‘విజేత, పేపర్ బాయ్, మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజూ పండగే’ చిత్రాలతో పాటు రీసెంట్ గా వచ్చిన సత్యదేవ్ ‘ఉమామహేశ్వరా ఉగ్రరూపస్య’ మూవీతో బెస్ట్ కమెడియన్ అనిపించుకున్నాడు సుహాస్. అతడి కామెడీ స్టైల్, డైలాగ్ డెలివరీ, రూపం ఇప్పటి జెనరేషన్ కు భలేగా నచ్చుతున్నాయి. అందుకే ఏకంగా అతడే హీరోగా ‘కలర్ ఫోటో’ అనే ఓ డిఫెరెంట్ మూవీని తెరకెక్కించాడు సందీప్ రాజ్ అనే యువ దర్శకుడు. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రీయర్ షోకి సిద్ధంగా ఉంది. రేపే ఈ సినిమాను ‘ఆహా’ ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారు.
సుహాస్ కు జోడీగా చాందినీ చౌదరి నటిస్తోన్న ఈ సినిమాలో సునీల్ విలన్ గా నటించనుండడం ఆసక్తిని రేపుతోంది. ఇంతకు ముందు డిస్కోరాజాలో సునీల్ విలనిజం ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో సారి అతడి విలనిజం కలర్ ఫోటో సినిమాకి హైలైట్ కానున్నదని చెప్పుకుంటున్నారు. ‘హృదయకాలేయం’ దర్శకుడు స్టీఫెన్ శంకర్ అలియాజ్ సాయి రాజేశ్ నిర్మిస్తోన్న ‘కలర్ ఫోటో’ సినిమా ఓటీటీ ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.