గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ మైండ్ గేమ్ మొదలు పెట్టింది. ఇప్పటికే ప్రచారంలో అన్ని పార్టీల కంటే వేగంగా దూసుకు వెళ్తున్న ఆ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కూడా రంగంలోకి దింపింది. టీఆర్ఎస్‌లో కేవలం ఒక్క కేటీఆర్ మాత్రమే అన్ని తానై కర్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రోడ్ షోలు , పబ్లిక్ మీటింగ్‌లతో బీజేపీని ఏకి పారేస్తున్నారు. ప్రధానంగా వరద సాయం నిలిపివేత… కేంద్ర నిధులపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పోటాపోటీగా సవాళ్ళు, ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నాయి. ఇక ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనపై వివిధ రకాల విశ్లేషణలు జరుగుతున్నాయి.
ఊహించని విధంగా బీజేపీ ఎదురుదాడి
గ్రేటర్ ఎన్నికల ముందు వరకు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణాలో ఏక ఛత్రాదిపత్యం సాధించింది. ప్రతిపక్ష పార్టీలకు కనీసం నోరు తెరిచే అవకాశం కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నేతలను తమ పార్టీలో చేర్చుకుని ఆ పార్టీని నిర్వీర్యం చేసింది. ఎంఐఎంతో అంతర్గత ఒప్పందంతో కలిసి నడుస్తోంది. ఇక బీజేపీకి ఉన్నది ఒకే ఒక్క ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ. నాలుగు ఎంపీ స్థానాలు గెలిచినా ఆ తరువాత స్థానిక సంస్థల్లో చేతులెత్తేసింది. దీంతో టీఆర్ఎస్ ఎదురులేకుండా పాలన సాగిస్తూ వచ్చింది. అయితే గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ వస్తోందన్న సమాచారం అందగానే బీజేపీ ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయింది. గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుని షెడ్యూల్ విడుదల కాగానే తన విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రాష్ట్ర నాయకత్వం మొత్తం రంగంలోకి దిగి మాటల తూటాలు పేలుస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులను కనీసం ఎదురు మాట్లాడే వారే అప్పటి వరకు ఉండే వారు కాదు. మొదటగా నలుగురు ఎంపీలు ఎదురు దాడి ప్రారంభించారు.. ఆ తరువాత ఆ పార్టీ నేతలంతా ఒక్కొక్కరుగా మాటల దాడి తీవ్రం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఊహించని విధంగా ఎదురుదాడి జరుగుతుండటంతో ప్రజల్లో కూడా బీజేపీకి మంచి మార్కులు వస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also Read ;- ఆ ప్రకటన రెండు పార్టీల ఓటర్లను బీజేపీ దగ్గరకు చేరుస్తుందా..?
ప్రచారం చివరి ఘట్టంలో టీఆర్ఎస్‌కు మారో షాక్
ప్రచారం చివరి దశకు చేరుకుంటున్న వేళ టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ ఇచ్చింది బీజేపీ. కరోనా వాక్సిన్ పరిశీలిచేందుకు ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చారు. ఎన్నికలకు మూడు రోజుల ముందు మోడీ హైదరాబాద్ పర్యటన చర్చనీయాంశం అయ్యింది. ఇంత హడావుడిగా మోడీ హైదరాబాద్ రావడంపై టీఆర్ఎస్ పార్టీ షాక్‌కు గురైంది. గ్రేటర్‌లో బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే మోడీ హైదరాబాద్ వస్తున్నారంటూ ప్రచారం ప్రారంభించింది. ఇక ప్రధాని పర్యటనకు రాజకీయ పరంగా పెద్దగా ప్రాధాన్యత లేదని.. ఇది అధికారక పర్యటనగా చెబుతున్నారు బీజేపీ నేతలు. అయితే, ప్రధాని మోడీ పర్యటనలో ప్రోటోకాల్ అంశం చర్చనీయమయ్యింది. మోడీకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి, గవర్నర్‌తో పాటు ఎవరూ రావల్సిన అవసరం లేదంటూ పీఎంఓ నుండి సమాచారం వచ్చింది. దీంతో టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి ముఖ్యమంత్రి స్వాగతం పలకడం ఆచారంగా వస్తోందని.. ఇప్పుడు ఆ సంప్రదాయానికి తిలోదకాలు ఇవ్వడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అంటున్నారు ఆ పార్టీ నేతలు. అయితే టీఆర్ఎస్ నేతలు ఎంత మొత్తుకున్నా మోడీ కేసీఆర్‌ను కలవరని … ప్రస్తుత పరిస్థితుల్లో అది పార్టీకి అంత శ్రేయస్కరం కాదంటున్నారు బీజేపీ నేతలు. గ్రేటర్ ఎన్నికల వేళ టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని చెప్పడానికి మోడీ వేసిన ప్లాన్‌లో భాగమే ఇదంటున్నారు విశ్లేషకులు. బీజేపీ మైండ్ గేమ్‌ను టీఆర్ఎస్ ఎలా తిప్పికొడుతుందో చూడాలి.
Must Read ;- బీజేపీ నోట.. మధ్యంతర ఎన్నికల మాట:సంచలన వ్యాఖ్యలు!











