సహజంగా మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరంలో మంచి, చెడు అని రెండు రకాల కొలెస్ట్రాల్ లు ఏర్పడుతాయి. మన శరీరంలో పేరుకుపోయే అధిక కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరంగా పరినమిస్తుంది. దానిని తేలికగా తీసుకుంటే ఒక మహమ్మారిగా మారి ప్రాణాలను కూడా హరించే ప్రమాదం ఉంది.సాధారణంగా మనం తీసుకునే ఆహారం కొవ్వులుగా మారతాయి.మన శరీరంలో పేరుకుపోయే మోతాదు మించిన చెడు కొలెస్ట్రాల్ రక్త ప్రవాహ మార్గంలో అవరోధంగా మారతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ బారిన పడతాము.
ముఖ్యంగా ఈ చెడు కొలెస్ట్రాల్ లేదా లో డెన్సిటీ లిపో ప్రొటీన్ అనేది దేహ భాగాలకు లోపలగా అమరి ఉండే ధమనుల గోడలకు అతుక్కుపోతుంది. ఇక ఎల్డీఎల్ పెరిగిపోవడం వల్ల రక్తం అలలుగా ప్రవహించే ధమనులలో రక్త ప్రవాహ మార్గాన్ని ఏదో ఒక రోజు పూర్తిగా మూసుకుపోతుంది. దాంతో గుండెకు రక్తం అందదు. ఫలితంగా గుండె చేతులు ఎత్తేస్తుంది. అధిక ఫ్యాట్ ఉండే పదార్థాలు తినడం, ఆల్కహాల్ సేవనం ఈ రెండూ ఎల్డీఎల్ పెరిగేందుకు ఎక్కువ కారణం అవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే సిరమ్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా మనలో అధిక కొలెస్ట్రాల్ ఉందా ? లేదా అనేది తెలుసుకోవచ్చు. 12 గంటల పాటు ఎటువంటి ఆహారం తీసుకోకుండా, ఆ తర్వాత చేయించుకోవాల్సిన పరీక్ష ఇది. ఇందులో మనకు హాని చేసే కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్, మంచి కొలెస్ట్రాల్ ఎంతున్నది అనేది తెలుస్తుంది.
కొన్ని సందర్భాల్లో మన శరీరం నుండి విడుదల అయ్యే సంకేతాలు కూడా మనలో కొలెస్ట్రాల్ ఉందా? లేదా? అనేది తెలియజేస్తాయి.ప్రధానంగా ధమనుల్లో కొవ్వులు పేరుకుపోవడాన్ని పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ లేదా ప్యాడ్ అని అంటారు. ఇలా పేరుకుపోయిన అధిక కొలెస్ట్రాల్ వల్ల మన కాళ్లకు రక్త సరఫరా తగినంతగా ఉండదు.ఫలితంగా కాళ్లలో నొప్పులు, మంటలు, గ్యాంగ్రీన్ వంటివి కనిపిస్తాయని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ తెలిపింది.
అయితే ఈ ప్యాడ్ లక్షణాలు ఎలా ఉంటాయనేది కూడా ఈ ఫౌండేషన్ పేర్కొంది. ముఖ్యంగా ప్యాడ్ లక్షణాలు ఉన్న వారిలో కాళ్లకు ఉన్న వెంట్రుకలు రాలిపోవడం, కాళ్లలో బలహీనత, తిమ్మిర్లు, కాలి వేలి గోళ్లు నిదానంగా పెరగడం, పుండ్లు ఏర్పడి మానకపోవడం, చర్మం రంగు మారడం, మగవారిలో అయితే అంగస్తంభన లోపించడం, కాలి కండరాలు సంకోచించడం వంటివి పరినమిస్తూ ఉంటాయి. ఇటువంటి లక్షణాలు ఏవైనా కనిపించినా లేక వయసు 40 దాటినా ఒకసారి డాక్టర్ లను సంప్రదించడం, కొలెస్ట్రాల్, హార్ట్ స్క్రీన్ మంచిదని సూచిస్తున్నారు. అదేసమయంలో వైద్యులు మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి అధికంగా ఉన్నట్లు గుర్తిస్తే వారు సూచించిన మందులతో పాటు.. మనం తీసుకునే ఆహారంలో మార్పులు, శారీరక వ్యాయామాలను చేయడం ద్వారా ప్రమాదాల బారిలా పడకుండా ఉంటామని చెబుతున్నారు.