ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి వేగంగా బాటలు వేస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని ఐటీ వ్యాలీ తరహాలోనే..ఏపీలోనూ అత్యాధుని సాంకేతిక పరిజ్ఞానంతో కూటమి క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ వ్యాలీని స్థాపించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీలో క్వాంటమ్ వ్యాలీని స్థాపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తున్నారు.
ఇందులో భాగంగా వెలగపూడి సచివాలయంలో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, ఎల్ అండ్ టీ చైర్మన్, ఎండీ S.N.సుబ్రమణియన్ తదితరులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి అవసరమైన చర్యలపై రివ్యూ నిర్వహించారు. యువతకు క్వాంటమ్ టెక్నాలజీలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలతో సహా..రాష్ట్ర ఆర్థిక బలోపేతానికి దోహదపడేలా ఈ వ్యాలీ నిర్మాణం జరిగేలా చర్యలు చేపట్టాలని ఈ అత్యున్నత స్థాయి సమావేశం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేయాలని తీర్మానించింది. క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని గుర్తించే బాధ్యతలను కూడా ఈ టాస్క్‌ఫోర్స్‌కు అప్పగిస్తారు. టాస్క్‌ఫోర్సు నివేదిక ఆధారంగా కంప్యూటర్ రంగంలో విప్లవాత్మక మార్పులను వేగంగా తెస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ వ్యాలీపై తుది నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు.
హైదరాబాద్‌లో హైటెక్ సిటీని నిర్మించడం ద్వారా ఐటీ వ్యాలీ ఏర్పాటుకు వీలుకలిగింది. ఇపుడు రాష్ట్ర రాజధాని అమరావతితో సహా..రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలోనూ ఐటీ పరిశ్రమను విస్తరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో..శరవేగంగా రాష్ట్ర రాజధాని నగరం అభివృద్ధి చెందేందుకు దోహదపడే క్వాంటమ్ వ్యాలీని అమరావతిలోనే ఏర్పాటు చేయడంపైనా చంద్రబాబు దృష్టి సారించారు. మరోవైపు విశాఖలో ఐటీ రంగం అభివృద్ధికి అవసరమైన చర్యలు..ఐటీ దిగ్గజ సంస్థల స్థాపనపైనా కసరత్తు చేస్తున్నారు.
1990 దశకంలో ఐటీ రంగం ఆవిర్భావం మొదలైంది. ఈ సమయంలో ఎల్ అండ్ టీ నిర్మించిన హైటెక్ సిటీ స్థాపనతో హైదరాబాద్ ప్రపంచానికి పరిచయమైంది. ఐటీ రంగానికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని అమరావతిలోనూ హైదరాబాద్ తరహాలో ఐటీ వ్యాలీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. 2014-19 మధ్యకాలంలో ఐటీ పరిశ్రమను అమరావతికి రప్పించే ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు కొనసాగుతుండగా 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుతో పరిస్థితి తలకిందులైంది.
గత ఐదేళ్ల పాటు అమరావతి అభివృద్ధి అటకెక్కింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో రాజధాని అమరావతి పనులు మొదలయ్యాయి. అమరావతిని అభివృద్ధి చేయాలంటే ఐటీ, జీనోమ్ వ్యాలీల తరహాలో..అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో కూడిన క్వాంటమ్ వ్యాలీ అవసరమని సీఎం చంద్రబాబు భావించారు. ఈ నేపథ్యంలోనే..క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుపై కీలక భేటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ ప్రొఫెసర్ అభయ్ కరాండికర్, క్వాంటమ్ టెక్నాలజీ సెంటర్ DST హెడ్ డాక్టర్ రెడ్డి, ఐఐటీ తిరుపతి డైరెక్టర్ కలిదిండి సత్యనారాయణ, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి, ఐబీఎం రీసెర్చ్ ఇండియా డైరెక్టర్ అమిత్‌సింఘీ, ఐబీఎం ఇండియా క్వాంటమ్ లీడర్ వెంకట సుబ్రమణియన్ తదితరులు పాల్గొన్నారు