తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు ముగిసింది. మూడు రోజుల పాటు అత్యంత సందడిగా, ఉత్సాహంగా ఈ మహానాడు సాగింది. చివరి రోజు నిర్వహించిన భారీ బహిరంగ సభకు 5 లక్షల మందికిపైగా జనం హాజరయ్యారు. తెలుగుదేశం బలం ఏంటో మరోసారి మహానాడు నిరూపించింది. కేవలం పార్టీపై అభిమానంతో లక్షలాది మంది రాష్ట్రం నలుమూలల నుంచి కడపలో నిర్వహించిన మహానాడుకు తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీ 43 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ..కార్యకర్తల్లో ఇప్పటికీ జోష్ తగ్గలేదు. ఎప్పటికప్పుడూ పార్టీకి కొత్త రక్తం వచ్చి చేరుతోంది. గతం కంటే ఇప్పుడు పార్టీ యువరక్తంతో తొణికిసలాడుతోంది.
1983లో పార్టీ స్థాపించిన సమయంలో ఇలాంటి జోష్ కనిపించేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ టైంలో తెలుగుదేశం పేరు మారుమోగింది. ఎన్నికల ఫలతాల గురించి చెప్పనక్కర్లేదు. అప్పటి నుంచి మహానాడు ప్రతి రెండేళ్లకోసారి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏనాడూ కృత్రిమంగా నిర్వహించలేదు. ఎప్పటికప్పుడు నూతన ఉత్సాహంతో నేతలు, కార్యకర్తలు ముందుకు సాగుతూ పోయారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ ప్రతిపక్షంలో రాజమండ్రి, ఒంగోలులో రెండు సార్లు మహానాడు నిర్వహించారు. ఐతే ఆసమయంలో టీడీపీ కార్యకర్తల్లో కసి పెంచడానికి జగన్ పరోక్షంగా సహకరించారు. బస్సులు ఇవ్వలేదు. ఆర్టీసీ బస్సులే కాదు..స్కూల్, కాలేజీ బస్సుల్ని ఉపయోగించుకోనివ్వలేదు. అయినా కార్యకర్తలు కార్లు, బైకులపై వచ్చారు. సొంత ఖర్చులు పెట్టుకుని వచ్చారు. చివరకు నడుచుకుంటూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చేలా స్ఫూర్తి నింపారు. ఇప్పుడు కూడా అదే ఉత్సాహం, పట్టుదల కనిపిస్తున్నాయి.
టీడీపీని ఓడించేది టీడీపీయే. కార్యకర్తలతో ఇటీవల చంద్రబాబు అన్న మాట ఇది. కోపం వస్తే ఇంట్లో పడుకుంటారు కానీ మరో పార్టీకి టీడీపీ కార్యకర్తలు పని చేయరన్న ప్రచారం ఉంది. ఆ విషయం ఈ మహానాడుతో మరోసారి నిరూపితమయింది. మరో 50 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ ఢోకా లేదని కడపగడ్డపై నిర్వహించిన ఈ మహానాడు నిరూపించింది.