(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం కింద వ్యవసాయ పంపుసెట్లకు (బోరుబావులు) మీటర్లు అమర్చే ప్రక్రియ ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా అయ్యేది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఈ విధానాన్ని కొనసాగిస్తామని చెబుతూనే.. పంపు సెట్లకు మీటర్లు అమర్చుతోంది. నగదు బదిలీ విధానం అమలు చేయనున్నట్టు ప్రకటించింది. నగదు బదిలీ పథకం ద్వారా ఇకపై రైతులు వినియోగించిన వ్యవసాయ విద్యుత్‌కు సంబంధించిన ఛార్జీలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మొత్తాన్ని రైతులు విద్యుత్ బిల్లులుగా చెల్లించాలి. పైలెట్ ప్రాజెక్టుగా సిక్కోలు నుంచే ఈ ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం మీటర్లు అమర్చితే.. భవిష్యత్‌లో ఉచిత విద్యుత్ ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్షాలు సైతం పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు అమర్చొద్దంటూ ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఈ నెలాఖరులోగా జిల్లాలో మీటర్లు అమర్చి.. వాటిలో లోటుపాట్లను సవరించేందుకు చర్యలు చేపడుతోంది. వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
నెలాఖరులోగా స్మార్ట్ మీటర్లు
శ్రీకాకుళం జిల్లాలో 26,405 బోరుబావులు ఉండగా, 25,288 పంపు సెట్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వీటన్నింటికీ ఈ నెలాఖరులోగా స్మార్ట్ మీటర్లు అమర్చనున్నారు. దీంతో పాటు ఇతర రైతుల పేర్ల మీద ఉన్న కనెక్షన్లను క్రమబద్ధీకరించనున్నారు. రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, జి.సిగడాం, పొందూరు మండలాల్లో ఎక్కువగా వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. సీతంపేట మండలంలో తక్కువగా ఉన్నాయి. ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. మీటర్లు బిగించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం వెనుక ఆంతర్యమేమిటో అనే విమర్శలు వస్తున్నాయి.
ముందుగానే బిల్లులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ ఏ రైతు, ఎన్ని యూనిట్లు వినియోగించాడనేది ముందుగా ఎలా తెలుస్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యుత్ వినియోగ విషయాన్ని తెలుసుకునేందుకు మీటర్లు అమర్చుతున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ, భవిష్యత్‌లో ఉచిత విద్యుత్ కొనసాగుతుందో? లేదో? అన్నదానిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఈ పథకం అమలులో భాగంగా సమస్యలు తెలుసుకునేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ కమిటీలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, అది సాధ్యం కాదని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
Must Read ;- నాడు తప్పు : నేడు ఒప్పు : భవిష్యత్ లో ముప్పు