తమిళ హీరో సూర్య కార్యాలయంలో బాంబు ఉందంటూ వచ్చిన ఫేక్ కాల్ కలకలం రేపింది. తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ హీరోగా కొనసాగుతున్న సూర్యను కేటుగాళ్లు టార్గెట్ చేశారు. చెన్నై అల్వార్‌పేట ప్రాంతంలో ఉన్న హీరో సూర్య ఆఫీసులో బాంబు పెట్టినట్లు సోమవారం పోలీసులకు ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే డాగ్‌స్వ్కాడ్‌ను తీసుకెళ్లి తనిఖీలు చేశారు. ఆ ప్రాంతంలో ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో అది ఫేక్ కాల్ అని నిర్ధరించుకున్నారు. అయితే ఈ కాల్ ఎవరు చేశారు, ఎక్కడి నుంచి చేశారు అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల తమిళ హీరోలను వరుస బాంబు బెదిరింపులు కలవరపరుస్తున్నాయి.
సూపర్‌స్టార్ రజినీకాంత్, అజిత్, మణిరత్నం, విజయ్ తదితరుల ఇళ్లు, ఆఫీసుల్లో బాంబులు పెట్టామంటూ పోలీసులకు ఫోన్స్ వచ్చాయి. దీంతో పోలీసులు వెంటనే అక్కడ తనిఖీలు చేయగా అవన్నీ ఫేక్ కాల్స్ అని తేలింది. ఈ బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ పై పోలీసులు సీరియస్ గా తీసుకోని నిందితులను పట్టుకొని తగిన శిక్ష విధించాలని పలువురు సినిమా ప్రముఖులు పోలీసులను కోరుతున్నారు. గత కొంత కాలంగా ప్రముఖులకు ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కువ అవ్వడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
ఇటువంటి కేసుల కోసం పోలీసులు ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఆ బృందంతో దర్యాప్తు జరిపేలా తగు చర్యలు తీసుకుంటామని మీడియాకి తెలిపారు. ఈ ఫేక్ కాల్స్ పై స్టార్ హీరోల అభిమానులు స్పందించారు. ఇటువంటి పనులు చేసే వారు ఎవరైనా వెంటనే పట్టుకొని శిక్షించాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. తమ హీరోలకు ఎటువంటి ఆపద కలిగిన మేము చూస్తూ ఊరుకోమని అభిమాన సంఘాల నాయకులు తెలిపారు. హీరోల రక్షణ బాధ్యత పూర్తిగా పోలీసులు, ప్రభుత్వం చూసుకోవాలని వారు కోరారు. ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ పై సామాన్య ప్రజలు సైతం స్పందించడం విశేషం.











