ఏపీకి తుఫాను గండం పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది.కేరళ, కర్ణాటక వైపుగా పయనించి ఈ నెల 16నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.ఆ తరవాత అది మరింత బలపడి తీవ్ర,అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.ఈ తుఫానుకు తౌక్టే పేరు ఖరారు చేశారు.ఈ నెల 18నాటికి గుజరాత్ వద్ద తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు.
తెలుగు రాష్ట్రాలు సేఫ్
తౌక్టే తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పెద్దగా ఉండదని వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు.అయితే బంగాళాఖాతం నుంచి వచ్చే తేమ గాలుల వల్ల రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ తుఫాను నైరుతి రుతుపవానాలపై ఎలాంటి ప్రభావం చూపదని అధికారులు అంచనా వేశారు. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా మరో ద్రోణి వ్యాపించి ఉందని ఐఎండీ తెలిపింది.దీని ప్రభావంతో ఏపీలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.











