విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రిలో ఇటీవల నియమించిన స్టాఫ్ నర్సుల నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నకిలీ సర్వీసు సర్టిఫికేట్లతో పలువురు అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందారనే అభియోగాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ‘బుర్రె .. బుర్రె … తప్పైపోయింది. మీరు తప్పుడు సర్టిఫికేట్లు పెట్టారు, మిమ్మల్ని ఉద్యోగం నుండి తీసేస్తున్నాం’ అంటూ ఐదుగురు స్టాప్ నర్సులకు ఉద్వాసన పలుకుతున్నట్లు డిసిహెచ్ ఓ జి. నాగభూషణరావు పేరిట ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉద్యోగ నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయనే వాదనలకు బలం చేకూరింది. ఇదేం చోద్యం. ఊస్టింగ్, పోస్టింగ్ వారిష్టమేనా?. నియామకాలకు ముందు చూసుకోనక్కర్లేదా?. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని, నకిలీలందరినీ ఏరివేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
98 మంది స్టాఫ్ నర్సుల నియామకం
విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన బాధ్యతలు నిర్వహించేందుకు 98మంది స్టాఫ్ నర్సులను నియమించనున్నట్లు రెండునెలల కింద జిల్లా వైద్య విధాన పరిషత్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ పోస్టుల కోసం జిల్లా నుంచి సుమారు 2200మంది దరఖాస్తు చేశారు. వీరందరి అర్హతలు, అనుభవం, ఇతరత్రా పరిశీలించి మెరిట్ లిస్టును జిల్లా వైద్య విధానపరిషత్ ప్రకటించింది. ఆ మెరిట్ లిస్టు ప్రకారం అభ్యర్థులను కాల్ చేసి, సర్టిఫికేట్లను పరిశీలించి డిసిహెచ్ ఓ నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీ ఉద్యోగ నియామకాలు చేపట్టింది.
రాజకీయ జోక్యం
కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఈ ఉద్యోగాల కోసం వేలం వెర్రిగా వెంపర్లాడారు. ఈ ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అదే తరుణంలో రాజకీయ జోక్యం పెచ్చురిల్లింది. చోటామోటా నుండి జిల్లా స్థాయి రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేశారు. వేరొక వైపు నిరుద్యోగులు ఉద్యోగం పొందేందుకు ఉన్న అవకాశాలు అన్ని వినియోగించుకునేందుకు అడ్డుతోవలు వెదుక్కున్నారు. అందులో ముఖ్యమైంది సర్వీసు సర్టిఫికేట్. వైద్య విధాన్ పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలో క్యాజువల్ ప్రాతిపదికన పనిచేసిన అనుభవం ఉంటే వారికి ప్రాధాన్యత కల్పించాల్సివుంది. దీన్ని ఆసరా చేసుకుని పలువురు నకిలీ సర్టిఫికేట్లు పొందుపరిచారు. మరికొందరు ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసిన అనుభవం ఉన్న సర్టిఫికేట్లు పొందుపరిచారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన వైద్యాధికారులు ఇష్టానుసారంగా నియామకాలు చేపట్టడంతో అనేకమంది అనర్హులు ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు.
శ్రీకాకుళంలో కదిలిన తీగ
శ్రీకాకుళం జిల్లాలోను ఇటీవల జిల్లా కేంద్రాసుపత్రిలో నియామకాలు జరిగాయి. అక్కడ పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా పార్మాసిస్టు ఉద్యోగానికి ఎంపికైన మహిళ సమర్పించిన సర్వీసు ధ్రువీకరణ పత్రం నకిలీది అని తేలింది. ఆమె విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం రూరల్ పిహెచ్‌సిలో ఫార్మాసిస్టుగా పనిచేసినట్టు సర్వీసు సర్టిఫికేట్ పెట్టారు. అసలు గుమ్మలక్ష్మీపురం రూరల్ పిహెచ్‌సి లేదు. ఆ కోణంలో విజయనగరం జిల్లాలో జరిగిన నియామకాలను పరిశీలిస్తే అసలు భాగోతం వెల్లడైంది.
అనర్హులను తొలగించాం ..
వైద్య విధాన పరిషత్‌లో ఇటీవల చేపట్టిన నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపాం. కొంతమంది ప్రైవేటు కాలేజీ సర్వీసు సర్టిఫికేట్లతో ఉద్యోగం పొందినట్లు గుర్తించి వారిని తొలగించాం. ఈ విషయంపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నాం. వైద్య సిబ్బంది తప్పిదం, ప్రమేయం ఉంటే చర్యలు తీసుకుంటాం. కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామక పత్రంలోనే తప్పుడు మార్గంలో ఉద్యోగం పొందినట్లు ఎప్పుడు రూఢీ అయినా ఉద్యోగం నుండి తొలగిస్తామనే షరతు ఉంటుంది. ఆ పద్దతిలోనే తొలగించాం.
– లియో ప్రతినిధితో డిసిహెచ్‌ఎస్ జి. నాగభూషణరావు