పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. శనివారం ఎన్నికల నోటిఫికేషన్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందనే చర్చ కూడా నడుస్తోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏపీ హైకోర్టు గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. పాత షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల సంఘం శనివారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే ,ఏపీ ప్రభుత్వానికి ఈ విషయంలో ఊహించని అవాంతరం ఎదురైంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ తప్పుల తడకగా ఉండడంతో పిటిషన్ వెనక్కి వచ్చింది. ఆ పిటిషన్‌ను సరిచేసి ఇచ్చేలోగా సమయం మించిపోవడంతో.. సోమవారం వరకు పిటిషన్ దాఖలు చేయలేని పరిస్థితి కనిపిస్తోందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
నోటిఫికేషన్ వస్తే..
మరోవైపు శనివారం నోటిఫికేషన్ వస్తే పరిస్థితి ఏంటనే చర్చ కూడా మొదలైంది. నోటిఫికేషన్ విడుదల అయ్యాక.. అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప..ఎన్నికలను ఆపేలా న్యాయస్థానాలు తీర్పులు చెప్పడం చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. గతంలో పలుమార్లు ఇదే జరిగింది. ఇతర రాష్ట్రాల్లోని విషయం పక్కనబెడితే..తెలంగాణలో 2019 జనవరిలో బీసీ రిజర్వేషన్లను తగ్గించారని ఆరోపిస్తూ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ . కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలు ఆపలేమని హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక్కడే కాదు..గతంలోనూ పలు సందర్భాల్లో పలు పార్టీలు న్యాయస్థానాలను ఆశ్రయించినా ఇలాంటి తీర్పులే వచ్చాయని చెబుతున్నారు. దీంతో ఏపీలో ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య పోరు తారస్థాయికి చేరిందని చెప్పవచ్చు.
ధిక్కరణకు సంకేతాలా..
శనివారం నోటిఫికేషన్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం అవుతున్న తరుణంలో..ఏపీలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలోఉదయం తమతో సమావేశం కావాలని పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. సీఎంతో సమావేశం ఉండడంతో రాలేకపోతున్నామని సమాచారం ఇవ్వడంతో మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేశారు. అయినా వారు రాకపోవడంతో ఐదు గంటలకు మరోసారి ఆ సమావేశాన్ని వాయిదా వేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం వారికి మెమో జారీ చేసినట్లు సమాచారం. శుక్రవారం SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశం అయ్యారు. ఈ విషయంపై న్యాయ నిపుణులతో SEC మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ పథకాల పరిశీలనకు సీఎస్ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లగా..గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌లు సీఎంతో సమావేశమైనట్లు తెలుస్తోంది. మరోవైపు తాము ఎన్నికలకు సిద్ధంగా లేమని ఉద్యోగ సంఘాలు సీఎస్‌ను కలిశాయి.
ఆ అధికారులపై చర్యలకు ప్రొసీడింగ్స్.
గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో గతంలో షెడ్యూల్ ప్రకటించిన సమయంలో మొత్తం 9 మంది అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రొసీడింగ్స్ జారీ చేసింది. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు శామ్యూల్ ఆనంద్‌కుమార్, భరత్ గుప్తా.. ఎస్పీలు విజయారావు, సెంథిల్‌కుమార్‌లను బదిలీ చేయాలని, మాచర్ల సీఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలను.. తిరుపతి, పలమనేరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను బదిలీ చేయాలని కోరింది. తరువాతి కాలంలో వారిపై ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోలేదు. వీరిలో గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావును రైల్వే శాఖకు మార్చగా, పలమనేరు డీఎస్పీకి అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించారు. రాయదుర్గం సీఐ తులసీరాంను సాధారణ బదిలీలో విజయవాడ ఇంటెలిజెన్స్‌కు మార్చారు. తాజాగా నోటిఫికేషన్ విడుదల అవుతున్నందున.. ఎన్నికల సంఘం మరోసారి చర్యలకు ప్రొసీడింగ్స్ జారీ చేసింది. ఆ అధికారులను విధుల నుంచి తప్పిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం తాడిపత్రి సీఐల తొలగిస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేసింది. వారి స్థానాల్లో వేరే అధికారుల పేర్ల జాబితాను పంపాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఇది మరో వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది.
Must Read ;- జగన్ సర్కార్‌కు సుప్రీం షాక్!
నోటిఫికేషన్‌కి అడ్డంకి అవుతుందా..
ఇక శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎన్నికల సంఘంతో సమావేశానికి రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పంచాయతీ రాజ్ శాఖ అధికారులు హాజరైతే.. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, సన్నద్దత, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంటుంది. వారు గైర్హాజర్ కావడంతో చర్చలు జరగలేదు. ఈ కారణంగా ప్రభుత్వం ఎన్నికలను అడ్డుకునేందుకు అమలు చేస్తున్న వ్యూహంలో భాగమేనా అనే చర్చ మొదలైంది. అధికారుల గైర్హాజరుపై ఇప్పటికే ఎస్ఈసీ సీఎస్ అథిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. గతంలో ప్రభుత్వం, ఎన్నికల సంఘం సమన్వయంతో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో.. ఈ గైర్హాజరు సమాచారాన్ని కూడా ఆయన న్యాయస్థానాలకు పంపే అవకాశం ఉంది. కోర్టు ధిక్కరణ ఫిర్యాదు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది.
