థియేటర్లలో సినిమాలు లేకపోయినా ఓటీటీ వేదికలు ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నాయి. ఇతర భాషల్లో రూపొందిన సినిమాలను డబ్బింగ్ చేసి ఓటీటీలో ప్రసారం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇదివరకు సబ్ టైటిల్స్ తో ప్రసారం చేసేవాళ్లు ఇప్పుడు అది పోయింది. ఏకంగా డబ్బింగ్ చేసి అందిస్తున్నారు. దాంతో భాషా భేదం పోయింది. అది మలయాళ చిత్రమైనా, తమిళం అయినా తెలుగులోనే మనం చూసేయవచ్చు. అలా ఎన్నో మంచి చిత్రాలను చూసే అవకాశం మనకు వచ్చింది. తాజాగా ‘మూతోన్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. న్యూయార్క్ ఇండియన్ ఫెస్టివల్ లో ఈ సినిమాకి మూడు అవార్డులు కూడా వచ్చాయి. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథేంటి?
లక్ష దీవులు, ముంబై నేపథ్యంలో కథ సాగుతుంది. తన అన్నయ్య అంటే ముల్ల అనే 14 ఏళ్ల యువకుడికి ప్రాణం. కానీ ఆ అన్నయ్య ఎక్కడ ఉన్నాడో ఏమై పోయాడో తెలియదు. ఓ చేపలుపట్టే అతని దగ్గర అతను పెరుగుతూ ఉంటాడు. అన్నయ్యను అనుకరిస్తూ ఉంటాడు. అందరూ అతన్ని ఆటపట్టిస్తుంటాడు. స్కూలు కూడా మానేస్తాడు. ఇక అక్కడ లాభం లేదనుకుని ముంబై వెళ్లిపోతాడు. అక్కడ అతను పోలీసుల చేతికి చిక్కుతాడు. చివరికి అనాథ ఆశ్రమానికి చేరాల్సి వస్తుంది.
అక్కడ పరిచయమైన రాజు అనే కుర్రాడితో కలిసి అక్కడి నుంచి బయటపడతాడు. రాజు తల్లి రోసీ ఓ సెక్స్ వర్కర్. ముల్లను ఓ టీ కొట్లో పనికి పెడుతుంది. ఆ తర్వాత అతన్ని పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠా తీసుకెళ్లిపోతుంది. అతన్ని కిడ్నిప్ చేసిన భాయ్ డ్రగ్స్ వ్యాపారం కూడా చేస్తుంటాడు. అతను మరెవరో కాదు ముల్ల అన్నయ్యే. అతను తన అన్నయ్య అనే విషయం ముల్లాకు తెలియదు. ఈలోగా ముల్లాకు సంబంధించిన ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏమిటి? ముల్లా అన్నయ్య ఏంచేశాడు? అన్నదే ఈ సినిమా కథ.
ఎలా తీశారు? ఎలా చేశారు?
ఈ సినిమాకి కథ కన్నా కథనంలోనే ప్రత్యేకత కనిపిస్తుంది. ఇందులో హీరో అంటూ ఎవరూ ఉండరు. లింగ భేదాన్ని తెరకెక్కించడంలో దర్శకురాలు తన ప్రత్యేకత చూపారు. నివిన్ పౌలీ చక్కగా చేశాడు. ముల్లా అన్నయ్య అక్బర్ పాత్రను అతను పోషించాడు. చిత్రోత్సవంలో అతనికి ఉత్తమ నటుడిగానూ అవార్డు దక్కింది. ‘ప్రేమమ్’ సినిమాలోని నటనకు అతనికంటూ ప్రత్యేక అభిమానులు ఏర్పడ్డారు. హోమో సెక్స్ సన్నివేశాల చిత్రీకరణలోనూ దర్శకురాలు ప్రత్యేకత చూపారు. మరో కీలక పాత్ర అమీర్ గా రోషన్ మాథ్యు నటించాడు. కళ్లతోనే అతను హావభావాలను పలికించాడు. ఉత్తమ బాలనటిగా సంజనా దీపు కూడా చలన చిత్రోత్సవంలో అవార్డును అందుకుంది. ఇందులో శోభిత దూళిపాళ పాత్ర ఏమిటన్నది కూడా మనం చూసి తెలుసుకుంటేనే మంచిదేమో.
హైలైట్స్:
సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం ప్రధాన హైలైట్ గా చెప్పుకోవాలి. అలాగే పాత్రోచితమైన నటనకు అందరూ పెద్ద పీట వేశారు. ఎడిటింగ్ బాగా కుదిరింది. లోకేషన్ల ఎంపికలోనూ దర్శకురాలి శ్రద్ధ కనిపిస్తుంది. అది కళాదర్శకుడి గొప్పతనం కూడా అనుకోవాలి.
నటీనటులు: నవీన్ పౌలి, శశాంక్ అరోరా, సంజనా దీపు, శోభిత ధూళిపాళ, రోషన్ మాథ్యూ, మెలిస్సా రాజు థామస్.
సాంకేతిక వర్గం: సినిమాటోగ్రఫీ రాజీవ్ రవి, సంగీతం సాగర్ దేశాయ్, స్క్రీన్ ప్లే గీతూ మోహన్ దాస్, అనురాగ్ కశ్యప్, శ్రీజా శ్రీధరన్, ఎడిటిర్ బి. అజిత్ కుమార్.
నిర్మాత: అనురాగ్ కశ్యప్
దర్శకత్వం: గీతూ మోహన్ దాస్
ఎక్కడ చూడాలి: ఆహా (ఓటీటీ)
భాష: తెలుగు
ఒక్క మాటలో: చూడాల్సిన సినిమా
విడుదల తేదీ: అక్టోబరు 16, 2020
రేటింగ్: 3/5
– హేమసుందర్ పామర్తి