హీరోయిన్స్ అంటే.. కేవలం డాన్సింగ్ డాల్స్. పాటల్లో మాత్రమే తళుక్కుమనే మెరుపుతీగలు. సినిమా మంచి రసపట్టులో సాగుతుంటే.. దానికి బ్రేకేసి.. హీరోలతో రొమాన్స్ సాగించే బ్యాచ్. అవసరం ఉన్నా లేకపోయినా.. గ్లామర్ ప్రదర్శించే బాపతు. ఇదీ మన హీరోయిన్స్ మీద నిన్న మొన్నటి వరకూ ఉన్న ఒక అభిప్రాయం. కానీ ఇప్పుడు వారి తీరుమారుతోంది. పాత్ర పోషణలో వాళ్ళు తీసుకుంటున్న స్పెషల్ కేర్ ఆశ్చర్యపరుస్తోంది. అది ఎంతగా అంటే… విలన్స్ గా మారడానికి కూడా వెనుకాడడం లేదు. ప్రస్తుతం సౌత్ లో క్రేజీ స్టార్స్ గా వెలుగొందుతున్న కొందరు ఆడ లేడీస్ … విలన్ అవతారమెత్తుతున్నారు.
శ్రియా సరన్ : ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి క్రేజీ హీరోయిన్ అనిపించుకుంది శ్రీయా శరణ్. ఆ తర్వాత నుంచి అవకాశాలు అందుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ క్రమంలో పలు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవల కాలంలో పెళ్ళి చేసుకొన్న అమ్మడు .. సోషల్ మీడియాలో ఫుల్ బిజీ అయిపోయింది. అమ్మడి పరిస్థితి ఇలా ఉండగానే.. ఇప్పుడో సినిమాలో లేడీ విలన్ గా నటించేందుకు సిద్ధమవుతోందని సమాచారం.
ఆ సినిమా బాలీవుడ్ చిత్రం ‘అంధాధున్’ కు తెలుగు వెర్షన్. అది కూడా ఒరిజినల్ లో టబు చేసిన పాత్ర. తనకు ఎవరు అడ్చొచ్చినా చంపడానికి కూడా వెనుకాడని క్రూయల్ కేరక్టర్ అది. ఆయుష్మాన్ ఖురానా పాత్రను నితిన్ చేస్తుండగా.. మెర్లపాక గాంధి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. నిజానికి ఈ పాత్ర నయనతార దగ్గరకు వెళ్లింది . అయితే ఆమె ఈ పాత్రకు అంగీకరించలేదట. మరి విలన్ గా శ్రీయా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
హన్సిక : దేశముదురు తో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన హన్సికా మొత్వానీ .. ఆ తర్వాత కోలీవుడ్ లో ఓ రేంజ్ లో వెలిగిన సంగతి తెలిసిందే. అపర ఖుష్బూగా కీర్తి గడించిన అమ్మడికి కొంతకాలంగా కోలీవుడ్ లో కూడా ఆఫర్స్ కరువయ్యాయి. ఈ క్రమంలో కోరుకున్న గ్లామర్ పాత్రలు దక్కట్లేదు కాబట్టి.. వచ్చిన పాత్రలే దక్కించుకొనే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే హన్సిక ఇప్పుడు విలన్ అవతారమెత్తుతోంది.
సినిమా పేరు మహా. ఆమె 50వ సినిమాగా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమా ..ఫస్ట్ లుక్ లో సాధువు గెటప్ లో హుక్కా పీలుస్తూ రివీల్ అయింది. ఆ పోస్టర్ వివాదానికి కూడా దారితీసింది. ఈ సినిమాతో హన్సిక బేబ్ .. మహా విలన్ అనిపించుకోవాలనే పట్టుదలతో ఉందట. దానికి తగ్గట్టుగానే పాత్ర పోషణలో కేర్ తీసుకుంటోందట. దీనికి దర్శకుడు యూ.ఆర్. జమీల్.
వరలక్ష్మి శరత్ కుమార్ : శరత్ కుమార్ కూతురిగా తమిళ చిత్ర సీమలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి ..ఇప్పటి వరకూ కథానాయికగా నటించిన చిత్రాలు చాలా తక్కువ. కొన్ని సినిమాల్లో ప్రధానమైన పాత్రలు పోషిస్తూనే.. విలన్ గానూ నటించి మెప్పించింది. సర్కార్ , పందెంకోడి 2, తెలుగు తెనాలి రామకృష్ణ, మలయాళంలో కసబా అనే సినిమాల్లో విలన్ గా అదరగొట్టింది. ఆమెలో గ్లామర్ కన్నా క్రూయల్టీ నే బాగా పలుకుతుంది కాబట్టి.. విలన్ పాత్రలే ఆమెను ఎక్కువగా వరిస్తుంటాయి. ఈ నేపథ్యంలో రవితేజ ‘క్రాక్’ మూవీ లో ఓ పవర్ ఫుల్ విలన్ పాత్రను పోషిస్తోంది.
సాయిపల్లవి : ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ లో కథానాయికగా మెరిసిన తమిళ పొణ్ణు సాయిపల్లవి.. తన సహజమైన నటనతో .. తెలంగాణ అమ్మాయి అయిపోయింది. ఆ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ తో నానీ ‘యం.సీ.ఏ’ లోనూ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత ‘పడిపడిలేచె మనసు’ సినిమాలో శర్వానంద్ తో రొమాన్స్ చేసింది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ లో నటిస్తోన్న సాయిపల్లవి.. రానా ‘విరాట పర్వంలో’ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది.
అలాగే… నానీ , రాహుల్ సాంకృత్యాయన్ (టాక్సీవాలా దర్శకుడు) కలయికలో తెరకెక్కుతోన్న శ్యామ్ సింగరాయ్ లో నూ నటిస్తోంది. అయితే ఇందులో సాయిపల్లవి నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర చేస్తోందని వార్తలొస్తున్నాయి. మూడు వైవిధ్యమైన పాత్రల్లో నానీ కనిపించనుండగా… అందులో ఒక పాత్ర కు జోడీగా ఆమె నటిస్తోందట.
మరి ఈ నలుగురు లేడీ విలన్స్ సౌత్ ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో మెప్పిస్తారో చూడాలి.