ఉత్తరాంధ్ర జిల్లాల పాడి రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు స్థాపించబడిన విశాఖ డెయిరీ వ్యవహారంపై ఇప్పుడు స్వరత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ జిల్లాతో పాటుగా విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన పాడి రైతుల నుంచి పాల సేకరించి… తద్వారా వారి ఆర్థిక పురోగతికి తోడ్పాటు అందించాల్సిన విశాఖ డెయిరీ ఇప్పుడు.. పాడి రైతుల పాలిట శాపంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నడూ లేని రీతిలో పాడి రైతులకు పాల సేకరణ ధరలను తగ్గించిన డెయిరీ… ఏకంగా 3 లక్షల మంది పాడి రైతులకు నష్టం చేకూర్చే కఠిన నిర్ణయాన్ని తాజాగా తీసుకుంది. పాడి రైతుల నుంచి సేకరించే ఆవు పాలకు లీటరు ఒక్కింటికి రూ.3 చొప్పున ధరను తగ్గిస్తూ విశాఖ డెయిరీ సంచలన నిర్ణయం తీసుకుంది. విశాఖ డెయిరీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఉత్తరాంధ్ర పాడి రైతులు భగ్గుమంటున్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. .పాడి రైతుల ఆందోళనలతో ఇప్పుడు ఉత్తరాంధ్ర అట్టుడికిపోతోంది.
ఇటీవలి కాలంలో విశాఖ డెయిరీ అన్నీ రైతు వ్యతిరేక నిర్ణయాలనే తీసుకుంటోందన్న విమర్శలు ఉన్నాయి. పాడి రైతుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన డెయిరీని ప్రస్తుత యాజమాన్యం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే డెయిరీగా మార్చేసిందని ఆరోపణలు లేకపోలేదు. డెయిరీ ప్రస్తుత చైర్మన్ చెప్పినట్లుగా డైరెక్టర్లు వ్యవహరిస్తున్నారని, అసలు చైర్మన్ నిర్ణయాలను ప్రశ్నించే సాహసం ఒక్కరంటే ఒక్క డైరెక్టర్ కూడా చేయడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు. చైర్మన్ ఇస్తున్న తాయిలాలకు మరిగిన డైరెక్టర్ల బోర్డు…చైర్మన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా పొగడ్తలతో ముంచెత్తుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్లను తన గాటన కట్టేసుకున్న చైర్మన్ రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా డెయిరీ పేరిట లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు అంతకంతకూ ఎక్కువపోతున్నాయి. అయితే కూటమి సర్కారు అధికారం చేపట్టిన నేపథ్యంలో డెయిరీ ముసుగులో జరుగుతున్న అక్రమాలపై విచారణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం విశాఖ డెయిరీ వ్యవహారంపై విచారణ చేపట్టాలంటూ అటు జిల్లా కలెక్టర్ తో పాటు ఇటు పశుసంవర్ధక శఆఖ మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడులను కోరారు.
విశాఖ డెయిరీ అక్రమాలు, డెయిరీ పేరిట ప్రస్తుత యాజమాన్యం పాల్పడుతున్న అక్రమాలపై ఆదివారం మీడియా సమావేశాన్నినిర్వహించి అయ్యన్నపాత్రుడు… ఆవుల పాల సేకరణపై ఏకబిగిన రూ.3 తగ్గించడమేిమటని ప్రశ్నించారు. ఈ నిర్ణయంతో 3 లక్షల మంది దాకా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎక్కడైనా.. ఒకేసారి లీటరు పాల సేకరణపై రూ.3 తగ్గించిన దాఖలా ఎప్పుడనాన ఉందా అని ఆయన ప్రశ్నించారు. అడిగే వారు లేరన్నన ధైర్యంతో యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవరిస్తోందని ఆయన ఆరోపించారు. ఇలా రైతులకు పాల సేకరణ ధరను తగ్గించడం ఏ తరహా రైతు సంక్షేమని ఆయన నిలదీశారు. డెయిరీ చర్మన్ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నించి…నిలదీసే దమ్ము ఒక్కరంటే ఒక్క డైరెక్టర్ కు లేదని ఆయన మండిపడ్డారు. ఈ కారణంగానే డెయిరీ చైర్మన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే… రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాల్సిన విశాఖ డెయిరీ… విశాఖలో వందల కోట్ల రూపాయల విలువ చేసే 8 ఎకరాల స్థలాన్ని ఆక్రమించిందని అయ్యన్న ఆరోపించారు. ఈ వ్యవహారంపై జీవీఎంసీ కార్పొరేటర్ గా కొనసాగుతున్న జనసేన నేత మూర్తి యాదవ్ ఇటీవలే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన వైనాన్ని ఆయన గుర్తు చేశారు. మూర్తి యాదవ్ చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టి ఆక్రమణదారులపైై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యన్న కోరారు. ఇక పాడి రైతులకు అన్యాయం చేస్తూ విశాఖ డెయిరీ తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపట్టి. రైతులకు న్యాయం దక్కేలా మంత్రి అచ్చెన్నాయుడు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తానేదో స్పీకర్ హోదాలో అటు కలెక్టర్, ఇటు మంత్రికి ఆదేశాలు ఇవ్వడం లేదన్నఅయ్యన్న… ఓ విశాఖ జిల్లా పౌరుడిగా వారిని విన్నవించుకుంటున్నానని తెలిపారు. మొత్తంగా విశాఖ డెయిరీ ఇష్టారాజ్యంపై అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై త్వరలోనే విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.