వందేళ్ల తర్వాత వచ్చి పడిన విపత్తు హైదరాబాద్ మహానగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రజలకు తీరని కష్టాల్ని తీసుకొస్తే.. పాలకులకు భారీ షాకిచ్చింది. కరోనా కారణంగా దాదాపు ఆర్నెల్ల విలువైన కాలం పోయిందన్న భావనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. పాలనా బండిని పరుగులు తీయించాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా కీలక నిర్ణయాల్ని వరుస పెట్టి తీసుకుంటున్నారు. వాతావరణం సానుకూలంగా ఉందన్న అంచనాతో వరుస పెట్టి ఎన్నికల్ని పూర్తి చేయాలని భావించారు.
ఊహించని రీతిలో వచ్చి పడ్డ వరదలు
ఇలాంటివేళ.. ఊహించని రీతిలో వచ్చి పడిన వరదలతో మొత్తం ప్లాన్ మార్చుకోవాల్సిన పరిస్థితి. ఇటీవల కాలంలో చూడనటువంటి ఉత్పాతంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. కోటికిపైగా ఉన్న జనాభాలో దాదాపు పావు శాతం మంది ప్రజలు వరదల కారణంగా ప్రభావితమై ఉంటారన్నది ఒక అంచనా. దీనికి తోడు పాలనా యంత్రాంగం సైతం విపత్తు వేళ సరిగా పని చేయలేదన్న మాట బలంగా వినిపిస్తోంది.
మా గోడు పట్టించుకోవట్లేదంటూ దాడులు
దీనికి తగ్గట్లే.. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెుల్యేలు.. కార్పొరేటర్లకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. వీటిని చక్కదిద్దుకోవటంతో పాటు.. హైదరాబాద్ మహానగరాన్ని గాడిన పడేయటం.. వరదల కారణంగా మనసులకు తగిలిన గాయాల్ని మాన్చటమే కేసీఆర్ సర్కారు ముందున్న లక్ష్యం. అలాంటివేళ.. త్వరలో గ్రేటర్ ఎన్నికలు షురూ అవుతాయన్న అంశం తెర మీదకు రావటం విస్మయానికి గురి చేస్తోంది. ఇవాల్టి పత్రికల్ని చూసినప్పుడు గ్రేటర్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయన్న విషయాన్ని ఎమ్మెల్యేలకు చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది.
నిజంగానే ఆ మాటలు అన్నారా?
నిజంగానే కేటీఆర్ నోటి నుంచి అలాంటి మాటలు వచ్చాయా? అన్నది ప్రశ్నగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల గురించి మాట్లాడటాన్ని ఎవరూ హర్షించరు. ప్రజలు జీర్ణించుకోలేరు. ఓవైపు తాము పుట్టెడు కష్టంలో ఉంటే రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారన్న మాట చాలు..అధికారపక్షానికి అంతులేని డ్యామేజీ జరుగుతుంది. మరోవైపు.. పరిహారంలో భాగంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి రూ.10వేలు తక్షణసాయం.. తర్వాతి రోజుల్లో.. బాధితులు నష్టపోయిన దానికి అనుగుణంగా రూ.50 వేలు.. రూ.లక్ష ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఈ సాయం మొత్తం ఎన్నికలకు ముందు తాయిలం వేయటానికి అన్న ప్రచారాన్నిప్రతిపక్షాలు లేవనెత్తితే అధికార పక్షం ఇబ్బందులకు గురి కావటం ఖాయం.
ఇలా ఏ రకంగా చూసినా.. ఎన్నికల గురించి మంత్రి కేటీఆర్ మాట వరసకు ప్రస్తావించినా.. నష్టమే తప్పించి లాభం ఉండదు. ఈ విషయం తెలియనంత అమాయకుడేం కాదు కేటీఆర్. మరి.. చేయకూడని తప్పును ఎందుకు చేస్తున్నట్లు? పొరపాటు పడ్డారా? మీడియానే పొరపాటుగా లేనిపోనివి రిపోర్టు చేస్తుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నలుగా మారాయని చెప్పాలి.