నవ్యాంధ్రలో కరోనా వైరస్ పేరు చెప్పి వినాయక చవితి ఉత్సవాలను రద్దు చేస్తూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై అటు హిందూ భక్తులతో పాటు ఇటు అన్ని మతాల వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వినాయక చవితి ఉత్సవాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు.. జగన్ సర్కారుకు షాకిచ్చే తీర్పును వెలువరించింది. అదే సమయంలో వైసీపీ ర్యాలీలకు అడ్డురాని కరోనా ఆంక్షలు.. వినాయక చవితి ఉత్సవాలకే వచ్చాయా అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. వరుసగా వచ్చిన ఈ రెండు అంశాలతో వైసీపీకి తడిసిపోయిందనే చెప్పాలి.
హైకోర్టు ఏమన్నదంటే..?
గణేశ్ ఉత్సవాలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారించిన కోర్టు ప్రైవేట్ స్థలాల్లో వినాయక ఉత్సవాలను నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రైవేటు స్థలాలలో విగ్రహాలను ఏర్పాటు చేసుకుని, వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవడానికి అనుమతిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భక్తులు కోవిడ్ నిబంధనలను పాటించాలని, ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని చెప్పంది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కు ఎవరికీ లేదని హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే, పబ్లిక్ స్థలాలలో మాత్రం ఉత్సవాలు నిర్వహించకూడదని పేర్కొంది. మొత్తంగా జగన్ సర్కారు జారీ చేసిన నిషేధం చెల్లదంటూనే.. ప్రైవేట్ స్థలాల్లో వినాయక చవితి ఉత్సవాలను అడ్డుకోరాదంటూ సంచలన తీర్పు చెప్పింది.
వైసీపీ ర్యాలీలను నిషేధించలేదే
వినాయక చవితి ఉత్సవాలను రద్దు చేసిన వైనంపై టీడీపీ అన్ని పార్టీల కంటే ముందే స్పందించింది. ఈ నిర్ణయం తుగ్లక్ నిర్ణయమేనని కూడా తూర్పారబట్టింది. తాజాగా హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్టిట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. జగన్ సర్కారు తీరుపై మండిపడిన ఆయన.. ‘‘మీ నాన్న గారి జయంతి-వర్ధంతి, మీ వివాహ వార్షిక వేడుకలు, వైకాపా నాయకుల వ్యక్తిగత కార్యక్రమాలకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు ఒక్క వినాయక చవితికి మాత్రమే ఎందుకు అడ్డొచ్చాయి జగన్ గారూ?’’ అని ప్రశ్నించారు. అలాగే కడప జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే నిర్వహించిన ఒక కార్యక్రమం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘కడప జిల్లా ప్రొద్దుటూరులో కనీస కోవిడ్ నిబంధనలు పాటించకుండా స్థానిక ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కన్నబాబు, ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా హాజరయ్యారు. మీరంతా కోవిడియట్స్‌లా వ్యవహరిస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు. ‘‘సూపర్ స్పైడర్లుగా విచ్చలవిడిగా తిరుగుతుంటే కరోనా వ్యాపించదా? వినాయక చవితి జరుపుకుంటేనే కోవిడ్ కోరలు చాస్తుందా?’’ అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని లోకేశ్ ప్రశ్నించారు.