రాసలీలల కోసం మహిళలను రమ్మంటూ పిలుస్తున్న నేతల సంఖ్య వైసీపీలో పెరిగిపోతోందని చెప్పాలి. మొన్నటికి మొన్న మసాజ్ కోసం తన వద్దకు వచ్చేందుకు సిద్ధమైన ఓ మహిళ తాను అడిగిన పనులన్నీ చేస్తుందా? అంటూ అడిగి వైసీపీ అధికార ప్రతినిధి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆడియోలో అడ్డంగా బుక్ అయిపోయిన వైనం తెలిసిందే. అంబటి ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దానిని ఖండిస్తూ రాంబాబు చాలా విషయాలే చెప్పారు. ఏడాది పాటుగా తనపై కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే ఆ ఆడియో బయటకు వచ్చిందని ఆయన చెప్పారు. ఈ విషయం జనం మదిలో నుంచి చెరిగిపోకముందే..ఈ సారి జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) కూడా అంబటి మాదిరే ఆడియోలోనే దొరికిపోయారు. అంబటి ఇన్ డైరెక్టుగా మాట్లాడితే.. తాజా ఆడియోలో మాత్రం అవంతి.. ఓ మహిళను తన వద్దకు రమ్మంటూ పిలవడం సంచలనంగా మారిపోయింది. ఇప్పుడీ ఆడియో టేపు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మెయిన్ మీడియాలోనూ ప్రసారమై ప్రకంపనలు సృష్టిస్తోంది.
తెలిసిన మహిళనే ట్రాప్ చేశారా?
తాజా ఆడియో టేపులో అవంతి నేరుగా ఓ మహిళకు ఫోన్ చేసి తన వద్దకు రావాలంటూ కోరారు. అంతేకాకుండా తన వద్దకు వస్తే.. అన్ని బాగుంటాయని.. అన్ని రకాలుగా బాగుంటుంది.. చెప్పిన మాట విను అంటూ తనదైన శైలిలో ప్రలోభపెట్టే యత్నం చేశారు. అవంతి పిలుపునకు ఆ మహిళ ససేమిరా అంటుండగానే.. సరే మరి నీ ఇష్టం.. నీళ్లను దగ్గరికి తీసుకురాగలం కాని తాగించలేం కదా.. అంటూ మరింతగా రెచ్చిపోయారు. ఆ తర్వాత తన వద్దకు వస్తే.. అరగంటలోనే పంపించేస్తానని ఆ ఆడియోలో అవంతి చెప్పడం గమనార్హం. అయితే ఆ మహిళ నవ్వుతూనే మంత్రి ఆఫర్ కు ససేమిరా అన్నారు. ఈ సంభాషణలో ఆ మహిళ వేరేవరో కాదని, అవంతి ఇల్లో, కార్యాలయమో ఉన్న అపార్ట్‌మెంట్ లో నివసిస్తున్న మహిళే అని, అవంతితో ఆమెకు ముఖ పరిచయం కూడా ఉందని అర్ధమవుతోంది. కింద సెల్లార్ వాకింగ్ చేస్తున్నానని ఆ మహిళ అంటే.. సరే వచ్చేయి అరగంటలో పంపిస్తాను.. మాటలకు, చేతలకు చాలా తేడా ఉంటుంది.. అంటూ ఫ్లర్టింగ్ చేశారు. మొత్తం 2.20 నిమిషాల నిడివి ఉన్న ఈ ఆడియో టేపు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అవంతి ఏమంటారో..?
ఈ తరహా వీడియోలు బయటకు రాగానే.. తమకేమీ తెలియదని, కుట్రపూరితంగా తమ వాయిస్ ను ఇమిటేట్ చేస్తూ ఎవరో తామంటే గిట్టని వారు ఈ ఆడియోను బయటకు వదిలారని ప్రతి రాజకీయ నేతా చెప్పే మాటలు మనకు తెలుసు కదా. మొన్న అంబటి రాంబాబు కూడా ఇదే తరహాలో తనపై కుట్ర జరుగుతోందని, ఈ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని, ఇలాంటి వీడియోలను తన నియోజకవర్గ ప్రజలు నమ్మొద్దంటూ చిలుక పలుకులు పలికారు. అయితే ఆ తర్వాత ఆయన ఈ వ్యవహారంపై మరేమీ స్పందించలేదు. తనపై కుట్ర చేసిన వారెవరన్న విషయాన్ని కూడా వెల్లడించలేదు. దీనిని బట్టి చూస్తుంటే.. తాజాగా విడుదలైన ఆడియోపైనా అవంతి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంబటి మాదిరే తనపై కుట్ర జరుగుతోందని చెబుతారా? లేదంటే.. ఏకంగా టీడీపీ నేతలే తనను టార్గెట్ చేస్తూ ఈ ఆడియో విడుదల చేశారని అంటారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. విద్యా సంస్థల నిర్వహణలో చేయి తిరిగిన అవంతి ఇప్పుడు ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారన్నది ఆసక్తికరంగా మారింది.
Must Read ;- అంబటిపై హనీ ట్రాప్ విసిరిందెవరో తెలుసా?











