కోర్టులో దావా ఓడిన వాడు కోర్టు బయట ఏడిస్తే.. గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడ్చాడనే సామెత చాలా పాతది. కానీ.. అది నిత్యనూతనమైనది. వర్తమాన రాజకీయాలకు కూడా అచ్చంగా వర్తించేది.
దుబ్బాక ఎమ్మెల్యే స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం కౌంటింగ్ మొదలైన కొన్ని గంటల వ్యవధిలోనే ఫలితం తేలిపోతుంది. ఎన్నికలకు ముందు జరిగిన సర్వేలు, పోలింగ్ తర్వాత జరిగిన సర్వేలు కూడా తెరాసకే విజయావకాశాలు కట్టబెట్టాయి. సాధారణంగా పోలింగ్ తర్వాత జరిగే సర్వేల ఫలితాలు నిజానికి దగ్గరగా ఉంటాయనేది ఒక అంచనా. ఆ ప్రకారం కూడా తెరాసనే గెలుస్తుంది. గులాబీ దళాలు మిఠాయిలు తినిపించుకుని పండగ చేసుకుంటాయి. అయితే గెలిచిన ఆనందం ఆ పార్టీలో పుష్కలంగా, నిజంగా ఉంటుందా? అంటే మాత్రం సందేహమే!
పాత చరిత్ర తిరగరాస్తారా?
2018 ఎన్నికల్లో తెరాస దుబ్బాకలో విజయదుందుభి మోగించింది. తెరాస అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి ఏకంగా 62వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పోలైన మొత్తం ఓట్లలో తెరాసకు 54 శాతం ఓట్లు వస్తే.. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరికీ కలిపి కేవలం 30 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. ఘన విజయం నమోదైంది.
ఇప్పుడు జరుగుతున్నది ఉప ఎన్నిక. స్థానికుల్లో మంచి వ్యక్తిగా పేరున్న సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణం వల్ల జరుగుతున్న ఉప ఎన్నిక. ఇలాంటి ఎన్నికలో ఆయన కుటుంబమే ఢంకా బజాయించి గెలిచే అవకాశం ఎక్కువ. ఆయన కొడుకు కూడా ఆశ పెట్టుకున్నప్పటికీ.. సానుభూతిని ఓట్లుగా పిండుకోవడంలో భార్య అయితేనే బెటర్ అని పార్టీ భావించిందో ఏమో గానీ.. ఆయన భార్య సుజాతను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. మామూలుగా అయితే.. వైరిపక్షాలు పోటీకి భయపడే స్థాయిలో ఇలాంటి ఉప ఎన్నిక ఉండాలి. కానీ అలా జరగలేదు. తెరాసలోనే ఉన్న చెరుకు ముత్యం రెడ్డి కొడుకు- అధికార పార్టీని వీడిపోయి మరీ, కాంగ్రెస్ లో చేరి.. ఆ పార్టీ తరఫున బరిలో దిగారు. నిజానికి ఆయన కూడా ఇదే తరహా సానుభూతిని నమ్ముకున్నారు. దుబ్బాక నియోజకవర్గానికి ఎంతో సేవ చేసిన, నిజాయితీపరుడిగా పేరున్న ముత్యంరెడ్డి మరణం వలన పుట్టే సానుభూతి లాభిస్తుందని కాంగ్రెస్ అంచనా వేసింది. బీజేపీ తరఫున గత రెండు పర్యాయాలు ఓడిపోయిన రఘునందన్ రావు.. ఇంకో రకం సానుభూతిని నమ్ముకుని కాస్త గట్టిగానే తలపడ్డారు.
తెరాస అంతర్గత రాజకీయాల విషయానికి వస్తే.. హరీష్ రావు మొత్తం బాధ్యతను భుజానికెత్తుకున్నారు. పార్టీలో ఆయన తప్ప.. దుబ్బాక ఎన్నికల ప్రచారానికి రానివ్వకుండా గెలుపు కీర్తిని మొత్తం గంపగుత్తగా తన ఖాతాలో వేసుకోవడానికే ఇలా చేశారని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు పోస్ట్ పోల్ సర్వేలు కూడా వచ్చాక ఒక సర్వేను మాత్రం పరిగణనలోకి తీసుకుని చూసినట్లయితే.. ఆరా సంస్థ చేసిన సర్వేలో తెరాసకు 48 శాతం, బీజేపీకి 44 శాతం ఓట్లు దక్కుతున్నాయి. ఓ మూడు శాతం అటుఇటు కావచ్చునని వారి అంచనా.
చాలాసంస్థలు పోస్ట్ పోల్ సర్వేలు చేసినా.. ఒక్క ఆరాను మాత్రం పరిగణనలోకి తీసుకోవడం ఎందుకంటే.. ఆ సంస్థ సారథి మస్తాన్ చెప్పే జోస్యం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా అపారమైన నమ్మకం ఉన్నదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో.. ఎవ్వరెన్ని చెప్పినా.. మస్తాన్ మాత్రం.. తెరాసకు 100 స్థానాలు దక్కుతాయని ముందే సర్వేలు చేసి కేసీఆర్‌తో అన్నారని, అప్పటినుంచి గులాబీ దళపతికి మస్తాన్ మీద అపరిమితమైన గురి ఏర్పడిందని రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. కనుక వారి పోస్ట్ పోల్ సర్వేను ప్రమాణికంగా తీసుకుంటే.. ఈ గణాంకాలు కనిపిస్తున్నాయి.
ఇలాగైతే విజయమూ అపశకునమే..
విజయం దక్కితే దక్కవచ్చు గానీ.. అధికార పార్టీ తెరాసకు వెన్నులో చలి పుట్టించే గణాంకాలు ఇవి. ఇలాంటి ఉప ఎన్నికలో పాత ఎన్నికకంటె ఎక్కువ ఓట్లు సాధిస్తేనే.. అది అధికార పార్టీకి పరువు దక్కిస్తుంది. కానీ.. పోటాపోటీగా ఫలితాలు వచ్చి.. కేవలం నాలుగు శాతం ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోతే.. తెరాసకు గెలిచిన ఆనందం కూడా దక్కదు గాక దక్కదు.
గత ఎన్నికలతో పోలిస్తే.. తెరాస ఈసారి 8 శాతం ఓట్లు కోల్పోతున్నట్టు లెక్క. గత ఎన్నికల్లో కేవలం 13 శాతం తెచ్చుకున్న బీజేపీ ఈసారి 31 శాతం ఓట్లను అధికంగా సాధించినట్లు లెక్క. 2014లో ఆ పార్టీ సాధించిన 10 శాతం ఓట్లతో పోలిస్తే 34 శాతం మెరుగుపడినట్టు లెక్క. కాంగ్రెస్ పరిస్థితి యావత్ రాష్ట్రంలో ఉన్న తీరుగానే.. ఇక్కడ కూడా దయనీయంగా, మరింత దిగజారింది. గతంలో 16 శాతం ఓట్లు తెచ్చుకున్న వారు.. ఈసారి కేవలం 6 శాతానికి పరిమితం కాబోతున్నారు.
మరి ఇలాంటి పరిస్థితిలో గెలిచిన ఆనందం తెరాసకు దక్కదు.. అనే మాట వాస్తవం. వారు గెలుపును బహిరంగంగా సెలబ్రేట్ చేసుకోగలరేమో గానీ.. అంతరంగంలో మాత్రం.. ఆత్మ సమీక్ష చేసుకోవాల్సిందే.
మంగళవారం మధ్యాహ్నానికి ఫలితాల గురించి స్పష్టత వచ్చేస్తుంది. మెజారిటీ తగ్గడం గురించి.. అందరూ హరీష్ రావును, అందుబాటులో ఎవరు దొరికితే వారు అనే రీతిలో ప్రతి తెరాస నాయకుడినీ ప్రశ్నిస్తారు. ఎంతమందిని అడిగినా.. వారందరూ మూకుమ్మడిగా చెప్పబోయే సమాధానాలు మాత్రం కామన్. ‘బీజేపీ విచ్చలవిడిగా డబ్బు పంచి ఓట్లు సాధించింది. పోలీసుల తనిఖీలో దొరికిన డబ్బు కట్టలే దీనికి సాక్ష్యం. ఎన్నికల్లో అనేక అక్రమాలకు వారు పాల్పడ్డారు. వారి పాపాలన్నీ విచారణలో తేలుతాయి. ప్రజలు తెలివైన వారు కాబట్టే కేసీఆర్ గారి మీద నమ్మకంతో తెరాసను గెలిపించారు..’ ఇలాంటి అనేకానేకమైన పరనింద ఆత్మస్తుతి డైలాగులు వెల్లువలా వస్తాయి.
వారు ఎన్నయినా చెప్పవచ్చు గాక.. ఈ దుబ్బాక ఎన్నికల గోదాలో బీజేపీ మెరుగైన ప్రదర్శన చేసిందనే మాట మాత్రం ప్రజలకు అర్థమవుతుంది. అలాగే.. తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాల్సి వస్తే.. ప్రజలకు కాంగ్రెస్ కంటె, బీజేపీ మెరుగ్గా కనిపిస్తోందని కూడా అర్థం చేసుకోవాలి. నిజానికి విపక్షాలు- గెలుపు ఆశలు తక్కువే అయినా.. బరిలోకి దిగింది కూడా బలం పెంచుకోవడం ద్వారా.. తతిమ్మా యావత్ రాష్ట్రానికి తెరాస పట్ల వ్యతిరేకత మొదలైందనే సంకేతం పంపడానికే- అని అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని ప్రజలు గుర్తిస్తారు.
అధికార పార్టీ కూడా గుర్తిస్తే.. ప్రభుత్వం పనితీరు మెరుగుపడుతుంది. ఈ ప్రజల తీర్పును అపహాస్యం చేస్తే మాత్రం.. మరింత ప్రతికూలతను మూటగట్టుకుంటారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముంచుకువస్తున్న తరుణంలో అది ఇంకా ప్రమాదకరమైన పరిణామం.
.. సురేష్ పిళ్లె
[email protected]