నీ కంటే పార్టీలోకి నేనే ముందు వచ్చా అనే కరణం వెళ్లి పోయారు. కష్టాల్లో జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు మోసిన జనార్థనుడు 2019లో ఓటమితో నిరాశలో కూరుకుపోయాడు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అంటేనే మేమే అని అధికారం చేలాయించిన శిద్ధా, బాలకృష్ణ స్నేహితుడు కదిరి బాబూరావు, పోతుల సునీతలు బైబై బాబు అని ప్యాను గూటిలో చేరిపోయారు. అద్దంకిలో గొట్టిపాటి.., మార్కాపురంలో కందుల నారాయణరెడ్డి, గిద్దలూరులో అశోక్ రెడ్డి, కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీలో ఉన్నారో లేదో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇది నేడు ప్రకాశం జిల్లాలో టీడీపీ పార్టీ దుస్థితి. వైసీపీకి పట్టున్న ప్రకాశం జిల్లాలో 2014లో 5 ఎమ్మెల్యే సీట్లు గెలిచి, 2019లో వైసీపీ గాలిలో కూడా 4 సీట్లు గెలిచారు. నాయకులంతా పార్టీని వదిలేసి వెళ్లిపోతే.., ఇక పార్టీ మనుగడ జిల్లాలో ఉంటుందా..? ఇన్నాళ్ళూ పార్టీ జెండా మోసాము…? గ్రామాల్లో వైసీపీ నేతల బెదిరింపులు ఎవరికి చెప్పుకోవాలని కార్యకర్తలు అందరూ నిన్నటి వరకూ ఆందోళనలో ఉన్నారు. కానీ, వారు ఇప్పుడు ఆ ఒక్క ఎమ్మెల్యేని చూసి ధైర్యం తెచ్చుకుంటున్నారు.
పర్చూరు రాజకీయం అన్నీ నేర్పిందా…!
వ్యాపారవేత్త నుంచి రాజకీయాల్లోకి వచ్చి పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఏలూరి సాంబశివరావు ఏ రోజూ టీడీపీలో కీలక బాధ్యతలు మోయలేదు. 2014లో పర్చూరులో గొట్టిపాటి కుటుంబంపై, 2019లో ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరావుపై గెలిచినా కూడా డబ్బులున్నాయి, బలరాం, రవి సపోర్ట్‌తో గెలిచాడు.. లేకపోతే గెలిచేవాడా? అని ఆ పార్టీ కార్యకర్తలు ఆయన వెనుక మాట్లాడుకుంటారు. కానీ, ఇప్పుడు అదే ఏలూరు టీడీపీ క్యాడర్‌లో నమ్మకాన్ని కలిగిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రావడంతో సీనియర్ నేతలు అంతా వైసీపీకి క్యూ కట్టారు.
ఏలూరి కూడా వైసీపీలోకి వెళ్లిపోతారనే బలమైన ప్రచారంతో పాటు.., ఆయన్ని వైసీపీ నేతలు సంప్రదించారు కూడా. పార్టీలో సీనియర్ నేత కరణం పార్టీ మారాకా..? ఏలూరి ఉంటారనే నమ్మకం ఎవ్వరికీ లేదు. వ్యాపారాలు కాపాడుకోవడానికి, భవిష్యత్తులో దగ్గుబాటి కుటుంబం నుంచి వచ్చే రాజకీయ ఎత్తుగడులను ఎదుర్కోవాలంటే వైసీపీలోకి వెళ్లడమే మంచిదని ఆయన సన్నిహితులు సలహా ఇచ్చారు. కానీ, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.., టీడీపీ తరఫున బాపట్ల పార్లమెంట్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తరువాత ప్రతి గ్రామం తిరుగుతూ నిరాశలో కూరుకుపోయిన టీడీపీ క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపుతున్నారు ఏలూరి సాంబశివరావు.
వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు..
