండగ కాదు సుమా. మీరు నా కోసం పరితపించిన రోజుల్ని నేను మరచిపోలేదు. చకోర పక్షుల్లా నా కోసం మీరు ఎదురు చూడలేదా? మీ పదాల ఒరవడినీ చూశాను.. మీ పెదాల తడినీ చూశాను. నా సందేశం అందగానే నాకు ముద్దులు పెట్టి గుండెలకు హత్తుకున్న రోజులూ నాకు గుర్తున్నాయిలెండి.
మీ రహస్యాలు ఎక్కడ బయటపడతాయోనని నన్ను ముక్కలు ముక్కులు చేసి పారేసిన రోజుల్నీ నేను మరచిపోలేదు. అవసరం తీరగానే ఇంటి చూరులో కుక్కారు.. ఇనప చువ్వలకు గుచ్చారు.. అయినా అన్నీ సహించా. నా ఎర్ర డబ్బా నిండిపోతే పెన్నుపెట్టి మరీ నన్ను లోపలికి నెట్టిన రోజులు మీకు గుర్తులేవేమో.. నాకు గుర్తున్నాయి. నన్నే కాదు నా ఎర్రడబ్బాల్నీ మరచి ఎలక్ట్రానిక్ డాబా వైపు పరుగులు తీశారు. ఏంచేస్తాం ఇప్పుడా ఎర్ర డబ్బా ఖాళీ. అసలు రోడ్డెక్కితే చెత్త డబ్బాలే తప్ప ఎర్రడబ్బాలెక్కడ?. పాపం నన్ను మోసిన బక్క ప్రాణి.. అదేనండీ పోస్ట్ మ్యాన్.. తన డొక్కు సైకిల్ తో ఎంత భారంగా బతుకు వెళ్లదీశాడో కదా.
అతగాడి రాక కోసం గేటు దగ్గరకు పదే పదే వెళ్లి మీరు ఎదురుచూడలేదా? మీ కళ్లముందు నుంచే అతను వెళ్లిపోతుంటే మీరు ఆపి ‘ఏమోయ్.. నాకేమైనా ఉత్తరాలొచ్చాయా?’అని మీరడగడం.. ‘రాలేదండీ’ అని అతను అనడం మీకు గుర్తుందా? అయినా మీ పిచ్చిగానీ ఉత్తరాలొస్తే ఆయన మాత్రం దాచుకుంటాడటండీ. మీరు దారిలో ఎదురుపడ్డప్పుడు కూడా ఇచ్చాడు కదా. బళ్లోకెళితే ‘టాపా.. డబ్బా’ అంటూ మా పేర్లను మీరు వల్లె వేసిన సంగతులన్నీ నాకు తెలుసు. ఎవరన్నా చనిపోతే ‘వాడు టపా కట్టేశాడ్రోయ్’ అంటూ మీరు వేసిన సెటైర్ల సంగతి ఎవరికి తెలీదూ. మీ ఊళ్లో నాలుగు అక్షరం ముక్కలొచ్చిన వాడెవడైనా ఉంటే వాడు మహా గొప్పోడేనండోయ్. నా గుండెలపై అక్షరాలు దిద్దీ దిద్దీ ఎంతో మంది గొప్ప కవులయ్యారనే గర్వం నాకూ ఉంది.
మన కవులకూ కళాకారులకూ నా మీదెంత ప్రేమో. ఎన్నో సినిమాలకు నన్నే కథావస్తువుగా ఎంచుకున్నారు. శ్రీవారికి ప్రేమ లేఖ, శుభలేఖ, ప్రేమలేఖలు.. అంటూ సినిమాలు తీసీ సంపాదించుకున్నారు.. చూసి మీరు ఆనందించారు. నా గురించి పాటలు పాడించారు.. ఆటలు ఆడించారు. ‘మా తాత ఉత్తరం ఎక్కడికో పోయింది..’అంటూ ఆడుకున్న సంగతులన్నీ నాకింకా గుర్తున్నాయి. ‘తోకలేని పిట్ట తొంభై ఆమడల దూరం వెళ్లింది’ విప్పుకో చూద్దాం అంటూ మీరు వేసుకున్న పొడుపు కథలు నాకిప్పటికీ గుర్తే. మీ జీతం.. జీవితం.. అన్నీ నా చలవే. ఇంతాచేస్తే మీరు నాకిచ్చిందేంటి? ఉత్తరదక్షిణాలంటూ నన్ను దిక్కుల్లో చేర్చారు. సిఫార్సు లేఖ పంపిస్తే ఉత్తరం అన్నారు.. ఆమ్యామ్యా ఇస్తే దాన్ని దక్షిణం అన్నారు. మీరు రాసిన ఆ ఉత్తరం ముక్క మీకెన్నిసార్లు డబ్బు పంపలేదూ.
