గుండు సూది నుండి కారు వరకు సామాన్యుడికి అందుబాటులో ఉండేలా అందించే సంస్థ ఏదంటే ‘టాటా’ అని చెప్పచ్చు. కార్ గురించి సామాన్యుడు ఆలోచించానికి కూడా అవకాశం ఉండని రోజుల్లోనే.. ‘నానో’ ఆలోచనతో సామాన్యుడు కూడా కార్‌లో తిరిగేలా చేసిన మన భారతీయ సంస్థ టాటా. అటువంటి సంస్థకు అధినేతగా ఎదిగినా.. వివాదరహితుడిగా పేరు గాంచిన సామాన్యుడు రతన్ టాటా. 1937 డిసెంబర్ 28న ముంబై పుట్టిన రతన్ టాటా.. 1975లో హార్వార్డ్ బిజినెస్ స్కూల్ నుంచి పట్టా పొందారు. తన ముత్తాత జమ్సేట్జీ టాటా స్థాపించిన సంస్థకు 1990లలో బాధ్యతలు స్వీకరించారు రతన్ టాటా..
సామాన్యుడికి దగ్గరైతేనే వ్యాపారం..
సామాన్యుడికి దూరంగా ఉండేది వ్యాపారం కాదంటారు రతన్. అతి సామాన్యుడు కూడా మన వస్తువులు కొనేలా తయారుచేసినపుడే ఆ సంస్థ విజయం సాధించినట్లని గట్టిగా నమ్ముతారు. ఈ విషయాన్ని ఆచరణలో చూపిన వ్యక్తి. అంతేకాదు.. సామాన్యుడికి దగ్గరయ్యేలా రూపొందించడమే తన విజయానికి కారణమని కూడా చెప్తారు. అందుకే సంస్థ పగ్గాలు చేపట్టగానే సామాన్యుడి ఇంటిలో వాడే వస్తువుల నుండి.. ఇంటిని కట్టడానికి ఉపయోగించే వస్తువుల వరకు ప్రతి వస్తువును అందించే సంస్థగా తీర్చిదిద్దాడు రతన్ టాటా. సామాన్యుడి ఇంటి ముందు కూడా కార్ ఉంటాలనే రతన్ టాటా ఆలోచనకు రూపమే ‘నానో’ ప్రాజక్ట్. అంతలా తన ఆలోచనలకు తీర్చిదిద్దుకున్నాడు కాబట్టే తనే కాదు.. తాను నడిపిన సంస్థ సైతం వివాదరహితమైనదిగా నిలిచింది.
రతన్ ప్రేమ కథ..
83 ఏళ్లు వచ్చినా.. రతన్ టాటా ఇప్పటికీ బ్యాచిలర్ అని అందరికీ తెలుసు. మరి ఈ బ్యాచిలర్ స్వీట్ లవ్ స్టోరీ గురించి మీకు తెలుసా? ఒకానొక సందర్భంలో తన ప్రేమ కథను పంచుకున్నారు టాటా. అమెరికాలో 1960లో ఉన్న సందర్భంలో తాను ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చారు. ఇంట్లోని వాళ్లకి చెప్పి వివాహాం చేసుకునే దిశగా ప్రయత్నాలు కూడ చేశానని చెప్పారు. తనతో భారత్ కు రావడానికి కూడా తను సిద్ధమైందని.. కానీ అదే సమయంలో ఇండియా-చైనా యుద్ధం కారణంగా ఆమె తనతో రాలేకపోయినట్టు చెప్పుకొచ్చారు. కానీ తన బామ్మ కోసం ఇండియాకి రావడంతో ఆ ప్రేమ కథ అక్కడితో ఆగిపోయిందని చెప్పారు. ఒకానొక సందర్భంలో తన ప్రేమ కథను పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు టాటా.
ఆయన జీవితం నేటి వారికి ఆదర్శం
రతన్ టాటా నడవడికా.. వ్యాపార శైలి.. జీవితం నుండి నేటి వ్యాపారవేత్తలే కాదు.. సామన్య ప్రజలు కూడా నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. దేశంలో అతి పురాతన కాలంలో ప్రారంభించి.. నేటికి ఒక వెలుగు వెలుగుతున్న కంపెనీ బహుశా టాటానే అయుంటుంది. అటువంటి చరిత్ర కలిగిన కంపెనీ అధినేతగా వ్యవహరించిన రోజుల్లో కానీ.. రిటైర్ అయిన తర్వాత కానీ.. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఎంతో సింపుల్ గా కనిపించడం రతన్ టాటా గొప్పతనం. ఎక్కడా హంగూ ఆర్భాటాలు అనేవి కనబడవు. తన ఆలోచనలు కూడా అంతే సింపుల్‌గా ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం.
విజయం రహస్యమిదే..
తన సక్సెస్ గురించి చెప్పమని అడిగిన సందర్భంలో తను చెప్పే సూత్రాలివే.. ఒక సామాన్యడు ఎలా ఆలోచిస్తాడో.. ఎం కావాలనుకుంటాడో.. అలా నువ్వు ఆలోచించగలిగితే చాలు.. దాన్ని ఆధారంగా నీ వ్యాపారాన్ని రూపుదిద్దుకుంటే సరిపోతుందని చెప్తారు. అంతేకాదు.. మార్పులను స్వాగతించాలి. ఆ మార్పులకు అనువుగా నీ ఆలోచనలలో పరిణితి లేకపోతే మనం వెనకబడిపోతాం అనేది ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయంటారు టాటా. సరికొత్త ఆలోచనలు ఆవిష్కరణ లేనినాడు దేశ ప్రగతి ఉండదనేది రతన్ టాటా చెప్తుంటారు. కొత్త తరం.. ఆ పరిస్థితులకు తగ్గట్టుగా సరికొత్త విషయాలను కనిపెట్టిన నాడే గుర్తింపు నిలిచి ఉంటుందని చెప్తారు. ఎన్ని ఆధునిక పోకడలు వచ్చినా.. దేశీయత మేళవింపు వదలకూడదనేది మరచిపోకూడనేది నేటి యువత గుర్తుంచుకోవాలని ఎన్నటకీ చెప్తుంటారు టాటా.
ఎంత ఎదిగుతామో.. అంత ఒదిగి ఉండాలి అనేది నానుడికి నిలువెత్తు రూపం ‘రతన్ టాటా’.