గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్.. పారిశ్రామిక వేత్త అనే సంగతి అందరికీ తెలిసిందే. వ్యాపారరంగంలో రాణించి.. రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఇక్కడ కూడా హుందాగానే ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. రాజకీయ పరంగా ఆయనపై ఎలాంటి మచ్చలు లేవు. గుంటూరు నుంచి గత ఎన్నికల్లో రెండో సారి కూడా ఎంపీగా ఎన్నికయ్యారు. ఇందుకు అప్పట్లో ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో ప్రధానిని నిలదీసిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. రెండోసారి కూడా గల్లా జయదేవ్ గెలవడానికి అది కూడా ఓ కారణంగా చెబుతారు.
అయితే, కొన్నాళ్లుగా గల్లా జయదేవ్ రాజకీయాల్లో నుంచి తప్పుకొని వ్యాపార రంగంపైనే ఫోకస్ చేద్దామని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలోని ఆయన కంపెనీ అయిన అమర్ రాజా ఫ్యాక్టరీలపై దాడి జరిగింది. దీంతో ఆయన తన ప్లాంట్ విస్తరణను హైదరాబాద్‌కి తరలించారు. దీంతో, ఆయన పాలిటిక్స్ ని దూరం పెట్టి తన సొంత బిజినెస్‌పై ఫోకస్ చేయాలని భావిస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ, తాజా పరిణామాలతో గల్లా జయదేవ్ మనసు మార్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది. గుంటూరులో టీడీపీకి అనుకూలంగా సర్వేలు రావడంతో మూడో సారి కూడా గుంటూరు ఎంపీగా పోటీ చేసి గెలవాలని మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మూడో సారి కూడా గెలిస్తే హ్యాట్రిక్ సాధించినట్లే అవుతుంది.
అందుకే, క్రికెట్ కి గుడ్ బాయ్ చెప్పేసి.. జగన్ వెంట తిరుగుతున్న క్రికెటర్ అంబటి రాయుడు తన మకాం మార్చినట్లుగా చెబుతున్నారు. తొలుత గుంటూరు ఎంపీ టికెట్ లేదా ఆ ప్రాంతంలోనే ఎమ్మెల్యే టికెట్ ను అంబటి రాయుడు వైసీపీ నుంచి ఆశించారు. ఆ ప్రకారమే.. వివిధ వర్గాలను కలుస్తూ.. గుంటూరు చుట్టుపక్కల బాగా పర్యటనలు చేశారు. కానీ, కొద్ది రోజుల నుంచి గుంటూరు నుంచి తన మకాం విశాఖపట్నానికి మార్చారు. సర్వేలన్నీ టీడీపీకే అనుకూలంగా వస్తుండడంతో.. రూట్ మార్చుకున్న అంబటి రాయుడు వైజాగ్‌వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పుడు అంబటి రాయుడు టికెట్ కోసం విశాఖపట్నంలో విపరీతమైన వేషాలు కూడా వేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమం ఆడుదాం ఆంధ్రాకు బ్రాండ్ అంబాసిడర్ తరహాలో వ్యవహరిస్తూ ఉన్నారు. పైగా, వింతైన వేషాలు ధరించి క్రికెట్ ఆడుతూ కనిపిస్తున్నారు. విశాఖలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ.. జగన్ ను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఆయన పెట్టిన పథకాలు నాడు-నేడు, ఆరోగ్యశ్రీ వంటివి అద్భుతం అంటూ.. ఎలాంటి లోపం లేకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అంబటి మాట్లాడుతున్నారు. రాష్ట్రం ఇంత అప్పుల్లో కూరుకుపోతే.. ఎలాంటి లోపం లేదని ఆయన ఎలా అనగలిగారని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.











