ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రెండో దేశంగా భారత్ నిలిచింది. మన దేశం కోవిడ్ పై చెప్పే లెక్కులు సరికావవి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ప్రకటించారు. భారత ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారమే సెప్టెంబర్ చివరి నాటికి 67 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వచ్చిన కొత్తలో హడావుడి చేసిన ప్రభుత్వం, ఆదాయం పడిపోవడంతో గేట్లు ఎత్తేసింది. మార్చి 15 నుంచి ప్రారంభమైన కోవిడ్ నిబంధనలు అక్టోబర్ 15 నాటికి దాదాపుగా తొలగిపోతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తో పలు రాష్ట్రాల ఆదాయం పడిపోయి, దివాలా తీశాయి. ఏపీలాంటి రాష్ట్రంలో జీతాలు, ఫించన్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రతినెలా లక్ష కోట్ల జీఎస్టీ ఆదాయం రావాల్సి ఉండగా, ఏప్రిల్ లో 25 వేల కోట్లు మించలేదు. తాజాగా అన్ లాక్ 5 నాటికి జీఎస్టీ వసూళ్లు సాధారణ స్థితికి చేరుకున్నాయి. సెప్టెంబరులో జీఎస్టీ రూ.97 వేల కోట్లు వసూలైంది. అంటే వ్యాపారాలన్నీ దాదాపుగా ప్రారంభం అయ్యాయనే చెప్పవచ్చు. రోజుకు దేశ వ్యాప్తంగా 80 వేల కరోనా కేసులు నమోదవుతున్నా…కేంద్రం అన్ని వ్యాపారాలకు గేట్లు ఎత్తేసింది. అంటే జనం చనిపోయినా పరవాలేదు. ప్రభుత్వ ఆదాయానికి మాత్రం గండిపడటానికి వీల్లేదు అన్న చందంగా తయారైంది పరిస్థితి.
తగ్గింది కేసులా… టెస్టులా…
కరోనా తగ్గుముఖం పట్టిందని కేంద్రం ప్రకటించింది. అయితే వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంది. దేశ వ్యాప్తంగా రోజుకు 10 లక్షల కరోనా టెస్టులు చేయాల్సి ఉండగా, వాటి సంఖ్యను 6 లక్షలకు తగ్గించారు. సెప్టెంబరు మొదటి వారంలో ఏపీలో రోజుకు 70 వేల కరోనా టెస్టులు నిర్వహించగా, నేడు వాటి సంఖ్యను 50 వేలకు కుదించారు. కోవిడ్ పరీక్షలు అధికంగా నిర్వహించినప్పుడు ఏపీలో రోజుకు 10 వేల కరోనా కేసులు బయటపడ్డాయి. టెస్టులు 40 శాతం తగ్గించడంతో, కరోనా కేసులు కూడా ఆ స్థాయిలో తగ్గాయి. దేశంలోకానీ, రాష్ట్రంలో కానీ తగ్గింది కరోనా టెస్టులే కానీ కరోనా కేసులు కాదని గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.
చలికాలంలో చెలరేగే ప్రమాదం….
వర్షాకాలం ముగిసింది. ఇక శీతాకాలంలో కరోనా మరింత వేగంగా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనాకు టీకా వచ్చే వరకూ అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ప్రధాని మోదీ కూడా కరోనా వ్యాప్తిలో అగ్రస్థానంలో నిలిచిన 7 రాష్ట్రాలను హెచ్చరించారు. అవసరమైతే ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించుకోవాలని సూచించారు. అయితే కరోనా వేగంగా వ్యాపిస్తోన్న రాష్ట్రాలు మాత్రం అందుకు సుముఖంగా లేవు. ఇప్పటికే పలు రాష్ట్రాల ఆదాయం సగానికి సగం తగ్గిపోయింది. జీతాలు, పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు. గడచిన ఐదు నెలల్లోనే సంవత్సరంలో చేయాల్సినన్ని అప్పులు చేసేశారు. ఇక అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ లాక్ డౌన్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు కూడా ఇవ్వలేక ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కరోనాతో ఎంత మంది పోయినా పరవాలేదు. వ్యాపారాలు బంద్ పెట్టే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.
మీ చావు మీరు చావండి…
కరోనాపై ఏపీ ప్రభుత్వం ఎప్పుడో చేతులెత్తేసింది. నెమ్మదిగా టెస్టులు కూడా తగ్గించుకుంటూ వస్తోంది. మరో రెండు నెలల్లో కరోనా కేసులు ఏపీలో రోజుకు 500కు తగ్గిపోయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. అన్ లాక్ 5 నిబంధనలు త్వరలో అమల్లోకి రానున్నాయి. అదే జరిగితే ఇక సినిమా హాళ్లు కూడా తెరచుకోనున్నాయి. బొమ్మ పడితే, కరోనా మరింత వ్యాపించే ప్రమాదం ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్లు సినిమా హాళ్లు మూసి ఉంచడమే మంచిదని సలహా ఇస్తున్నారు.
నో మాస్క్…డోంట్ ఆస్క్…
కరోనా అంటే భయపడే పరిస్థితి తొలగిపోయింది. కనీసం మాస్క్ కూడా లేకుండా జనం రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రజలను కట్టడి చేస్తే తిరగబడతారని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాపారాలు మూసివేయకపోయినా పరవాలేదు. జనం మాస్కులు పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్ వాడుకోవడం లాంటి కనీస జాగ్రత్తలు కూడా మరచి చికెన్ షాపులు, మటన్ షాపులు, కూరగాయల మార్కెట్లు, వైన్ షాపుల వద్ద గుంపులు గుంపులు చేరుతున్నారు. ఇంత అవ్యవహారంగా ఉంటున్నా ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు.
ఏపీలో కరోనాతో సహజీవనం ప్రారంభమైనట్టేనా?
ఏపీలో కరోనా వైరస్ పట్టణాలు, పల్లెలు, గిరిజన గూడేలు అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాలను చుట్టేసింది. ఇప్పటికే 30 శాతం మందికి కరోనా వచ్చిపోయిందని సీరం ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. అంటే ఏపీలో కరోనాతో సహజీవనం ప్రారంభమైందనే చెప్పుకోవాలి. కరోనా చికిత్స కేంద్రాలను కూడా ఏపీలో మూసివేస్తున్నారు. ఇవన్నీ పరిశీలిస్తుంటే ఇక కరోనా అంటే సాధారణ జ్వరం అనేదాకా పరిస్థితికి ఏలికలు తెచ్చేస్తారేమోనని అనుమానం వస్తోంది. ఇదే వాస్తవం అయితే మంచిదే. కానీ వాస్తవం అలా కాకపోతే మాత్రం ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. .ఏముంది ఇక జనం చావు జనం చావాల్సిందేనన్నమాట.