నాడు – నేడు పనులతో ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దాం అని వైసీపీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లుగానే కనిపిస్తున్నాయి. కర్నూల్ జిల్లాలో జరిగిన ఘటనే అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. గోనెగండ్లలోని అచ్చకట్ల వీధిలో ఉన్న అప్పర్ ప్రైమరీ ఉర్దూ పాఠశాల గోడ పెచ్చులు ఊడి పడి రెండో తరగతి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులు మహమ్మద్ ఆరిఫ్, సఫాన్ బాషా గోడకు ఆనుకొని కూర్చొని ఉండగా పెచ్చులు ఊడి తలపై పడ్డాయి. తీవ్ర గాయాలు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే స్కూల్‌కు వచ్చి, వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, వైద్యులు చిన్నారులకు కుట్లు వేసి చికిత్స అందించారు.
ఇక ఈ ఉదంతం పై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొన్నేళ్లుగా స్కూల్ లో పరిస్థితులు ఇదే విధంగా ఉన్నాయని, ఎవరూ పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరని ఆగ్రహం వ్యక్తమ చేస్తున్నారు. గోడలు, సీలింగ్ పెచ్చులు ఊడిపోతున్నాయని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు.పిల్లలకు ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వాహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.