టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో ఇరు పార్టీల అధినేతలు అనుసరిస్తున్న వ్యూహాలతో జగన్ మతి పోతోంది. నిజానికి ఈ ఉమ్మడి మేనిఫెస్టోను గతంలోనే ప్రకటిద్దామని అనుకున్నారు. తర్వాత.. యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన యువగళం నవశకం భారీ సభ ద్వారానే వెల్లడించాలని అనుకున్నారు. కానీ, ప్రకటించలేదు. త్వరలో మరో రెండు సభలు ఉంటాయని, తిరుపతి, అమరావతిలో తనతో పాటు, పవన్ కల్యాణ్ తో కలిసి భారీ సభలు నిర్వహిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఆ సభల వేదికగా ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పడం.. జగన్ కు మింగుడు పడడం లేదు.
కొద్ది రోజులుగా టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోపై ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే టీడీపీ రాజమండ్రి వేదికగా.. 11 ప్రధాన అంశాలతో ఉమ్మడి మినీ మేనిఫెస్టోను విడుదల చేసింది. పూర్తి స్థాయి మేనిఫెస్టోను ప్రకటించాల్సి ఉంది. ఎన్నికలకు సమయం మరింత దగ్గర పడుతుండటంతో ఇరు పార్టీ అధినేతలు సీట్ల సర్దుబాటు సహా, ఉమ్మడి మేనిఫెస్టోపై ఇటీవల చర్చలు జరిపారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఏయే అంశాలు పెట్టాలి? దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. హైదరాబాద్‌లోనే చంద్రబాబు నివాసంలో వీరి మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశాల్లోనే ఉమ్మడి మేనిఫెస్టోను అప్పుడే బయటకు వెల్లడించవద్దని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అయితే, ఉమ్మడి మేనిఫెస్టోను కాస్త ఆలస్యం చేయడం వెనుక ఓ వ్యూహం దాగిఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ జనసేన ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. వారు ఎక్కడ సభ పెట్టినా, పాదయాత్ర లేదా ప్రజా కార్యక్రమం ఏది నిర్వహించినా విపరీతమైన జనాదరణ ఉంటోంది. వైఎస్ఆర్ సీపీ గ్రాఫ్ పడిపోయిన సంగతి.. ఎమ్మెల్యేల ప్రక్షాళన పేరుతో వారు వ్యవహరిస్తున్న తీరుతోనే స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో కాస్త సమయం తీసుకొని ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తే బావుంటుందని టీడీపీ యోచిస్తోంది. రానురానూ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్ఆర్ సీపీ మరింత ఆత్మరక్షణలో పడిపోతూ ఉంటుంది. ఉద్వాసనకు గురైన నేతలను సముదాయించుకోవడం, గెలుపు కోసం ప్రయత్నాలు చేసుకోవడం లాంటిపైనే అధికార పార్టీ ఫోకస్ ఉంటుంది. ఆ సమయంలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రవేశపెడితే దానిపై స్పందించేందుకు అధికార పక్షానికి సమయం ఇవ్వకుండా చేయాలనేది టీడీపీ వ్యూహంగా తెలుస్తోంది.
గత ఎన్నికల్లో జగన్ కు అనుకూలంగా మారిన సామాజిక సమీకరణాలను ఈ సారి తమ వైపు తిప్పుకొనేలా టీడీపీ-జనసేన ప్రయత్నం చేస్తున్నాయి. కాపు సామాజిక వర్గం ఈసారి ప్రధానంగా టీడీపీ జనసేన వైపు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆ వర్గం పూర్తిగా వైసీపీకి దూరం అయినందున.. వారితో పాటు అన్ని వర్గాలను ఆకర్షించేలా షణ్ముఖ వ్యూహం పేరుతో ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.