మీ కష్టాలూ మీ సుఖాలూ అన్నింటిలోనూ నాకూ వాటా ఉంది. ప్రేమ కవిత్వం పేరుతో రకరకాల పైత్యాన్నినాపై గుమ్మరించిన రోజులు మీకు గుర్తులేవా? మన భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి ‘కుశలమా నీకు కుశలమేనా?’అంటూ బలిపీఠం సినిమాలో రాసిన పాట ఇంకా మీ మనసు పొరల్లో మెదులుతోంది కదూ. ‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు అంటూ రమ్యమైన శైలిలో కవిత్వం రాసిన మన తిలక్ మా తపాలా బంట్రోతు గురించి ఏమన్నారో తెలుసా? ‘ఎండలో వానలో ఎండిన చివికిన ఒక చిన్న సైజు జీతగాడు.
చెవిలో పెన్సిల్.. చేతిలో సంచీ.. ఖాకీ దుస్తులు.. అరిగిన చెప్పులు.. ఒక సాదాసీదా పేదవాడు.. వీధి వీధికీ ప్రతిరోజూ తిరిగేవాడు.. ప్రైమ్మినిస్టరా ఏం’అంటూనే మా బంట్రోతు ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. కథకుడు గోపీచంద్ నన్ను ‘పోస్టు చేయని ఉత్తరాలు’గా గుర్తుచేస్తున్నందుకు మాత్రం ఇప్పుడు నా మనసెందుకో కలుక్కుమంటోంది. మరణించిన తమ ఆప్తుడి చుట్టూ కూర్చుని రేపు మరణించబోయేవారంతా ఏడుస్తున్నారు అన్నాడో కవి. ఎంత గొప్ప ఫిలాసఫీ ఇది. నేను లేని ప్రపంచాన్ని ఊహించినప్పుడల్లా నాకిలాంటి ఫిలాసఫీ గుర్తొస్తుంటుంది. వడ్డెర చండీదాస్ ‘చీకట్లోంచి చీకట్లోకి’ రాస్తూ ఈ మధ్యలో ఉన్న వెలుగు ఏదైతే ఉందో అదే జీవితం అంటాడు. ఇప్పటిదాకా నా వెలుగంతా అదే కాబోలు. ఇప్పుడు మీ అంతర్జాలంలో అంతర్థానమైపోయాను.
నేను లేని ప్రపంచంలో మీరంతా ఉన్నందుకు నాకూ ఆనందమే. ఈ సృష్టిలో పునాదులూ ఉంటాయి సమాధులూ ఉంటాయి. మీ చేతగాని రాతలతో మీరు చేసిన ఎన్నో తప్పులను భరించాను. భాష రాకపోయినా మీ భావాన్ని అందించాను. తప్పులను ఒప్పులుగా భావించమని మీరు చెప్పినట్టే చేశాను. ఇంతచేసినా మీరు నన్ను మరచిపోయారు. ఈమెయిలొచ్చి నాకు ఒకింత ఊరటనిచ్చింది. వాట్సాప్ లాంటివి వచ్చి నీకేం ఎసరు పెడతాయోననే భయం కూడా ఉంది. ఈ కాగిత రూపం డిజిటల్ రూపానికి మారిందిన్న సంతృప్తి ఉంది. గుప్పిట్లో ఉన్నంత వరకే గుట్టు.. విప్పితే ఇంకేముంటుంది. మీ సోషల్ నెట్ వర్క్ లు ఏంచేస్తున్నాయో నాకూ తెలుసు.
కాలంతో పోరాడే శక్తి ఎవరికీ ఉండదు. మీ అవసరాల కోసం నన్ను సృష్టించుకున్నారు. అవి తీరాక నన్ను పాతరేశారు. కాలగతిలో వేగం వచ్చేసింది.. కాళ్లతో పరుగులు.. కళ్లతో పలకరింపులు.. ఈ యాంత్రిక జీవితంలో నా మంత్రాలేవీ పనిచెయ్యవు. అసలు నా పేరులోనే దోషముందేమో.. వాస్తులో ఉత్తరం ఖాళీ.. అనే మాటను తరచూ వినేదాన్ని . చివరికి నేనే ఖాళీ అవుతానని ఊహించలేదు. కొత్త సింగారాలున్నప్పుడు ఈ పాత బంగారంతో పనేముంటుంది. కాకుల కొలువులో నాలాంటి కపోతాలకు తావులేదు. మీ ఇంట్లో అందరినీ మరీమరీ అడిగినట్టు చెప్పండి. నేనే టపా కట్టే రోజు వచ్చేసింది. ఎన్నో అడ్రసులు చూసిన నేనే నా అడ్రసు గల్లంతవుతుందని ఊహించలేదు. నా జీవితం ముగిసే సమయం ఆసన్నమైంది. గతం గత: ఉత్తరం హత:.. ఇదీ నా విషాద స్మృతి గీతం.. సెలవా మరి.
ఒకప్పటి మీ ఆత్మీయనేస్తం.. మీ గుండె కవాటం..
మీ
ఉత్తరం










