తెలంగాణలో ఎన్నికల వేడి పీక్ స్టేజ్‌కు చేరింది. నోటిఫికేషన్ రాక ముందే అన్ని పార్టీలూ పొలిటికల్ యుద్ధం మొదలుపెట్టాయి. కర్ణాటక ఎన్నికల ముందు తెలంగాణలో బలమైన పార్టీగా ఎదిగిన బీజేపీ అధ్యక్షుడి మార్పు తర్వాత కాస్త వెనుకబడింది. కర్ణాటక విజయం కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం తెచ్చిపెట్టింది. ఇక బీఆర్‌ఎస్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధికారం తమదేనని అందులో ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దని ప్రత్యర్థులపై తొడగొడుతోంది.
అయితే బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ కంటే బలమైన ప్రత్యర్థిగా మారిన బీజేపీ గ్రాఫ్ అన్యూహంగా పడిపోయింది. అధ్యక్షుడి మార్పు ఇందులో ప్రధానాంశం కాగా, అనేక పరిణామాలు కాంగ్రెస్ ఎదగటానికి, బీజేపీ పడిపోవటానికి కారణమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఇందులో భాగమే. ఏపీలో చంద్రబాబును అరెస్ట్ చేయించిన పాపానికి ప్రధాన కారణం వైసీపీ అధినేత జగన్ అయినప్పటికీ ఆ పాపంలో బీజేపీ పెద్దల హస్తం కూడా ఉందన్న అపవాదును మూటగట్టుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఆన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అన్నా, ఆ పార్టీ అధినేత అన్నా అభిమానం చూపే వాళ్ల సంఖ్య అంచనాలకు మించి ఉంది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌తో సహా తెలంగాణలో చాలా జిల్లాల్లో చంద్రబాబు అభిమానులు బలంగా ఉన్నారు. ఇప్పటి వరకూ బీఆర్‌ఎస్ కు దూరంగా ఉన్న ఆ అభిమానులంతా బీజేపీతో దగ్గరగా ఉంటున్నారు. అవసమైనప్పుడల్లా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ ఓటు బ్యాంక్‌ను నమ్ముకున్న తెలంగాణ బీజేపీ నేతల ఉత్సాహంపై చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం తర్వాత నీళ్లు చల్లినట్టయింది. నెల రోజులుగా బాబును అరెస్ట్ వెనుకే కేంద్రం ప్రమేయముందన్న ప్రచారంతో ఓ ఓటు బ్యాక్ కాస్తా బీజేపీకి దూరమై పోయిందని నమ్ముతున్నారు. మోదీ-అమిత్ షా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని పట్టించుకోపోవటం వల్లే ఇదంతా జరిగిందని అంచనాకొచ్చారు. కీలకమైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటంలో బీజేపీ పెద్దలు విఫమయ్యారన్న ఆగ్రహంతోనూ ఉన్నారు.











