కాలంతో పాటు మార్పులు సహజం. కొత్త మీద ఆశ.. ఆసక్తి రెండూ ఎక్కువే. చూసిన దాని కంటే చూడని దాని మీద మోజు ఉంటుంది కదా. అందుకు తగ్గట్లే పాలకుల్ని ఎన్నుకునే విషయంలో ప్రజలు ఎంపిక తీరు మారిపోతోంది. ప్రపంచ పరిణామాలకు తగ్గట్లే భారత్ లోనూ తమను పాలించే ప్రజా ప్రభువుల ఎంపిక విషయంలో గతానికి భిన్నమైన ధోరణిని ప్రదర్శిస్తున్నారు. దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ కావొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్న కేసీఆర్.. జగన్మోహన్ రెడ్డి కావొచ్చు.. వారి తీరే వేరుగా ఉంటోంది.
ఈ ముగ్గురిలోనూ కొన్ని కామన్ లక్షణాలు కనిపిస్తాయి. వీరు ముగ్గురు సొంత పార్టీ నేతలను కలిసేందుకు సైతం మక్కువ చూపరు. మంత్రుల స్థానంలో ఉన్న వారికి సైతం అపాయింట్ మెంట్ దొరకటం కష్టమే. ప్రజల మధ్యకు వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడరు. ఎంతో అవసరం ఉంటేనే అలాంటి పని చేస్తారు. మీడియాతో వివరాలు పంచుకోవటం ఉండదు. గత పాలకుల మాదిరి.. ఇష్టాగోష్టిలు లాంటి వాటికి ఇష్టపడరు.
ప్రభుత్వ సమాచారం బయటకు పొక్కకుండా ఉండేలా నియంత్రిస్తారు. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు. మాటల విషయంలో ఎవరికీ తీసిపోరు. ఎవరిని ఎక్కడ ఉంచాలన్న విషయంలో ఎవరికి ఎవరూ తగ్గని రీతిలో ఉంటారు. అన్నింటికి మించి.. ఈ ముగ్గురు కూడా అధికారానికి చేరువ కావటానికి చాలానే ప్రయాసలకు గురయ్యారు. వీరి నేపథ్యంలో ‘పోరాటం’ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
ఇలాంటి విలక్షణాలతో ఉండే వీరు పాలకులుగా తీసుకునే నిర్ణయాలు ఎప్పటికప్పుడు వినూత్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అదే సమయంలో.. సంక్షోభాలు.. విపత్తులు ఎదురైనప్పుడు వీరు స్పందించే తీరు చూస్తే నోట మాట రాక మానదు. తాజాగా తెలంగాణలోనే తీసుకోండి. రాష్ట్రం మొత్తంలో మూడు.. నాలుగు జిల్లాలు మినహాయిస్తే మొత్తంగా వర్షాల బారిన పడింది. వరద కౌగిలిలో చిక్కుకుంది. దగ్గర దగ్గర 1.25కోట్ల మంది ఉండే హైదరాబాద్ మహానగరంలో ఏ మూల చూసినా భారీ వర్షం మిగిల్చిన విషాదం కనిపిస్తూనే ఉంటుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ దాటి.. బాధిత ప్రాంతాల్ని సందర్శించింది లేదు. బాధితుల్ని పరామర్శించింది లేదు.
ఈ విషయంలో జగన్ కూడా పెద్దగా స్పందించేది ఉండదు. కాకుంటే.. కేసీఆర్ కంటే కాస్త మెరుగు అని చెప్పాలి. ఇక.. ప్రధాని మోడీ విషయానికి వస్తే.. ఏదైనా జరిగిన వెంటనే ట్వీట్లు చేయటం.. సంబంధిత ముఖ్యమంత్రులతో మాట్లాడటం చేస్తారు. లాక్ డౌన్ వేళ.. కోట్లాది మంది వలస జీవులు రోడ్ల మీద నడుస్తుంటే.. ఆయన స్పందించిన తీరు.. అధికార యంత్రాంగాన్ని నడిపించిన తీరు చూస్తే.. ఈ నయా పాలకుల పాలన చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేనిదని అనిపించక మానదు. అదే సమయంలో ప్రజలకు సైతం తాము ఎన్నుకున్న పాలకుల తీరు కొత్త అనుభవాల్ని మిగులుస్తోందని చెప్పక తప్పదు.











