(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ శివరామిరెడ్డి ఎదుట గురువారం సాయంత్రం ఐదు గంటలలోపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో నందివిగ్రహం ఏర్పాటు వివాదం పై పోలీసులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు.
ఎప్పుడు రమ్మన్నా ..
అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చట్టాన్ని గౌరవించిన వ్యక్తిగా పోలీసుల ముందు, వారు నిర్దేశించిన సమయానికి ముందే హాజరయ్యానని తెలిపారు. ఎప్పుడు రమ్మన్నా, ఎక్కడికి రమ్మన్నా వస్తానని, వారు అడిగిన ప్రశ్నలకు .. నాకు తెలిసినంతవరకూ సమాధానం చెబుతానని తెలిపారు.
అచ్చెన్నకు 41ఏ నోటీసు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి టెక్కలి పోలీసులు 41ఏ నోటీసు ఇచ్చారు. విశాఖలోని ఆయన స్వగృహానికి బుధవారం వెళ్లి నోటీసు అందజేశారు. సంతబొమ్మాళిలోని పాలేశ్వరస్వామి ఆలయం బయట నంది విగ్రహ ప్రతిష్ఠాపన ఘటనకు సంబంధించి కాశీబుగ్గ డీఎస్పీ ముందు గురువారం విచారణకు హాజరు కావాలని అక్కడికి వెళ్లిన పోలీసులు స్పష్టం చేశారు. ఘటనలో పాల్గొన్నవారు ముందురోజు అచ్చెన్నాయుడిని కలిశారని, అందుకే విచారణకు హాజరు కావాలని పోలీసులు చెప్పినట్లు తెలిసింది. నోటీసు అందుకున్న అచ్చెన్నాయుడు ఈరోజు డీఎస్పీ ముందు హాజరయ్యారు.
నంది విగ్రహం ఏర్పాటుతో ..
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి పాలేశ్వరస్వామి ఆలయంలో ఉన్న నంది విగ్రహాన్ని ఆలయకమిటీ సభ్యులు కొంతమంది తీసుకొచ్చి సంతబొమ్మాళి కూడలిలో ఉన్న ఒక దిమ్మెపై ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. దీనిపై స్థానిక వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు 16 మందిపై సంతబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో కొందరు అంతకుముందు అచ్చెన్నాయుడును కలిసినట్లు తెలిసింది. ఫిర్యాదులో పేర్లున్న కొందరు ఆయన్ను కలిసిన తర్వాతే ఈ ఘటన జరిగిందని, అందుకే ఆయన్ను కూడా విచారించేందుకే పోలీసులు నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.
Must Read ;- పోలీసు నోటీసు: విగ్రహాల ధ్వంసంతో అచ్చెన్నకు లింకా?