గతేడాది సంక్రాంతికి ‘ఎఫ్ 2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి . విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ తోడళ్ళుగానూ, తమన్నా, మెహ్రీన్ అక్క చెల్లెళ్ళు గానూ అభినయించి అలరించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ తో అందరినీ కడుపుబ్బ నవ్వించిన ఈ సినిమాకి.. సీక్వెల్ తీసే హడావిడిలో ఉన్నాడు అనిల్. ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతోనూ సూపర్ సక్సెస్ ఖాతాలో వేసుకున్న అనిల్.. మరింత ఉత్సాహంతో ‘ఎఫ్ 3’ మూవీకి మరిన్ని వన్నె చిన్నెలు అద్దుతున్నాడని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో దర్శకుడు ఈ సినిమాలో మరో హీరోని కూడా ఎంపికచేశాడట. ‘ఎఫ్ 3’ కాబట్టి.. ఇందులో ఒక హీరో యాడ్ అవుతున్నాడని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ‘ఎఫ్ 3’ లో వెంకీ, వరుణ్ లతో పాటు సునీల్ ను కూడా హీరోగా అనుకుంటున్నారని , ఆమేరకు సునీల్ ను సంప్రదించడం.. ఆయన ఓకే అనడం కూడా జరిగిపోయానని టాక్.
ఈ ఏడాది బిగినింగ్ లో ‘డిస్కోరాజా’లో విలన్ గా మెరిసిన సునీల్ .. త్వరలో ఆహా ఓటీటీలో విడుదల కానున్న ‘కలర్ ఫోటో’ సినిమాలోనూ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పుడు ‘ఎఫ్ 3’ లో హీరోగానే నటించనుండడం ఆసక్తి కలిగిస్తోంది. ‘ఎఫ్ 2’ కన్నా మరింత హైపర్ డోస్ కామెడీ తో ‘ఎఫ్ 3’ను తెరకెక్కిస్తున్నాడట అనిల్ రావిపూడి. మొదటి భాగంలో హీరోయిన్స్ గా నటించిన తమన్నా, మెహ్రీన్ లే రెండో భాగంలోనూ కథానాయికలుగా నటించబోతున్నారు. ఇందులో సునీల్ మరో హీరోగా నటించడమే నిజమైతే.. అతడి సరసన ఏ హీరోయిన్ నటిస్తుందో చూడాలి.











