ఒక జర్నలిస్టుగా అర్ణబ్ గోస్వామి అంటే నచ్చని వారు అనేకులు ఉంటారు. కానీ.. ఆయనను అరెస్టు చేసిన తీరును మాత్రం అందరూ గర్హించాల్సిందే.
రిపబ్లిక్ టీవీ ఎండీ ఆర్ణబ్ గోస్వామి యావత్ దేశంలో.. జాతీయ చానెల్స్ ఫాలో అయ్యే వారందరికీ చిరపరిచితులు. జర్నలిస్టు అంటే.. నాయకుల నుంచి సమాచారం రాబట్టడం మాత్రమే కాకుండా.. స్వయంగా వారు తనకు వ్యక్తిగత వైరం ఉన్న ప్రత్యర్థులు అయినట్టుగా వారితో గోదాలో కలబడుతున్నట్లుగా.. టీవీ డిస్కషన్లు నడిపించడం ఆయనకే చెల్లిన విద్య. అలాంటి అర్ణబ్ గోస్వామి ఇవాళ అరెస్టు అయ్యారు.
ఓ ఇంటీరియర్ డిజైనర్, ఆయన తల్లి ఆత్యహత్య చేసుకోడానికి కారకులయ్యారనేది ఆయన మీద కేసు. వారి ఆత్మహత్య అనేది 2018లో జరిగింది. ఆర్కిటెక్ట్ మరియు కంకార్డ్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అయిన అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. సదరు నాయక్ కంపెనీకి అర్ణబ్ గోస్వామి 83 లక్షల రూపాయలు అప్పుపడి ఉన్నారని విచారణలో తేలింది.
అలాగే స్మార్ట్ వర్క్స్, స్కై మీడియా అనే మరో రెండు కంపెనీలు కూడా అప్పున్నాయి. ఇలా అన్వయ్ నాయక్ కు రావాల్సిన బకాయిలు 5.4 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సొమ్ము రాక.. అతను ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలతో.. అర్ణబ్ గోస్వామితో పాటు, ఫిరోజ్ షేక్, నితేష్ సర్దా అనే మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు.
రాయిగఢ్, ముంబాయి పోలీసులతో కూడిన ప్రత్యేకబృందం వీరిని అరెస్టు చేసింది.
నన్ను కొట్టారు : అర్ణబ్
బుధవారం తెల్లవారు జామునే అర్ణబ్ ఇంటికి చేరుకున్న పోలీసు బృందాలు ఆయనను అప్పుడే అరెస్టు చేసి తమ వెంట తీసుకు వెళ్లాయి. అయితే పోలీసులు తనని కొట్టారని, మంచినీళ్లు కూడా తాగనివ్వలేదని పోలీసు వాహనంలో వెళుతూ.. అర్ణబ్ కేకలు పెట్టి బయట ఉన్న మీడియా వారితో చెప్పారు.
ఇది ఎమర్జన్సీని తలపిస్తోంది : బీజేపీ
అర్ణబ్ అరెస్టును భారతీయ జనతా పార్టీ తీవ్రంగా నిరసించింది. ఆ పార్టీ వారందరూ గగ్గోలెత్తి పోతున్నారు. జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలకు సంబంధించి కూడా కమలదళంపై చాలా ఆరోపణలున్నాయి గానీ.. అర్ణబ్ గోస్వామి విషయానికి వచ్చేసరికి.. బీజేపీ తెగ బాధపడిపోతోంది. బీజేపీ ఆయనను ‘ఓన్’ చేసుకుంటున్న కొద్దీ.. అర్ణబ్‌కు, అరెస్టుకు రాజకీయ రంగులు పులుముకుంటున్నాయి. శివసేన ఎమర్జన్సీ రోజులను తలపించేలా.. అరెస్టు చేసిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో శివసేన ఈ అరెస్టును సమర్థించుకుంటోంది. చట్టం ప్రకారమే అరెస్టు జరిగిందని, ప్రభుత్వం ఎవ్వరి మీద కక్షపూరితంగా వ్యవహరించడం లేదని పేర్కొంటున్నారు.
2018నాటి ఆత్మహత్య కేసు..
అన్వయ్ నాయక్ (53) , అతని తల్లి ఆత్మహత్య 2018లో జరిగింది. అర్ణబ్ తో పాటు ఇప్పుడు అరెస్టు అయిన ఇద్దరు కూడా నాయక్ కు చెల్లించవలసిన మొత్తం భారీగా ఉన్నదని, వారినుంచి వసూలు చేసుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడనేది ఆరోపణ. అప్పట్లో బీజేపీ సర్కార్ నడుస్తుండడంతో.. అర్ణబ్ మీద కేసును తొక్కిపట్టేశారని కూడా వినిపిస్తోంది. అదే సమయంలో ఆత్మహత్య లు జరిగిన ప్రతి సందర్భంలోనూ వారికి డబ్బు ఇవ్వాల్సిన వారే నిందితులు అయ్యేట్లయితే గనుక, వారిని అరెస్టు చేయాల్సి వస్తే గనుక.. జైళ్లు చాలవనే వాదన కూడా వినిపిస్తోంది. అదే కరెక్టయితే.. ఈ దేశంలో జరిగే ప్రతి రైతు ఆత్మహత్యకు ప్రభుత్వాల్లో ఉండే వారందరినీ అరెస్టు చేయాల్సిందనే వాదనలు కూడా ఉన్నాయి.
జర్నలిస్టు అయినంత మాత్రాన చట్టానికి అతీతులేం కాదు. కాకపోతే.. మంచినీళ్లు కూడా తాగనివ్వకుండా తనను బలవంతంగా తీసుకెళ్తున్నారని అర్ణబ్ చెప్పిన మాటలు నిజమైతే… అరెస్టు చేసిన తీరును మాత్రం గర్హించాల్సిందే.











