వైసీపీ ఓడిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది కావొస్తుంది. కానీ కొన్ని శాఖల్లో ఇప్పటికీ వైసీపీ మనుషులు ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతోంది.. ఇందులో కీలకమైంది ఎక్సైజ్ శాఖ.ఎక్సైజ్ శాఖలో ఏం జరిగినా తాడేపల్లి ప్యాలెస్‌కు ఇట్టే తెలిసిపోతోంది. ఎక్సైజ్ శాఖలో చీమ చిటుక్కుమన్నా తాడేపల్లి ప్యాలెస్‌కు, వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుగా పని చేసిన సజ్జలకు తెలిసిపోతోంది. గడిచిన ఐదేళ్లలో వైసీపీ పెద్దల పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. సజ్జల తెచ్చిపెట్టిన విశిష్ట అనే కంపెనీ ఎక్సైజ్‌లో సర్వీసు ప్రొవైడర్‌గా కొనసాగుతోంది. ఇది వైసీపీ పెద్దలకు వరంగా మారింది. బేవరేజెస్ కార్పొరేషన్ ప్రతిరోజూ ఇచ్చే ఆర్డర్లు, డిస్టిలరీల నుంచి మద్యం డిపోలకు చేరుతున్న మద్యం లెక్కలు, అక్కడి నుంచి ఏ షాపు లు, ఏ బార్లకు వెళ్తోంది..మద్యం కంపెనీలకు ప్రభుత్వం చేస్తున్న చెల్లింపుల వివరాలు..సర్వం తాడేపల్లి ప్యాలెస్‌కు విశిష్ట కంపెనీ ద్వారా చేరిపోతున్నాయి.
నిజానికి, విశిష్ట రాకను అప్పట్లో బేవరేజెస్ కార్పొరేషన్ వ్యతిరేకించింది. అయినా, సజ్జల పట్టుబట్టి ఈ కంపెనీని కార్పొరేషన్‌లో పెట్టారు. ఒకరకంగా మొత్తం ఎక్సైజ్ శాఖను ఆ కంపెనీ చేతిలో పెట్టారు. అయితే ప్రభుత్వం మారి 10 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఎక్సైజ్ శాఖ ఆ కంపెనీనే కొనసాగిస్తోంది. ఇదే అదనుగా భావించిన విశిష్ట కంపెనీ రోజువారీ ఆర్డర్లు, అమ్మకాలు మొత్తం లెక్కలను తాడేపల్లి ప్యాలెస్‌కు చేరవేస్తోంది. దాని ఆధారంగా మద్యం అమ్మకాల వివరాలను ట్రాక్ చేసి గత అక్రమాల లెక్కల నుంచి ఎలా తప్పించుకోవాలనే ప్లాన్ వేస్తున్నారు వైసీపీ పెద్దలు. కానీ ఎక్సైజ్ శాఖ మాత్రం విశిష్టపై ప్రేమ చూపిస్తోంది.
ఎక్సైజ్ శాఖ అంటే అందరికీ కనిపించేది లిక్కర్ మాత్రమే. కానీ ప్రభుత్వాలకు అదే ప్రధాన ఆదాయ వనరు. అందులో నుంచి వాటాలు ఎలా రాబట్టుకోవాలో గత వైసీపీ ప్రభుత్వం పక్కాగా అమలు చేసి చూపించింది. ఇందుకోసం ఏరికోరి ఓ సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేసింది. అంతకుముందు ఏపీ ఆన్‌లైన్, సీటెల్ అనే రెండు కంపెనీలు సర్వీసు ప్రొవైడర్లుగా ఉండేవి. ఒక కంపెనీ డిస్టిలరీల నుంచి డిపోల వరకు మద్యాన్ని ట్రాక్ చేస్తే, మరో కంపెనీ డిపోల నుంచి షాపులు, బార్ల వరకు అమ్మకాలను ట్రాక్ చేసేది. అయితే ఇలా రెండు కంపెనీలు పనిచేస్తే తమ బ్రాండ్లు అమ్ముకోడానికి, కమీషన్ల వసూలుకు సాధ్యం కావట్లేదని తాడేపల్లి ప్యాలెస్ భావించింది. ఆ రెండు కంపెనీలను తప్పించి 2022లో విశిష్ట అనే కంపెనీని తెరపైకి తెచ్చింది. అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి ఈ కంపెనీని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా, సజ్జల ఒత్తిడి తీసుకురావడంతో విశిష్టను అనుమతించక తప్పలేదు. అన్ని స్థాయిల్లో ఆన్‌లైన్ సేవలు అందించినందుకుగాను విశిష్ట ఏటా రూ.కోట్లు చెల్లించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతా అదే కంపెనీని కొనసాగిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
