విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కాక రేపింది.పార్టీ నిర్ణయాన్ని కాదని సీనియర్ నేత వి.హనుమంత రావు యశ్వంత్ సిన్హాను కలవడం, దానికి ఘాటుగా టీపీసీసీ రేవంత్ స్పందించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ పంచాయితీ అధిష్టానం వద్దకు చర్యగా, రేవంత్ ఢిల్లీకి వెళ్లారు. ఇక ఇదే అంశంపై చర్చించేందుకు సీనియర్ నేత అయిన భట్టి విక్రమార్కను కాంగ్రెస్ అధినాయకత్వం ఢిల్లీకి పిలిచినట్లు సమాచారం.
వాస్తవానికి విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలిచిన యశ్వంత్ సిన్హా తన ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చారు. కాగా, రాష్ట్రంలో టీఆర్ఎస్ తో పోరాడుతున్నందున సిన్హా ప్రచార కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందుగానే స్పష్టం చేశారు.కానీ, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటలను సైతం పట్టించుకోకుండా సీనియర్ నేత వి. హనుమంతరావు ఎయిర్ పోర్టుకు వెళ్లి సిన్హాకు స్వాగతం పలికారు. దీనిపై రేవంత్ తీవ్రంగా స్పందించారు.
కాగా, రేవంత్ వ్యాఖ్యలపై టీ.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి తీవ్రంగా స్పందించారు.కాంగ్రెస్ నేతలేమీ రేవంత్ నౌకార్లు కాదంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.అసలు సిన్హాను ఎందుకు కలవడకూడదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు.ఈ క్రమంలో పంచాయితీ కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి చేరింది. ఇప్పటికే రేవంత్ ఢిల్లీలో ఉండగా, సిఎల్పీ నేత భట్టిని సైతం సిన్హా పర్యటన నేపధ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించేందుకు అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకుంది.
నిజానికి, కొంతకాలం కిందట రాష్ట్ర పర్యటనలో భాగంగా గాంధీభవన్‌కు వచ్చిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్టీ లైన్ దాటి ఎవరూ మీడియా ముందు మాట్లాడకూడదని, పార్టీ నేతల గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు.అప్పటి నుంచి జగ్గారెడ్డి కాస్త మెత్తబడ్డట్లుగా కనిపించింది. అప్పటిదాకా రేవంత్ ను తరచూ విమర్శించే ఆయన రాహుల్ పర్యటన తర్వాత ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కానీ, సిన్హా పర్యటన నేపథ్యంలో రేవంత్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. దాంతో, పార్టీ లైన్ దాటిన జగ్గారెడ్డిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలంటూ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జితో పాటు రాజకీయ సలహాదారుగా ఉన్న సునీల్ కనుగోలు సైతం నివేదిక అందించినట్టు సమాచారం.
అదేసమయంలో పార్టీకి సమాచారం ఇవ్వకుండా యశ్వంత్ సిన్హాకు బేగంపేట ఎయిర్‌పోర్టులో టీఆర్‌ఎస్‌తో కలిసి స్వాగతం పలికిన వి.హనుమంతరావుకు సైతం షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.