ఎంపీలు రాజీనామా చేస్తే.. ప్రత్యేక హోదా వస్తోందా!?
ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటే ఎంపీలు రాజీనామా చేస్తే.. తప్పక వస్తోంది అన్నది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయం. ఇదే విషయంపై సీఎం జగన్ రెడ్డికి చంద్రబాబు సవాలు విసిరారు. ‘మీ ఎంపీలతో రాజీనామా చేయించండి .. మా ఎంపీలు కూడా రాజీనామా చేస్తారు’ అన్నది చంద్రబాబు విసిరిన సవాలు. 25 మంది ఎంపీలు ఒక్కసారిగా రాజీనామా చేసి, కేంద్రంపై వత్తిడి చేస్తే .. ప్రత్యేక హోదా ఎందుకు రాదని చంద్రబాబు ప్రశ్నించారు! జగన్ రెడ్డి కేవలం అవకాశ వాద రాజకీయాలకే ప్రాధన్యతనిస్తారని, రాష్ట్ర ప్రయోజనాలకు ఆయనేం చేశారో చెప్పాలని బాబు నిలదీశారు. పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు పోరాడిన విధంగా వైసీపీ ఎంపీలు ఎందుకు పోరాడలేక పోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి ఇవ్వాల్సినవి మాని .. ఉన్నవి కూడా పీకేస్తున్నారు ..!
కేంద్రం ఏపీపై కక్ష కట్టింది. తోలుబోమ్మలాంటి ముఖ్యమంత్రి కారణంగానే రాష్ట్రం సర్వనాశనం అవుతోంది. ప్రత్యేక హోదా గడిచిపోయిన గతం, రైల్వే జోన్ పరిశీలనలో లేని దస్త్రం అంటూ హేళన చేసి కేంద్రం మాట్లాడుతుంటే.. చేవ చచ్చిన అధికారపార్టీ ఎంపీలు కనీసం నోరు పెగలకపోవడం ఐదు కోట్ల ఆంధ్రులు చేసుకున్న దౌర్భగ్యం! హోదా వస్తే ఒంగోలు లాంటి పట్టణం హైదరాబాద్ అవుతోంది, రాష్ట్రం మారిపోతోందని చెప్పిన జగన్ ఆ మాటలు ఇప్పడు ఏమయ్యాయని చంద్రబాబు ప్రశ్నించారు. మరోపక్క విశాఖ ఉక్కును ప్రైవేటు హక్కుగా మార్చేందుకు ప్రత్యక్ష చర్యలకు పాల్పడుతుంటే.. కనీసం ఆపలేని సోయిలేని ముఖ్యమంత్రి జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. ప్రైవేటీకరణ అంశం జగన్ రెడ్డికి ముందే తెలుసని .. అందుకే దానిపై గట్టిగా మాట్లాడలేకపోతున్నారని ఆరోపణలు లేకపోలేదు. విశాఖ ఉక్కు కోసం నాడు ఎర్రంనాయుడు పార్లమెంట్ లో పోరాడిన సంగతిని చంద్రబాబు గుర్తుచేశారు.











