(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి – కోటబొమ్మాళి మధ్యలో ఉన్న 110 ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన శివాలయంలో నంది విగ్రహం అపహరణ వెనుక అనేక నాటకీయ, రాజకీయ పరిణామాలు ఉన్నట్లు “లియో న్యూస్” పరిశీలనలో సుస్పష్టమైంది.
వైసీపీ చర్యలకు నిరసనగా ..
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి – కోటబొమ్మాళి రహదారిపై పాలేశ్వరస్వామి ఆలయం కూడలిలో ఎర్రన్నాయుడు విగ్రహం ఏర్పాటు చేయాలని తెదేపా నేతలు గతంలో దిమ్మ నిర్మించినట్లు తెలిసింది. ఆధ్యాత్మిక ప్రాంతం వద్ద రాజకీయ నేతల విగ్రహాలు ఏర్పాటు చేయవద్దని అప్పట్లో ఆలయ నిర్వాహణ కమిటీ సభ్యులు కోరడంతో ఆ పనులు నిలిపివేశారు. అయితే .. తాజాగా అదే దిమ్మపై వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు పలువురు వైకాపా నాయకులు ముందుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన ఆలయ కమిటీ సభ్యులు అక్కడకు దగ్గర్లోని .. పురాతన శివాలయంలోని నంది విగ్రహాన్ని శుక్రవారం రాత్రి తీసుకువచ్చి ఆ దిమ్మపై అమర్చినట్లు తెలిసింది.
దువ్వాడ రంగప్రవేశంతో ..
ఈ విషయాన్ని తన అనుయాయుల ద్వారా తెలుసుకున్న టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్ రంగప్రవేశం చేసి రాజకీయ చతురతను ఉపయోగించినట్లు తెలుస్తోంది. నంది విగ్రహాన్ని పరిశీలించిన ఆయన ఆగమశాస్త్రానికి విరుద్ధంగా రహదారిపై విగ్రహం ఏర్పాటు చేశారని, ఇది సరికాదని అభ్యంతరం తెలిపినట్లు వినికిడి. అంతేకాకుండా తన అనుయాయుల సహకారంతో శివాలయం పూజారి ద్వారా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయించినట్లు తెలిసింది. ఈ విషయంపై ఫిర్యాదు అందిన వెంటనే టెక్కలి సీఐ ఆర్.నీలయ్య, సంతబొమ్మాళి ఎస్.ఐ గోవింద్ శనివారం మధ్యాహ్నం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం విగ్రహం, సిమెంట్ దిమ్మను తొలగించి వేరే చోట భద్రపరిచారు.
16మందిపై కేసు
మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలకు దిగితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి హెచ్చరించారు. టెక్కలి పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలేశ్వరస్వామి ఆలయ కూడలిలో రాత్రికి రాత్రే నంది విగ్రహం ఏర్పాటును తీవ్రంగా పరిగణించినట్లు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, మరికొంతమంది ఎటువంటి ఆచార సంప్రదాయాలు పాటించకుండా ఉద్దేశ పూర్వకంగా నందివిగ్రహాన్ని ఏర్పాటుచేశారని చెప్పారు. ఆలయం వద్ద ఉన్న సీసీ పుటేజీల ఆధారంగా విచారణ జరిపి 16 మందిపై కేసు నమోదు చేశామని చెప్పారు.