సినిమాల్లో రజినీ ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టేనేమోగానీ.. రాజకీయాల్లో మాత్రం వందసార్లు చెప్పింది ఒక్కసారి కూడా జరగడం లేదు. రాజకీయా ల మాటెత్తితే రజినీ మొదటినుంచీ దాటవేత ధోరణితోనే ఉన్నారు.
ఎందుకో తెలియదు గానీ ఆ ఊగిసలాట రజినీకి మొదట్నుంచీ ఉంది. ఎట్టకేలలకు దాన్ని 2017లో ఓ కొలిక్కి తెచ్చారు. అలా ఏర్పడిందే రజినీ మక్కల్ మండ్రమ్. తమిళనాడులో ఇప్పుడు రాజకీయ శూన్యత ఉంది. ఆయన వయుసురీత్యాగానీ, ఆరోగ్యం రీత్యాగానీ ఈసారి తప్పితే ఆయనకు మరోసారి రాజకీయ ప్రవేశానికి అవకాశం రావడం గానీ, పదవి చేపట్టే అవకాశం రావడంగానీ అసాధ్యం. అందుకే ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు మాత్రం రజినీ రాజకీయాల్లోకి రావడానికి ఇదే అనువైన సమయం అని భావిస్తున్నారు.
మరో పక్క రజినీ రాజకీయ ప్రవేశంపై రజినీ కన్నా భారతీయ జనతా పార్టీకే ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు అంతర్గత వర్గాల సమాచారం. ఇటీవల అమిత్ షా తమిళనాడు రావడం వెనుక కూడా ప్రధాన కారణం రజినీతో భేటీ గురించే. రజినీతో కలిశారా? ఆయన సన్నిహితులతో కలిశారా? అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. తమిళనాడులో పాగా వేయాలంటే భాజపాకు రజినీ తప్ప మరో అవకాశం లేదు. అక్కడ ద్రవిడ పార్టీలకు చెక్ చెప్పడం ఎవరివల్లా కాలేదు.
ఈ భేటీ ఉద్ధేశం ఏమిటి?
రజినీ మక్కల్ మండ్రం కార్యదర్శులతో సమావేశం కోడంబాకంలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో జరుగుతోంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్ లో జరుగనున్నాయి. రజినీ పార్టీ పెట్టి అధికారంలోకి రావడం అంత సులభంగా జరిగే పనికాదు. పైగా ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో అది ఏ విధంగానూ ఆయనకు సాధ్యం కాదు. ఇలాంటి సమయంలో ఏదో ఒక పార్టీతో కలిసి ముందుకు సాగడం తప్ప ఆయనకు మరో దారిలేదు. రజినీ భాజపాతో కలిసి ముందుకు సాగితే ఆయన మీద చాలా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు కూడా ఎక్కువే.
భాజపా తెరవెనుక పాత్ర పోషిస్తూ మరో పార్టీలోకి రజనీని చేర్చి ఎన్నికల బరిలోకి వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా ఉంది. అదే జరిగితే అది ఏఐఏడీఎంకే నుంచే రావాలి. ఈసారి భాజపా పొత్తుతో ఈ పార్టీ ముందుకు వెళ్లబోతుందన్న సూచనలు ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా చూస్తే ఓ బలమైన శక్తిగానే రజినీ ముందుకు కదిలే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
దేవుడు శాసించాడు.. రజినీ పాటిస్తున్నాడు
రజినీకాంత్ క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖరారైనట్లే. కాకపోతే అధికారికంగా ప్రకటన మాత్రం చేయడం లేదు. ఈరోజు ఉదయం సమావేశంలో అందరి అభిప్రాయాలు ఆయన తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం తన అభిప్రాయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. భాజపాతో కలిసి పయనించే విషయంపైనా చర్చలు సాగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రజినీ మొదట్నుంచీ స్పిరిచ్యువల్ పాలిటిక్స్ అనే మాటనే మాట్లాడుతున్నారు. బహుశా భాజపాతో కలవడానికి ఇది కూడా ఒక మార్గం కావచ్చు. అయితే దీనికి అభిమాన సంఘాల నుంచి ప్రతిఘటన ఎదురవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.
అందుకే దీనిపై ఆయన ఏ విధమైన ప్రకటనా చేయడం లేదు. ఈ సమావేశం సందర్భంలో కూడా భాజపాకి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా రజినీ రాజకీయ రంగ ప్రవేశం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. అది కూడా భాజపా మద్దతు లేకుండా మాత్రం జరగదు. ఇంతవరకు స్పష్టం. ఇక సినిమాల విషయానికి వస్తే ఆయన తాజా సినిమా ‘అన్నాత్తే’ దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది. ఆయన రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఇదే ఆయన ఆఖరి సినిమా అవుతుంది. చంద్రముఖి 2 చేయాల్సి ఉన్నా అది ఆగిపోక తప్పదు.