థియేటర్లకు జనం రాక నిర్మాతలు కుయ్యోమొర్రో అనుకుంటున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం మాత్రం సినిమాను అడ్డంగా బుక్ చేసేసింది. జనం కూడా సినిమా షో కోసం బుక్ మై షో దాకా వెళ్ల నవసరం లేదు. ఎంచక్కా ఓ చక్కటి వెబ్ సైట్ ను ప్రజల ముందుకు తెచ్చేస్తోంది. ఇది వరమా శాపమా? అన్నది మాత్రం నిర్మాతలకు అర్థం కావడం లేదు. ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు సినీ పెద్దలతో చర్చించారా లేదా అన్నది తెలియదు. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దలతో సినిమా రంగ సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.
సినిమా పెద్దలు కూడా సీఎంను కలవడానికి సన్నద్ధంగా ఉన్నారు. కాకపోతే రేపో మాపో అన్నట్లుగా కాస్త ఆలస్యం చేశారు. ఈలోగానే ప్రభుత్వం ఓ విప్లవాత్మక నిర్ణయం తీసేసుకుంది. తమిళనాడు ప్రభుత్వాన్ని అందరూ పొగుడుతున్నారు కాబట్టి ఆ ప్రభుత్వ మార్గాన్నే అనుసరిస్తే మేలన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం చేపట్టినట్టే సినిమా టిక్కెట్ల కోసం ఏపీ ప్రభుత్వం కూడా ఓ ప్రత్యేకమైన వెబ్ పోర్టల్ ను ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేసింది. రైల్వే ఆన్ లైన్ టిక్కెంటింగ్ తరహాలోనే ఓ వెబ్ సైట్ రూపొందబోతోంది.
ఈ వ్యవహారాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుంది. తమిళనాడులో ఇలాంటి వ్యవస్థ కొంతకాలం క్రితం ప్రారంభమైంది. బి, సి సెంటర్లను కూడా అక్కడ ఆన్ లైన్ చేస్తున్నారు. ఇప్పుడు అదే మార్గాన్ని ఏపీ ప్రభుత్వ కూడా అనుసరించబోతోంది. దీని విధివిధానాల కోసం ప్రత్యేక కమిటీని ప్రభుత్వం నియమించనుంది.
దీని ప్రకారం ప్రతి నెలా 30వ తేదీన నిర్మాతలకూ, డిస్ట్రిబ్యూటర్లకూ ఎవరికి ఇవ్వాల్సిన వాటాను వారికి ఇచ్చేస్తారన్న మాట. అప్పటిదాకా సినిమాకి వసూలైన డబ్బంతా ప్రభుత్వం వద్దే ఉంటుంది. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం కనిపిస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే సినిమా రంగం కుదేలైంది. ఇప్పుడీ కొత్త వ్యవస్థను అర్థం చేసుకోడానికి కూడా కొంత సమయం పట్టవచ్చు. దీని మీద ఇంకా ఎవరూ నోరు విప్పడం లేదు.
Must Read ;- కాపాడతారనుకుంటే.. అప్పగించేశారు











