అన్ని రంగాల్లో కన్నా సినిమా రంగంలో వారసత్వపు పిచ్చి ఎక్కువ. అయితే రాణించాలంటే లెగసె టాగ్ తో పాటు వ్యక్తిగత ప్రతిభ అవసరం. సినిమా హీరోల వారసులు అధిక శాతం సక్సెస్ అవుతుంటారు. నందమూరి వంశం, అక్కినేని వంశం, ఘట్టమనేని వంశం, దగ్గుబాటి వంశం, కొణిదెల కుటుంబం .. ఇలా తెలుగు సినీ రంగానికి చెందిన వారసత్వాపు కథలు ఇవి . అయితే అదేమీ తమాషానో కానీ దర్శకుల వారసులు ఆర్టిస్టులుగా నిలదొక్కుకోవడం చాలా చాలా కష్టం.
‘దేవదాసు’, ‘ స్వర్ణ మంజరి ‘ లాంటి అతి గొప్ప క్లాసిక్స్ డైరెక్ట్ చేసిన ప్రముఖ దర్శకుడు వేదాంతం రాఘవయ్య కుమార్తె నటి శుభ అనే విషయం కొద్దీ మందికే తెలుసు. కృష్ణ సరసన ” గూడు పుఠాణి ” సినిమాతో పరిచయం అయిన శుభ హీరోయిన్ గా నిల దొక్కుకోలేకపోయింది. ఆ తర్వాత సహాయ నటి గా చాలా సినిమాల్లో నటించారు శుభ . ఇక ఈలపాట రఘు రామయ్య గారి అమ్మాయి రూప హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయారు. టీవీ సీరియల్స్ లో రాణించారు .
ఎందరో కొత్త తారలను తీర్చి దిద్దిన దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ కొన్నిసినిమాల్లో హీరోగా నటించారు. కానీ ఒక్కటి కూడా విజయవంతం కాలేదు. అయితే సహాయ నటుడుగా ‘అంతఃపురం, సామాన్యుడు’ లాంటి సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయారు. కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ ని కూడా హీరోగా ఉషాకిరణ్ నిర్మించిన సినిమా ద్వారా పరిచయం చేసారు. ఆ సినిమా ప్లాప్ అవడం తో ప్రకాష్ డైరెక్టర్ గా మారారు. అక్కడ కూడా సక్సెస్ కాలేకపోయారు ప్రకాష్.
కోదండరామి రెడ్డి కుమారుడు వైభవ్ రెడ్డి ని గ్రాండ్ గా లాంచ్ చేసినా లాభం లేకపోయింది. తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయాడు వైభవ్. అడపాదడపా తమిళ సినిమాల్లో నటిస్తోంటారు . ఇక మరో దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు అది పినిశెట్టి కూడా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయారు . అయితే ‘ సరైనోడు ‘ సినిమాలో విలన్ గా, ‘ రంగస్థలం ‘ సినిమాలో కీలక పాత్ర లో నటించి, శబాష్ అనిపించుకున్నారు. తమిళంలో సినిమాలు చేస్తున్నారు.
మరి డైరెక్టర్స్ వారసులు ఎందుకు నటులుగా రాణించలేరో అసలు డైరెక్టర్ కావాలని కోరుకోకుండా, హీరోయిజం మీద ఎందుకు ఆశ పడతారో తెలియదు . ఇప్పుడు దర్శక రచయిత సతీష్ వేగేశ్న తన కుమారుడు సమీర్ హీరోగా శ్రీ హరి కుమారుడు మేఘాంశ్ లతో ‘ కోతి కొమ్మచ్చి ‘ అనే సినిమా షూటింగ్ మొదలు పెట్టారు .ఈ సారీ అయినా దర్శకుడు సతీష్ కుమారుడు సమీర్ ఈ యాంటీ సెంటిమెంట్ తప్పించుకుని, హీరో గా రాణించాలని కోరుకుందాం.











