రాజధాని అమరావతిలో భూముల క్రయవిక్రయాల్లో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సన్నిహితుడు, కిలారు రాజేష్ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సమావేశంలోనే గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఉంటుందని ప్రకటించారు. స్థానిక మీడియా, జాతీయ మీడియా రాజధాని రాబోయే ప్రదేశం గుంటూరు విజయవాడ మధ్యేనని మొదటి పేజీల్లో వార్తలు ప్రచురించాయి. ఇదే విషయాలను హైకోర్టులో కిలారు రాజేష్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనలపై సంతృప్తి చెందిన ధర్మాసనం రాజధాని అమరావతిలో భూముల లాావాదేవీల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదం వాడడం సరికాదని తీర్పు వెలువరించింది. ఇప్పటికే రాజధాని భూముల క్రయవిక్రయాలపై సీఐడీ విచారణ నిలిపివేయాలని హైకోర్టు గతంలోనే తీర్పు వెలువరించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
నష్టపోయినవారు ఎక్కడ?
అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తుందని ముందే టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదలను హైకోర్టు కొట్టి వేసింది. భూములు అమ్ముకున్న వారు ఎవరూ తాము నష్టపోయామని కోర్టుకు రాలేదని ధర్మాసనం గుర్తుచేసింది. కిలారి రాజేష్ భూములు కొనుగోలు చేసిన ప్రాంతం కూడా రాజధాని పరిధిలో లేదు. రాజధాని సమీపంలోని కంతేరు గ్రామంలో ఆయన భూముల క్రయవిక్రయాలు జరిపారు. దీనికి సంబంధించి నష్టపోయిన వారు ఎవరూ కోర్టును ఆశ్రయించలేదని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. రాజధాని ఈ ప్రాంతంలో వస్తుందనే విషయం రహస్యం కాదని, గుంటూరు విజయవాడ మధ్య వస్తుందని సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార బహిరంగ సభలో ప్రకటించారని కిలారు రాజేష్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం రాజధాని పరిధిలో భూముల క్రయవిక్రయాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని తీర్పును వెలువరించింది.
సెబీ చట్టాలకే వర్తిస్తుంది
ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది కేవలం సెబీ చట్టాలకే వర్తిస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది. షేర్ల కొనుగోళ్లు అమ్మకాల్లో మాత్రమే ఇన్ సైడర్ ట్రేడింగ్ ఉటుందని ఆ చట్టాలను సెబీ పర్యవేక్షిస్తుందని ధర్మాసనం వెల్లడించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన అంశం కాదని సుస్పష్టం చేసింది. రాజధాని పరిసరాల్లో ఎవరు భూములు క్రయవిక్రయాలు జరిపినా అది ఇన్ సైడర్ ట్రేడింగ్ పరిధిలోకి రాదని తేల్చి చెప్పింది. అసలు భూముల క్రయవిక్రయాలకు ఇన్ సైడర్ ట్రేడింగ్ చట్టాలు వర్తించనప్పుడు ఆ పదమే ఇక్కడ అప్రస్తుతమని ధర్మాసనం అభిప్రాయపడింది.
రాజధానిలో భూములకూ ఇదే రూల్
కేవలం రాజధాని పరిసర ప్రాంతాల్లోనే కాదు, రాజధాని అమరావతికి భూములిచ్చిన 29 గ్రామాల్లో భూములు కొనుగోలు చేసిన వారికి కూడా ఇదే రూల్ వర్తిస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన విషయాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదమే లేదని వారు స్పష్టం చేస్తున్నారు. రాజధానికి మార్కింగ్ చేసిన ప్రాంతానికి బయట కొనుగోలు చేసిన వారికి ఒక తీర్పు, రాజధాని పరిధిలో కొనుగోలు చేసిన వారికి మరో తీర్పూ వర్తించదని కూడా న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. రాజధానిలో భూములు కొన్నవారికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు గుర్తుచేస్తున్నారు.