ప్రకాశం జిల్లాలో వైసీపీ పార్టీపై లేదా జగన్‌పై ప్రెస్ మీట్ పెట్టమంటే.. టీడీపీ నేతల్లో ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా? తమకేమీ తెలియనట్లు సైలెంట్‌గా ఉంటున్నారు. వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ ప్రభావం ఉన్న అద్దంకి, మార్కాపురం, ఒంగోలు, కనిగిరి, దర్శి, కొండపి నియోజకవర్గాల్లో టీడీపీ వారిపై దాడులు జరిగినా ఏ మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యేలు ముందుకు వచ్చి అండగా నిలబడలేదు. ఓ ప్రెస్ నోట్ ఇవ్వడం? మరీ ముఖ్యమైన కార్యకర్త అయితే వైద్య సహాయానికి డబ్బులు ఇవ్వడంతో సరిపెట్టారు.
కానీ, మొన్నటి వరకూ వైసీపీలోకి వెళ్లిపోతాడు అన్న ఏలూరి మాత్రం ఇవేమి లెక్క చేయకపోవడం ఆ పార్టీ కార్యకర్తల్లో నమ్మకాన్ని కలిగిస్తోంది. మొన్నటి వరకూ సైలెంట్‌గా ఉన్న ఏలూరి బాపట్ల ఎంపీ స్థానం పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వైసీపీ, జగన్‌పై విమర్శలూ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం పోలవరంపై ప్రెస్ మీట్ నిర్వహించి.. ఎత్తు తగ్గిస్తే ఉద్యమం చేస్తామని టీడీపీ తరఫున ప్రకటించారు. శనివారం జగన్‌కి నివర్ తుఫానుతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని లేఖ రాశారు. ఆదివారం మాజీ నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమతో కలిసి బాపట్ల పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు.
ప్రతిరోజూ గ్రామాల వారీగా పర్యటన..
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏలూరి కేవలం క్యాంపు ఆఫీసుకే పరిమితం అయ్యేవారు. గ్రామాల్లో ద్వితియశ్రేణి నేతల ద్వారా పనులు నిర్వహించే వారు. ఇదే గతంలో టీడీపీ సీనియర్ నేతలు, ఏలూరి మధ్య వార్‌గా మారింది. ఓ దశలో 2019లో టికెట్ ఏలూరికి ఇవ్వొద్దని నేతలంతా తిరగబడ్డారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి చంద్రబాబు ఏలూరి టికెట్ ఇచ్చారు. గత అనుభవాల వల్లనేమో గానీ, ప్రస్తుతం ప్రతిపక్షంలో చాలా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. గ్రామాల వారీగా పర్యటనలు, కార్యకర్తల ఇళ్లలో మంచి, చెడు కార్యక్రమాలకు హాజరవ్వడం.., నిర్ణయాత్మకంగా వైసీపీపై విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదే ఇప్పుడు ప్రకాశం జిల్లా టీడీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. నివర్ తుఫానుతో జిల్లాలో చాలాచోట్ల పంటలు మునిగిపోయి రైతులు ఏడుస్తుంటే.. ప్రకాశం జిల్లాలో ఏలూరి మాత్రమే పొలాల్లో పర్యటించి.., రైతులకు భరోసా నివ్వడమే గాకుండా సాయం చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వం నుంచి ఇంత వరకూ ఎలాంటి ప్రకటన రాకపోయినా.. శనివారం నెల్లూరు, చిత్తూరు జిల్లాల పర్యటనలో జగన్ రైతుల్ని కచ్చితంగా ఆదుకుంటామని ప్రకటించారు. ఇది ఓ విధంగా ఏలూరికి ప్లస్ అయిందనే చెప్పుకోవాలి.
ముందు ముందు ఇదే విధంగా ముందుకు సాగుతూ ఏలూరి టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చి ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఊపిరి పోస్తారో.. లేదో వేచి చూడాల్సిందే..!











