సినిమాల విలన్ సోనూ సూద్ తెలుగు సినిమా వాళ్లకు హీరో అయిపోయాడండోయ్. అపర దానకర్ణుడిగా కరోనా కాలంలో పేరుతెచ్చుకున్న సోనూ సూద్ చాలాకాలం తర్వాత హైదరాబాద్ లో షూటింగ్ నిమిత్తం అడుగుపెట్టాడు. ఇప్పటిదాకా షూటింగులు లేకపోవడంతో సోనూ హైదరాబాద్ కు రావడం కుదరలేదు. రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ‘అల్లుడు అదుర్స్’లో ఆయన పాల్గొనవలసి ఉంది. దీనికోసం సోనూ ముంబయి నుంచి హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. ఈ సినిమాకు సంబంధించి ఐదు రోజుల టాకీ పార్ట్, మూడు పాటలు చిత్రీకిరించాల్సి ఉంది. టాకీ పార్ట్ షూటింగ్ కోసం సోనూ రావలసి వచ్చింది. ఈ సెట్ లో మరో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. సోనూ రాగానే ఆయనకు అందరూ స్వాగతం పలికి శాలువా కప్పి సత్కరించారు. పొగడ్తలతో ముంచెత్తారు. చిత్ర యూనిట్ అంతా సోనూను సత్కరించింది.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన సోనూ
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన మూడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సోనూ కూడా భాగమయ్యారు. రామోజీ ఫిలిం సిటీలో సోనూ సూద్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సోనూ సూద్ ప్రముఖ సినీ దర్శకుడు శ్రీను వైట్ల ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి తాను ఈ మొక్కలు నాటినట్లు తెలిపారు. జోగినపల్లి సంతోష్ కుమార్ ఇలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా ఆనందం కలిగించిందని అన్నారు. కరోనా కాలంలో పర్యావరణ పరిరక్షణ అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే స్ఫూర్తితో లక్షలాది మంది గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని సోనూ సూద్ పిలుపునిచ్చారు.