9 నెలల వివాదం..
ఏపీ సర్కారుకి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కి దాదాపు 9నెలలుగా ఈ వివాదం కొనసాగుతోంది. గత ఏడాది ఏప్రిల్, మే నెలలో నిర్వహించాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తూ మార్చిలో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు SEC వెల్లడించింది. SEC నిర్ణయంతో అప్పట్లో ప్రభుత్వం విభేధించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై అధికార వైసీపీ విమర్శలకు దిగింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగడం, ఆయన కుమార్తెను టార్గెట్ చేయడం, సామాజిక వర్గం పేరుతో తిట్టడం..ఇలా చాలా విమర్శలు చేసింది అధికార వైసీపీ. అదే తరుణంలో ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ..ఆర్డినెన్స్ తెచ్చింది. ఆయన స్థానంలో తమిళనాడు హైకోర్టు మాజీ న్యాయమూర్తి కనగరాజ్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన కూడా హుటాహుటిన వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ జారీచేసిన ఉత్తర్వులపై నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం చెబుతున్న ప్రకారం ఈ విషయంలో ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం రాష్ట్ర సర్కారుకు లేదని సవాలు చేశారు. ఈ అంశంపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను నిలిపి వేస్తూ తీర్పు నిచ్చింది. మళ్లీ SECగా నిమ్మగడ్డను నియమించాలని ఆదేశించింది. తరువాత కూడా దూషణల పర్వం కొనసాగింది. వివాదం కొనసాగింది. నిధుల విడుదల విషయంలోనూ SEC హైకోర్టును ఆశ్రయించి నిధులు సాధించాల్సి వచ్చింది. గత సెప్టెంబరులో ఎన్నికల నిర్వహణకు సంబంధించి SEC సన్నద్ధత ప్రకటించింది. SEC చెబుతున్నట్లుగా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని, కొవిడ్ ఉందని, వ్యాక్సిన్ల పంపిణీ ఉందని ప్రభుత్వం చెబూతూ వచ్చింది. SEC నిర్వహించాలనుకున్న వీడియో కాన్ఫరెన్స్ కు కూడా ప్రభుత్వం అధికారులను పంపించకపోవడం కూడా చర్చనీయాంశమైంది. ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో కుదరదు అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్ని వెల్లడించడం కూడా సంచలనమైంది. ఇక ప్రొటోకాల్ విషయం కూడా వివాదాస్పదమైంది. ఈ వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో హైకోర్టు పలుమార్లు ఇరువర్గాలకు సూచనలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి SECతో చర్చలు జరిపేందుకు కమిటీని పంపాలని సర్కారును ఆదేశించడంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలని SECని ఆదేశించింది.
Also Read ;- కరోనా వ్యాక్సిన్‌తో ఇద్దరికి అస్వస్థత
షెడ్యూల్ విడుదల..
ఆ కమిటీతో ఎన్నికల సంఘం సమావేశం తరవాత..జనవరి 8న ఎన్నికల షెడ్యూల్‌ని SEC వెల్లడించింది. దీంతో అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలు SEC నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఒక రకంగా చెప్పాంటే..ప్రభుత్వమే ఉద్యోగ సంఘాలను SECకి వ్యతిరేకంగా రెచ్చగొట్టిందనే విమర్శలూ వచ్చాయి. ఉద్యోగ సంఘాల నేతలూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను డైరెక్ట్ గానే విమర్శించడంతో పాటు..తాము ఎన్నికలకు సహకరించేది లేదని బహిరంగంగానే ప్రకటనలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తరువాతి కాలంలో ఎన్నికల సంఘ పరిధిలోని ఇద్దరు అధికారులను తప్పిస్తూ..రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఉద్యోగ సంఘాలకూ లేఖ రాశారు. గవర్నర్‌నూ కలిశారు. ఇక జనవరి 8న విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన సింగిల్ జడ్జితో కూడిన ధర్మాసనం.. SEC జారీ చేసిన షెడ్యూల్‌పై స్టే ఇచ్చింది. కాగా ఈ తీర్పుపై SEC హైకోర్టు డివిజన్ బెంచ్‌కి అప్పీల్ చేసింది. ఇదే అంశంలో తమను కూడా అనుమతించాలని (ఇంప్లీడ్ )కోరుతూ ఉద్యోగ సంఘాలూ హైకోర్టులో పిటిషన్ వేశాయి. ఆ పిటిషన్ తిరస్కరించడంతో పాటు.. ప్రభుత్వ, SEC తరఫున లాయర్లు చెప్పిన వాదనలు విన్న హైకోర్టు సీజే జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం గత మంగళవారం విచారణ ముగించింది. తీర్పును రిజర్వ్ చేసి.. గురువారం వెలువరించింది. తీర్పు వచ్చాక..ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం అవుతుండగా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సాంకేతిక కారణాలతో ప్రభుత్వం వేసిన పిటిషన్ వెనక్కి వచ్చింది. అదే సమయంలో ప్రభుత్వ పిటిషన్ విచారించే పక్షంలో తమ వాదనను కూడా వినాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో కెవియట్ దాఖలు చేసింది.
Also Read ;- ఉద్యోగులకు సంఘాలా.. సర్కారుకు బాకాలా!