జగన్ అధికారం చేపట్టిన నాటి నుండి గత సంవత్సరం వరకు ప్రజాదరణ గల ముఖ్యమంత్రుల జాబితాలో టాప్ టెన్ లో ఉండేవారు. గత సంవత్సరం ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట ఇండియా టు డే నిర్వహించిన సర్వేలో ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో 4వ స్థానంలో ఉండగా ఈ సంవత్సరం అదే సంస్థ జరిపిన సర్వేలో టాప్ 10లో చోటు దక్కకపోగా, రాష్ట్రంలో 81% మంది ప్రజలు జగన్ పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసలు అంతలా జగన్ గ్రాఫ్ పడిపోవడానికి కారణాలు విశ్లేషిద్దాం పదండి.
ఇసుక కొరత
జగన్ అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలలకే ఇసుక కొరత ఏర్పడి భవన కార్మికులు రోడ్డున పడడం, ఇసుక రేట్లు అమాంతంగా ఆకాశానికి ఎక్కడం, ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు. అదే సందర్భంలో వైసీపీ నాయకులు ఇసుక మాఫియాగా అవతారమెత్తి ప్రక్క రాష్ట్రాలకు ఇసుకను అక్రమంగా తరలించడం మొదలెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిని జగన్ పాలనా వైఫల్యాల్లో ప్రధానమైనదిగా ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ భావన అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. అయినా కూడా జగన్ ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పెద్దగా చర్యలేమీ చేపట్టలేదని కూడా జనం భావిస్తున్నారు.
మూడు రాజధానులు
ఎన్నికల ముందు రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అని చెప్పడం, రాజధానికి 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులను నట్టేట ముంచిన ద్రోహి గా ముద్ర పడడం, 600 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న అమరావతి ఉద్యమంతో ప్రజలలో జగన్ పై వ్యతిరేకత భావన ఏర్పడింది.
కోర్టు తీర్పులు
జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలకు కోర్టులో వ్యతిరేకంగా తీర్పులు రావడం. అమరావతి అంశం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, మాన్సాస్ ట్రస్ట్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, స్థానిక ఎన్నికల నిర్వహణ, ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో వివాదం.. ఇలా అనేక విషయాలలో జగన్ ప్రభుత్వం తీసుకున్న దాదాపు 200 పైచిలుకు నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టులు ఇచ్చిన తీర్పులతో ప్రజలలో జగన్ పట్ల చులకన భావం ఏర్పడింది.
టీడీపీ నాయకుల పై కక్షసాధింపు
ప్రజల తరఫున పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీ టీడీపీ నాయకులపై నిరాధారమైన పోలీసు కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపపించడం. టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా మహేశ్వరరావు తదితరులపై నిరాధారమైన పోలీసు కేసులు పెట్టి కక్షపూరితంగా జైలుకు పంపించడం లాంటి చర్యల వలన ప్రజలు జగన్ లో ఒక విలన్ యాంగిల్ ను చూడడం మొదలెట్టారు. అంతేకాకుండా ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నా వైసీపీ నేతలపై ఎలాంటి కేసులు లేకపోవడం కూడా జగన్ పై ప్రజల్లో మరింత వ్యతిరేక భావనను పెంచిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మైనింగ్ మాఫియా
కొండపల్లి అటవీ ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అక్రమ మైనింగ్ వ్యవహారం, నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మైనింగ్ అక్రమాలు. తూర్పుగోదావరి జిల్లా, విశాఖ ఏజెన్సీ లో లేటరైట్ పేరుతో బాక్సైట్ అక్రమ తవ్వకాల వ్యవహారంలో జగన్ సొంత మనుషులే అక్రమాలకు పాల్పడడంతో ప్రజల్లో మరింత అనుమానాలు ఏర్పడ్డాయి. అవినీతి రాజ్యమేలుతోంది అని ప్రజలు ఓ నిర్ధారణకు వచ్చారు.
అవినీతి
విద్యా దీవెన కిట్స్ లో జరిగిన అవినీతి, నీటిపారుదల రంగంలో జరిగిన అవినీతి, రూ.41,043 కోట్లకు ఏ మాత్రం లెక్కలు లేకుండా ఖర్చు చేయడం. రహస్యంగా రూ.25,000 కోట్లు అప్పు చెయ్యడం.. ఈ నిధులను వేటికి ఖర్చు పెడుతున్నారో చెప్పకపోవడంతో జగన్ జమానాలో అవినీతి రాజ్యమేలుతోందని జనం ఓ అభిప్రాయానికి వచ్చారని చెప్పాలి. ఇలా పలు కారణాల వల్ల ప్రజలలో జగన్ గ్రాఫ్ పూర్తి స్థాయిలో దిగజారినట్లు విశ్లేషణలు సాగుతున్నాయి.