అందరూ మరచిపోయిన సుశాంత్ సింగ్ మృతి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. సుశాంత్ ఆత్మహత్య విషయాన్ని పక్కన పెట్టేసి ఈ కేసు అంతా డ్రగ్స్ రాకెట్ చుట్టూ పరుగెట్టింది. చివరికి బాలీవుడ్ లో డ్రగ్స్ రాకెట్ తుట్టు కదిలింది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ లను ఎన్సీబీ అరెస్టు చేయడం కూడా జరిగింది. ఇదంతా గతం. సుశాంత్ మరణం జరిగి దాదాపు ఏడాది అయ్యింది. పైగా ఈ కేసు ఇప్పుడు సీబీఐ దర్యాప్తులో ఉంది. తాజాగా సుశాంత్ పీఆర్ మేనేజర్ సిద్దార్థ్ పితానీని ఎన్సీబీ అధికారులు ఈరోజు అరెస్టు చేశారు.
ఐదు రోజుల పాటు ఎన్సీబీ కస్టడీలోనే అతను ఉంటాడు. ఈ తాజా అరెస్టుతో మళ్లీ అందరిలోనూ గుబులు రేగుతోంది. సుశాంత్ సింగ్ ఫ్లాటులో సిద్ధార్థ్ మూడేళ్ల పాటు ఉన్నాడు. పైగా సుశాంత్ మరణానికి ముందు సుశాంత్ సిద్దార్థ్ తోనే మాట్లాడాడు. సిద్ధార్థ్ పితాని హైదరాబాద్ కు చెందినవాడు. సుశాంత్ బాంద్రా నివాసంలో ఆయనతోపాటు ఉండే ముగ్గురు వ్యక్తులలో సిద్ధార్థ్ కూడా ఒకరు. వీరితో పాటు సుశాంత్ వంటవాడు నీరజ్, అతని మేనేజర్ దీపేశ్ సావంత్ కూడా అక్కడే ఉన్నారు. తాళం వేసి ఉన్న గదిలో సుశాంత్ చనిపోయి కనిపించాడు.
సిద్ధార్థ్ గురించి ఇంకా చెప్పాల్సి వస్తే సుశాంత్ సింగ్ స్నేహితుడు ఆయుష్ శర్మ ద్వారా అతను సుశాంత్ దగ్గర చేరాడు. అంతకుముందు అతను ఓ గ్రాఫిక్ డిజైన్ కంపెనీ పనిచేసేవాడు. 2019 నుంచి సుశాంత్ కు దగ్గరయ్యాడు. సుశాంత్ డ్రీమ్స్ 150లో ఆయుష్ శర్మ, సిద్దార్థ్ కలిసి పనిచేశారు. ఆయుష్ అహ్మదాబాద్ వెళ్లిపోవడంతో సిద్ధార్థ్ ఏకంగా తన ఉద్యోగం వదులుకుని సుశాంత్ ఫ్లాట్ కే చేరిపోయాడు. సుశాంత్ కూడా అతనికి నెల జీతానికి చేర్చుకున్నారు. ‘చిచోర్’ సినిమా నుంచి తను సుశాంత్ తో ఉంటున్నట్టు సిద్దార్థ్ స్వయంగా ఒప్పుకున్నాడు.
సుశాంత్ తో సిద్ధార్థ్ కు ఉన్న సాన్నిహిత్యం గురించి రియా చక్రవర్తికి కూడా బాగా తెలుసు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఫొటోల క్రెడిట్స్ ను రియా కూడా సిద్ధార్థ్ కు ఇస్తుండేది. సోషల్ మీడియాలో ఆమె అతన్ని ట్యాగ్ చేస్తుండేది. తన క్వారంటైన్ పార్టనర్ గా ఆమె అతన్ని పిలుస్తుండేది. ఇప్పుడు ఎన్సీబీ చేసే దర్యాప్తులో డ్రగ్స్ సరఫరా విషయంలో అతని పాత్ర ఏమిటన్నది తెలుస్తుంది.











