సినీ ప్రముఖులంతా సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటున్నారు. ముఖ్యంగా ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లలో వీరంతా యాక్టివ్ గా ఉంటున్నారు. కొంతమంది నటులైతే ఏకంగా వెబ్ సైట్లు కూడా ప్రారంభించారు. తాజాగా దగ్గుబాటి రానా ఓ యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించేశారు. కరోనా కాలంలో జనమంతా సోషల్ మీడియాకు అలవాటు పడిపోయారు. గతంలో వీరు ఏం చెప్పదలుచుకున్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడలా కాదు సెలబ్రిటీలు ఎప్పుడేం పెడతారో అన్నట్లుగా అందరూ వారి వారి సోషల్ మీడియా ఖాతాల మీదే ఉంటున్నారు.
వారు ఏదైనా పెట్టగానే పత్రికలు, టీవీలతో అన్ని మాధ్యమాలూ వాటిని అవురావురుమంటూ మింగిస్తున్నాయి. ఒకవిధంగా ఇది ఫ్రీ పబ్లిసిటీ అనుకోవాలేమో. ఇంతకీ రానా పెట్టిన యూట్యూబ్ ఛానెల్ పేరేంటో తెలుసా? సౌత్ బే అట. అనేక భాషల్లో వచ్చిన కంటెంట్ ను ఎంచక్కా రానా యూట్యూబ్ ఛానెల్ లో పెట్టేస్తుంటారు. ఒక విధంగా ఇది మంచి ఆలోచన కూడా.
చాలా మంది ఇలాంటి ప్రయత్నం చేద్దామనుకున్నా ఆచరణలో పెట్టలేదు. పది సెకన్ల నిడివి నుంచి పది గంటల నిడివి ఉన్న కథలు ఈ ఛానెల్ లో ఉంటాయట. టాలెంట్ ఉండి కంటెంట్ జనరేట్ చేయాలనుకునే వారికి తగిన అవకాశాలను కూడా ఈ ఛానెల్ కల్పిస్తుందట. ఒక్క కథలే కాదు, వార్తలు, యానిమేషన్ అంశాలు, ఫిక్షన్ లాంటి ఎన్నో అంశాలకు ఇందులో చోటు కల్పిస్తున్నారు. రానాకు వచ్చిన ఈ ఆలోచనకు అభినందించాల్సిందే.