విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రధారుడిగా సన్నాఫ్ ఇండియా రూపొందింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. దీనికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు. చాలా గ్యాప్ తర్వాత మోహన్ బాబు మళ్లీ తెరపైకి వచ్చారు. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
అన్యాయాన్ని, అధర్మాన్ని సహించలేని విరూపాక్ష అలియాస్ బాబ్జీ (మోహన్ బాబు) పాత్ర ఇది. ఎన్ఐఏ కార్యాలయంలో తాత్కాలిక డ్రైవర్. ఆ సమయంలోనే కేంద్ర మంత్రి (శ్రీకాంత్), దేవాదాయ శాఖ మంత్రి (రాజా రవీంద్ర), ఓ డాక్టర్ కిడ్నాప్ అవుతారు. ఎన్ఐఏ ఆఫీసర్ ఐరా (ప్రగ్యా జైస్వాల్) తన బృందంతో ఈ కేసును ఛేదిస్తుంటుంది. ఈ కిడ్నాప్ లకూ విరూపాక్షకూ ఉన్న సంబంధమే ఈ కథ. చట్టాన్ని తన చేతుల్లోకి అతను ఎందుకు తీసుకున్నాడన్నది తెర మీద చూడాల్సిందే.
ఎలా తీశారు? ఎలా చేశారు?
ప్రయోగాలు చేస్తే ఎలా వికటిస్తుందో ఉదాహరణగా ఈ సన్నాఫ్ ఇండియాను చెప్పవచ్చు. వెబ్ సిరీస్ కు ఎక్కువ సినిమాకి తక్కువ.. ఈ సినిమా. కేవలం 80 నిమిషాల వ్యవధిలోనే సినిమా ముగుస్తుంది. వంద మంది దోషులు శిక్షకు గురికావచ్చుగానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అంటుంది చట్టం. అలాంటిది జైళ్లలో ఎంతో మంది నిర్దోషులు శిక్ష అనుభవిస్తుంటే చూస్తూ ఊరుకుంటే ఎలా అన్న ఆలోచనే ఈ కథకు ప్రేరణ అనుకోవచ్చు. కానీ దీన్ని సినిమాగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు.
పాత్రల మొహాలు చూపించకుండా ఆయన ఏం సాధించదలుచుకున్నాడో మనకు అర్థం కాదు. కథ లైన్ బాగున్నా దాన్ని ఆసక్తికరంగా చెప్పలేకపోయారు. విరూపాక్ష పాత్ర కోసమే ఈ సినిమా తీసినట్టు ఉంది. మోహన్ బాబు విలక్షణ నటుడు కాబట్టి ఆ పాత్రకు న్యాయం చేశారు. కాకపోతే నటన మోతాదు మించిది. డైలాగ్స్ తో సినిమాని విజయవంతం చేయవచ్చనుకోవడం భ్రమ. ఓటీటీ సినిమాని థియేటర్ లో విడుదల చేయాలనుకోవడం మరో తప్పిదం. చిరంజీవి గాత్రంతో మోహన్ బాబు పాత్రను పరిచయం చేయడం విరూపాక్షను ఎలివేట్ చేయడం కోసం కావచ్చు.
సినిమాలో డైలాగ్స్ పేలవచ్చుగానీ సందర్భోచితంగా ఉంటేనే అవి రక్తికడతాయి. ఇందులో ఉన్న ప్రధాన లోపం కూడా అదే. మనిషి కష్టాలను ప్రగ్యా జైస్వాల్ ముందు ఏకరువు పెట్టే డైలాగ్ వింటే ఇలా రాయడానికి ఎంత కష్టపడ్డారురా బాబూ అనిపిస్తుంది. ‘చాలా కష్టాలున్నాయి..తొలి వలపు కష్టం, తొలి కాన్పు కష్టం, తొలిరాత్రి కూడా కష్టమే..’ అంటూ సాగుతుంది ఆ డైలాగ్. చప్పట్లు కొట్టాలంటే కొట్టొచ్చు. రఘువీరగద్యని ఇళయ రాజాతో కంపోజ్ చేయించడం ఒక్కటే ఇందులో మెచ్చుకో తగ్గ అంశం. ఖర్చు లేకుండా సినిమా తీసి జనం మీదికి వదలడమే చేసిన పెద్ద తప్పు.
నటీనటులు: మోహన్ బాబు, మీనా, ప్రగ్యా జైస్వాల్, మంగ్లీ, శ్రీకాంత్, పోసాని కృష్ణ మురళి, ఆలీ, బండ్ల గణేష్, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు.
కెమెరా: సర్వేష్ మురారి
సంగీతం: ఇళయరాజా
ఎడిటింగ్: గౌతంరాజు
నిర్మాత: విష్ణు మంచు
దర్శకత్వం: డైమండ్ రత్నబాబు
విడుదల తేదీ: 18-02-2022
ఒక్క మాటలో: ఓన్లీ వన్ ఆఫ్ ఆఫ్ ఇండియా
రేటింగ్: 1.5/5