కరోనా లాక్‌డౌన్ సమయంలో లక్షలాది మంది వలస కూలీలు ఇళ్లకు వెళ్లేందుకు సాయపడడమే కాకుండా, వారికి భోజన వసతులు కల్పించి సోనూ సూద్ రియల్ హీరో అనిపించుకున్న సంగతి తెలిసిందే. అలాగే.. చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం మహల్రాజపల్లిలో ఒక కుటుంబానికి ట్రాక్టర్ అందించిన విషయం కూడా వైరల్ గా మారిన సంగతీ విదితమే. అలాంటి సోనూసూద్ తాజాగా తన గొప్పతనాన్ని మరోసారి చాటుకున్నాడు. తెలంగాణ బాలుడికి 20 లక్షల సాయం చేసాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణలోని మహబూబాబాద్‌కు చెందిన బాలుడు హర్షవర్ధన్ కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు.
దీంతో బాలుడి తల్లిదండ్రులు సోనూసుద్‌ను కలిసి వైద్యానికి రూ.20 లక్షలు ఖర్చవుతుందని వివరించారు. చలించిపోయిన సోనూసూద్ బాలుడి వైద్య ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు. సోనూసూద్ ఇలా అందరికి సాయం చేయడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయనలాంటి మంచి మనిషి ఊరికి ఒక్కరున్నా చాలని అంటున్నారు. ఆయనను చూసి పెద్దవాళ్ళం అని చెప్పుకొనే సినీ ప్రముఖులు బుద్ది తెచ్చుకోవాలని వాపోతున్నారు. ఆయన అభిమానులే కాదు సామాన్య ప్రజలు కూడా సోనూసూద్ ని అభినందిస్తున్నారు.