విశిష్ట ఏది చెబితే అదే ఫైనల్ –
నిబంధనల ప్రకారం షాపులు, బార్లకు ఏ బ్రాండ్లు ఆర్డర్లు పెట్టాలనేది లైసెన్సీల ఇష్టం. తమ బార్‌కు ఎలాంటి మద్యం కావాలో ఆ బార్ లైసెన్సీ ఎక్సైజ్ శాఖకు ఇండెంట్ పెట్టుకుంటాడు. ఆ మేరకు శాఖ వారికి మద్యం సరఫరా చేస్తుంది. అయితే గత ప్రభుత్వంలో షాపులు ప్రభుత్వం నిర్వహించడంతో ఏ బ్రాండ్లు షాపులకు అవసరమో విశిష్టయే నిర్ణయించేది. తాడేపల్లి పెద్దలు, హైదరాబాద్‌లో ఉండే అప్పటి ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి సూచనలతో విశిష్ట కంపెనీయే ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పెట్టేది. ఆ క్రమంలో పాపులర్ బ్రాండ్లను పక్కనపెట్టి J-బ్రాండ్లు కావాలని ఆర్డర్లు పెట్టేది. ఏ రోజు ఏం ఆర్డర్లు పెట్టారు? మద్యం షాపుల్లో ఎంత స్టాకు విక్రయించారనే వివరాలను తాడేపల్లికి పంపేది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కూడా విశిష్ట తన పనితీరు మార్చుకోలేదు. అదే పంథాను కొనసాగిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిందన్న ఆలోచన కూడా లేకుండా తమను నియమించిన సజ్జలకు అనుగుణంగా విశిష్ట సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందుకు బేవరేజెస్ కార్పొరేషన్‌లోని కొందరు అధికారులు సహకరిస్తున్నారు.
వైసీపీ హయాంలో ప్రభుత్వ మద్యం షాపుల లెక్కలన్నీ గందరగోళంగా ఉండేవి. డిస్టిలరీల్లో ఉత్పత్తి చేసిన మద్యానికి, షాపుల్లో విక్రయించిన మద్యానికి చాలా సార్లు లెక్కల్లో చాలా సార్లు తేడా వచ్చేది. ఆ లెక్కలపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. అప్పట్లో సజ్జల మద్యం సీసాలపై అతికించే హీల్స్‌ను కూడా తన చేతిలోనే పెట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన కుంబత్ అనే కంపెనీని తీసుకొచ్చి హీల్స్ కాంట్రాక్టు అప్పగించారు. అయితే కుంబత్, విశిష్టకు అంతర్గతంగా సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. డిస్టిలరీల్లో మద్యం ఉత్పత్తి చేసిన తర్వాత దాన్ని ట్రాక్ చేసేందుకు ప్రతి సీసాపై ఒక హీల్‌ను అతికిస్తారు. దాని ఆధారంగానే సీసా ఎక్కడుందనేది ట్రాక్ అవుతుంది. ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఒక్కో హీల్‌కు 28పైసలు డిస్టిలరీలు చెల్లించేవి. గత వైసీపీ ప్రభుత్వం దానిని ఒకేసారి 40పైసలకు పెంచింది. ప్రతినెల ఎక్సైజ్ శాఖకు 11కోట్ల హీల్స్ అవసరం అవుతాయి. ఆ లెక్కన ఐదేళ్లలో హీల్స్‌లో ఎంత దోపిడీ చేశారో అర్థమవుతోంది. పైగా ఇటీవల కుంబత్ కంపెనీకి వెంటనే నిధులు చెల్లించేలా ఆర్డర్లు జారీచేయాలని ఓ అధికారి ఒత్తిడి చేశారు. వైసీపీ తీసుకొచ్చిన కంపెనీకి నిధులు చెల్లింపు విషయంలో ప్రస్తుత అధికారులకు అంత అత్యుత్సాహం ఎందుకనే అనుమానాలు వస్తున్నాయి.