చేసిందంతా చేసేసిన తర్వాత.. ‘తూచ్ నాకేం తెలీదు’ అంటే ఎలా ఉంటుంది? అచ్చం అదే మాదిరిగా చేయవలసిందేమీ చేయకపోగా.. ‘టెక్నికల్ ఎర్రర్’ అనడం కూడా అంతే కామెడీగా ఉంటుంది. ఇప్పుడు జగన్ అనుగ్రహప్రాప్తి వినా.. తమ ఉద్యోగ జీవిత ప్రస్థానంలో మరేమీ అవసరం లేదని అనుకుంటున్న అధికార గణాలు యావత్తూ.. అలాంటి కామెడీ మంత్రాన్నే జపిస్తున్నాయి. నోటిఫికేషన్ విడుదల తర్వాత.. సర్వంసహా సర్వాధికారిగా ఉండగల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారాలను గుర్తించకుండా, ఆయన ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సుకు హాజరు కాకుండా.. అధికారులు డొంకతిరుగుడు సాకులు చెబుతుండడం.. హాస్యాస్పదంగా ఉంది.
నిమ్మగడ్డే ప్రధాన అడ్డంకి
వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమారే ప్రధాన అవరోధంగా మారినట్టు కనిపిస్తోంది. రెండు నెలల తరవాత ఎన్నికల్లో పాల్గొనేందుకు మేం సిద్ధమని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ప్రకటించాయి. అంటే మార్చి చివరి నాటికి నిమ్మగడ్డ పదవీ విరమణ చేయబోతున్నారు. నిమ్మగడ్డ పదవీ విరమణ చేస్తే వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అధికారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించుకుని, స్థానిక సంస్థలను కైవశం చేసుకునేందుకు వైసీపీ అధినేత ఎత్తుగడగా ఉందనే విషయం అందరికీ తెలిసింది. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం, కొత్త ఏడాది మొదటి నెలలోనే రూ.6000 కోట్లకుపైగా అమ్మఒడి 50 లక్షల మంది తల్లుల ఖాతాల్లో జమ చేశాం, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం… స్థానిక సంస్థల ఎన్నికలకు వెళదామా అని సీఎం, మంత్రులను ప్రశ్నించగా వారు వద్దని సమాధానం చెప్పారట. అంటే కేవలం సంక్షేమ పథకాలు వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కిచలేవని వారు బలంగా నమ్ముతున్నారని తెలుస్తోంది.
Also Read: ‘స్థానికం’పై ఎపీలో సమర భేరి.. క్లైమాక్స్‌పై సర్వత్రా ఆసక్తి!
ఎన్నికల కమిషనర్ ఆదేశాలు బేఖాతర్
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నోటిఫికేషన్ విడుదల అయ్యాక ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల కమిషనర్ చెప్పినట్టు నడుచుకోవాలి. కానీ ఏపీలో ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా ఎన్నికల కమిషనర్ మాటను బేఖాతరు చేయడం లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పంచాయతీ రాజ్ కార్యదర్శి ద్వివేది ఎవరూ కూడా ఎన్నికల కమిషనర్ పిలుపు మేరకు సమావేశాలకు హాజరు కావడం లేదు. ఆయన ఏర్పాటుచేసిన వీడియోకాన్ఫరెన్సును కూడా ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోలేదు. టెక్నికల్ ఎర్రర్ కారణంగా కనెక్ట్ కాలేకపోయాం అని చెప్పడం ఒక కొసమెరుపు.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యాక కర్నూలు కలెక్టర్ ఏకంగా దీర్ఘకాలిక సెలవు పెట్టేశారు. ఇటు ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సాక్షాత్తూ సీఎం అండతోనే అధికారులు ఎన్నికల కమిషనర్ మాట లెక్కచేయడం లేదనేని జగమెరిగిన సత్యమే.
మరో రెండు నెలలు ఇదే తంతు తప్పదా?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు మార్చి చివరి వరకూ పదవీ కాలం ఉంది. ఇప్పటికే నాలుగు దఫాల్లో స్థానిక ఎన్నికలు పూర్తి చేయడానికి నోటిఫికేషన్ ప్రకటించారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఎన్నికల్లో పాల్గొనలేమని తేల్చి చెప్పారు. ఇక నామినేషన్ ప్రక్రియలో రెవెన్యూ అధికారులు పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. నామినేషన్లే తీసుకోకుంటే ఇక ఎన్నికల ప్రసక్తే ఉండదు. ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సోమవారం తీర్పు వెలువడే అవకాశం ఉంది. అక్కడ తీర్పు ఎలా వస్తుందనే దానిపై స్థానిక ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే విషయం తేటతెల్లం కానుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ‘ఉచితం’ఉష్ కాకేనా.. వైసీపీ సర్కారు తీరుపై రైతుల ఆందోళన











