అల్లుడు.. టీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు మీద నమ్మకమో లేక తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నేపథ్యమో గానీ దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ దళపతి మహా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మేడ్చల్ జిల్లా మూడు చింతపల్లిలో ధరణి పోర్టల్ సేవలను సీఎం ప్రారంభించారు. అనంతరం ప్రజలను ఉద్ధేశిస్తూ ప్రసంగించారు. సీఎం మాట్లాడిన తీరు చూస్తే ప్రసంగమంతా సాదా సీదాగా మాట్లాడినట్లుగానే ఉంటుంది. ముఖ్యంగా ధరణి పోర్టల్, భూ యజమానుల హక్కుల పరిరక్షణ, ఇంకా ఒకటి రెండు ఇతర అంశాలపైనే మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నిక రణరంగాన్ని తలపిస్తూ రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.
మరోవైపు ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలందరూ ప్రచారంలో పాల్గొంటూ టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తున్నాయి. అక్కడ గెలుపెవరిదోనని ఉత్కంఠగా ఎన్నికల ప్రక్రియను కొన్ని రోజులుగా నిశితంగా ప్రజలు గమనిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ట్రైయాంగిల్ వార్ గతంలో ఏ ఉప ఎన్నికలో లేనంతగా దుబ్బాకలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ధరణి కార్యక్రమం ప్రసంగంలో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ కేసీఆర్ ప్రసంగం ఉంటుందని అంతా ఊహించారు. కానీ తన ప్రసంగ పాఠం ఆ స్థాయిలో కనిపించలేదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అంటే.. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఇక ఫైనల్ అని కేసీఆర్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే తన ప్రసంగంలో దుబ్బాక ఎన్నికలపై తన స్థాయికి తగినట్లుగా మాట్లాడలేదని అనుకోవాల్సి ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన కేసీఆర్..
ఈ రోజు మధ్యాహ్నం ధరణి పోర్టల్ సేవలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెవెన్యూ సేవల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ పోర్టల్లో కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూ వివరాలను పొందుపరిచినట్లు సీఎం తెలిపారు. తెలంగాణ యోధుడు వీరారెడ్డి గ్రామం కావడంతోనే మూడు చింతపల్లి నుంచి ధరణిని ప్రారంభోత్సవానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ పోర్టల్ దేశానికే ట్రెండ్ సెట్టర్ అన్నారు. అనేక విషయాల్లో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా ఉందన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని సాధ్యం చేసి చూపించామన్నారు. సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించామని సీఎం పేర్కొన్నారు. రైతుల భూముల సంపూర్ణ రక్షణ కోసమే ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. నూతన సంస్కరణలు వచ్చినప్పుడు చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయని, వాటిని దాటుకుంటూ ముందుకు పోవాలని అన్నారు. రాష్ట్రంలో ఇక అక్రమ రిజిస్ట్రేషన్లు జరగవని సీఎం అన్నారు.