దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తరువాత క్యాబినేట్‌లో మార్పులు ఉండవచ్చన్న చర్చ జోరుగా సాగుతోంది. కనీసం ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అవకాశం మేరకు ఫుల్ కేబినేట్ ఉండటంతో కొత్త వారికి ఇచ్చే అవకాశం లేదు. ఇక మంత్రుల్లో కొంత మందిపై ఆరోపణలు వెళ్లువెత్తుతున్న నేపథ్యంలో వారిని క్యాబినేట్ నుండి తప్పించాలని బిగ్ బాస్ యోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో సర్వేలు ఆ పార్టీకి అనుకూలంగానే ఉన్నాయి. అయితే, మెజారిటీ తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతను ఓటర్లు బహిరంగంగానే వెళ్లగక్కారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నేతల్లో కలవరం మొదలై అనేక కారణాలు చెబుతున్నారు. అభ్యర్థి ఎంపిక నాటి నుండి దుబ్బాక పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత విబేధాలే దీనికి కారణమంటున్నారు.
ఈ పరిస్థితి గ్రేటర్‌లో రాకూడదని..
దుబ్బాక పరిస్థితి గ్రేటర్ ఎన్నికల్లో రాకూడదని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. పనితీరు సరిగా లేని మంత్రులను కేబినేట్ నుండి తొలగించాలని కేసీఆర్ యోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచార పర్వం సాగుతుండగానే ఓ మంత్రి లైంగిక వేధింపుల ఎపిసోడ్ బయట పడటంతో ఆ ప్రభావం కూడా అక్కడ పడిందన్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు తన సొంత సామాజిక వర్గానికి చెందిన మంత్రిని సైతం కాబినెట్ నుంచి తప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రేటర్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ మంత్రి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడంతో ఆయనను తొలగిస్తే వ్యతిరేకత రాకుండా ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు వినికిడి.
మొదటి సారి మంత్రికి షాక్
ఇక కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన మంత్రికి సైతం ఈ సారి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. మొదటి సారి మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన ఆయనకు కేసీఆర్ షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది . కేసీఆర్ కుమార్తె కవిత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆమెను క్యాబినేట్‌లోకి తీసుకోవటానికి ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని తొలగిస్తే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని భావిస్తున్నారు. దీంతో తన సామాజిక వర్గానికి చెందిన నేతనే మంత్రి వర్గం నుండి తొలగించేందుకు సన్నాహకాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కవితకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించుకుంటే మాత్రం ఆ మంత్రికి పదవి మూడునాళ్ళ ముచ్చటే అంటున్నారు . తన కుటుంబం కోసం మరో కీలక నేతను బలిచేస్తారా లేదా అనేది చూడాలి.