దుబ్బాక ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఇంకా కొన్ని గంటల సమయం మిగిలి ఉండగానే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపును వికీపీడియా ఖరారు చేసేసింది. ఎన్నికలకు సంబంధించి ఇంకా కౌంటింగ్ కూడా జరగనేలేదు అప్పుడే దుబ్బాకలో బీజేపీని ముందే వికీపీడియా గెలిపించింది. వికీపీడియాలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం పేజీనీ ఓపెన్ చేస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. 2009 నుంచి నిన్న జరిగిన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల్లో ఎవరు గెలుపొందారు అనే వివరాలు అందులో ఉన్నాయి. ఆ వివరాలను ఒక సారి పరిశీలిస్తే అందుటో 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి చెరుకు ముత్యం రెడ్డి గెలుపొందారు. 2014, 2018లో టీఆర్ఎస్ నుంచి సోలిపేట రామలింగారెడ్డి గెలుపొందారని ఉంది. అలాగే నిన్న జరిగిన దుబ్బాక ఉప ఎన్నికకు గానూ 2020 గెలుపొందిన శాసన సభ్యులు బీజేపీ అభ్యర్థి అయిన రఘునందన్‌రావు అని అందులో పొందుపరిచారు. దీంతో వికీపీడియాను చూసే వారందరూ అవక్కవుతున్నారు. ఇంకా ఫలితాలే వెలువడక ముందే ఇలా ఎలా ఎమ్మెల్యేగా డిక్లేర్ చేస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఎడిట్ ఆప్షన్ తెచ్చిన తంట!
వికీపీడయాలో ఎవరైనా.. ఏమైనా అందులో ఉన్న సమాచారాన్ని ఎడిట్ చేసే ఆప్షన్ ఉంది. ఆ ఎడిట్ ఆప్షన్‌లోకి ఎవరైనా వెళ్లి అంతకు ముందు వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని మార్చుకునే వీలును వికీపీడియా కల్పించింది. ఈ ఆప్షన్‌ను అవకాశంగా తీసుకున్న కొందరు ఇలా కావాలనే ఎడిట్ చేసి ఉంటారనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని కొంతమంది కొలమానంగా తీసుకుంటారు. ఏ విషయం గురించి అయినా శోధించాలనుకుంటే చాలా మంది వికీపీడియానే ఫాలోఅవుతారు. మరీ అలాంటిది లక్షలాది మంది ఫాలో అయ్యే వికీపీడియాలో ఇలాంటి తప్పిదాలు రావడంపై పలువురు అంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
టీఆర్ఎస్ నుంచి సుజాత, బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ఉప ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే.