ఏపీలో కరోనా తీవ్రతతో ప్రతి రోజూ దాదాపు 10 వేల కేసులు నమోదవుతున్నాయి. సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. గుంటూరు జిల్లాలో కరోనా తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఈఎస్ఐ కేసులో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడుకు కూడా కరోనా నిర్దారణ అయింది. కరోనా ఉద్రిక్తత నేపథ్యంలో తనను హాస్పిటల్ కు తరలించాలని అచ్చెన్న విజ్ఞప్తి చేసినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. హైకోర్టు అనుమతుల మేరకు ఆయనను రమేష్ హాస్పిటల్ కు తరలించారు. కానీ ఆ మహమ్మారి తాజాగా అచ్చెన్నకు సోకింది. ప్రభుత్వం మొండి వైఖరి కారణంగానే ఆయన ఈ వైరస్ భారిన పడ్డారనే చర్చ రాష్ట్రంలో జరుగుతోంది. ఆయనకు ఏదయినా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ సీనియర్ నాయకుడు టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కరోనా భారిన పడ్డారు. బుధవారం ఉదయం నుంచి జలుబుతో బాధపడుతున్న ఆయనకు కరోనా పరీక్షలు జరిపారు. ఈ పరీక్షలలో కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఆయనకు కరోనా సోకడంతో హైకోర్ట్ కు లేఖ వ్రాయాలని నిర్ణయం తీసుకున్నారు. అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిని ప్రతివారం హైకోర్ట్ కు రమేష్ హాస్పిటల్ తెలియచేస్తున్న సంగతి తెలిసిందే. ఈఎస్ఐ మందుల కొనుగోలులో అక్రమాలు జరిగాయని అప్పటి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు జూన్ 12న అరెస్ట్ చేశారు. పైల్స్ ఆపరేషన్ జరిగి విశ్రాంతి తీసుకుంటున్న అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నుంచి గుంటూరుకు తీసుకువచ్చారు.పైల్స్ సమస్యతో బాధపడుతున్న ఆయనను ఆ తరువాత గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
ఆ తరువాత నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఏసీబి అధికారులు ఆయనను జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను రమేష్ హాస్పిటల్ లో చేర్చాలని కోర్ట్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆయన గత కొన్ని రోజులుగా రమేష్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. అచ్చెన్నాయుడుకు కరోనా సోకడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు.
ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. ఈ మహమ్మారి ప్రభావంతో రాష్ట్రంలో దాదాపు 2 లక్షల 50 కేసులు నమోదు కాగా 47 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.